కానిస్టేబుల్‌ రామకృష్ణ

Constable Ramakrishna”అమ్మ ! రేపు ఉదయం లేవగానే ఈ టాబ్లెట్‌ వేసుకో మరిచిపోకు. నాకు ఈ రోజు నైట్‌ డ్యూటీ ఉంది” అని చెప్పి స్టేషన్‌కి బయలుదేరాడు కానిస్టేబుల్‌ రామకృష్ణ్ణ. తనతో పాటు పనిచేసే కుమార్‌ బండి మీద ఇద్దరు స్టేషన్‌కు బయలుదేరారు. నైట్‌ డ్యూటీ కదా నిద్ర రాకుండా ఉండాలని ఛారు తెప్పించుకొని తాగి డ్యూటీ ఎక్కారు.
కొద్దిసేపటి తరువాత ”రామకృష్ణ! పడుకోవయ్యా ఎవరైనా వస్తే చెబుతాను” అని అన్నాడు కుమార్‌.
”పర్లేదు సార్‌” అని విగ్రహంలా అలాగే కూర్చున్నాడు. స్టేషన్లో కూడా ఎలాంటి పని ఉన్నా ముందు రామకృష్ణకే చెప్పేవారు. కొంతమంది తన నిజాయితీని గుర్తిస్తే, మరికొంతమంది తన అమాయకత్వాన్ని వాడుకొనేవారు. నిజానికి తను అలా ఉండటానికి కారణం బాధ్యత కన్నా కూడా ఇప్పుడు ఉన్న ఈ స్థాయికి రావడానికి తను పడిన కష్టం గుర్తుకువస్తే వచ్చే భయం వల్ల.
రామకృష్ణ వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. హాస్టల్‌లో పనిచేస్తూ డిగ్రీ వరకు చదివించింది వాళ్ల అమ్మ భారతి. ఊరిలో ఉన్న ఇల్లు తప్ప ఇంక ఏ ఆస్థి లేదు రామకృష్ణ్ణకి. అందుకే వాళ్ల ఆకలి తీరాలన్నా, నలుగురిలో మర్యాదగా బతకాలన్నా ఉద్యోగం ఒక్కటే సరైన మార్గం అని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక మాములు రామకృష్ణ కానిస్టేబుల్‌ రామకృష్ణగా మారడం మాత్రం అంత సులువుగా జరగలేదు. డిగ్రీ చేస్తున్న సమయంలో పోలీస్‌ అవ్వడం కోసం ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తన ఖర్చుల కోసం చిన్న చిన్న పనులకి వెళ్లేవాడు. అలాగే ఒకటి రెండు సార్లు దగ్గరి దాకా వచ్చి పోయినా, మళ్లీ కష్టపడి సాధించాడు.
డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళదామని స్టేషన్‌ నుంచి బయటకి వస్తున్నాడు రామకృష్ణ.
”రామకృష్ణ.. ఈ రోజు నల్గొండ కోర్టులో పని ఉంది. నువ్వు, అనిల్‌ ఇద్దరు వెళ్ళండి” అని ఎస్‌ఐ అన్నాడు.
”సరే సార్‌” అని అన్నాడు రామకృష్ణ.
”కుమార్‌ సార్‌ మీరు వెళ్లేటప్పుడు ఒకసారి మా ఇంటికి వెళ్లండి, అమ్మ ఒక్కతే ఉంది” అని కుమార్‌కి చెప్పి నల్గొండకి బయలుదేరాడు.
ఇద్దరు నల్గొండ కోర్ట్‌ కి వచ్చారు. ”రామకృష్ణ నువ్వు నిన్న నైట్‌ డ్యూటీ చేసి అలిసి పోయినవ్‌, నువ్వు ఇక్కడే ఉండు నేను లోపల పని చూసుకొని వస్తా” అని వెళ్లాడు అనిల్‌. అక్కడే ఒక చెట్టు కింద కూర్చోని ఫోన్‌ వాడుతున్న రామకృష్ణ, పక్కనే ఒక పుస్తకం కనిపించింది. కావేరి అని దాని పైన పేరు ఉంది. పుస్తకం ఓపెన్‌ చేసి చదువుతున్నాడు. కొద్దిసేపటి తరువాత చదువుతూ ముందుకి చూశాడు. పోలీస్‌ షూస్‌ కనిపించాయి. వెంటనే పైకి చూశాడు. చేతిలో ఛారు గ్లాస్‌ పట్టుకొని పోలీస్‌ యూనిఫామ్‌లో ఉంది కావేరి. వెంటనే పుస్తకాన్ని పక్కన పడేసి వేరే వైపు తిరిగి కుర్చున్నాడు రామకృష్ణ. మొదటి నుంచి బార్సు కాలేజీలో చదవటం, ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా ఏ అమ్మాయితో ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల ఒక్కసారిగా కావేరిని చూడగానే అలా ప్రవర్తించాడు రామకృష్ణ. అది చూసిన కావేరికి నవ్వు ఆగలేదు.
”సార్‌.. పర్లేదు తీసుకోండి” అని కావేరి అనగానే ”వద్దు మేడం” అని జేబులో నుంచి ఫోన్‌ తీసి చూస్తున్నాడు.
”ఏ స్టేషన్‌ సార్‌” అని అడిగింది కావేరి.
”మునుగోడు మేడం”
”మునుగోడా! వామ్మో మొన్న ఎలక్షన్స్‌ వల్ల తెలంగాణ మొత్తం ఫేమస్‌ అయ్యింది. ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడేవాళ్లు”
”అవును మేడం. మొన్నటి వరకు మొత్తం హడావిడి ఉండే. అయినా ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్‌ ఉన్నాయి కదా. మనకు బాగానే పని ఉంటది”
”హా.. అవును సార్‌”
”ఇంతకీ మీది ఏ స్టేషన్‌ మేడం”
”మాది మిర్యాలగూడ స్టేషన్‌ సార్‌. కోర్ట్‌లో చిన్న పని ఉండి వచ్చిన. తొందరగా అయిపోతే వెళదాం అనుకున్నా కానీ సాయంత్రం అయ్యేలా ఉంది”.
”చూస్తుంటే మా పని కూడా లేట్‌ అయ్యేలా ఉంది మేడం. ఇంతకీ మీరు ఒక్కరే వచ్చారా”
”లేదు సార్‌. నాతో పని చేసే ఒక కానిస్టేబుల్‌ కూడా వచ్చిండు.”
వీళ్లిద్దరు మాట్లాడుకుంటుండ గానే కానిస్టేబుల్‌ అనిల్‌ అక్కడికి వచ్చాడు.
”అనిల్‌ సార్‌.. మేడం పేరు కావేరి. మిర్యాలగూడ స్టేషన్‌”అని పరిచయం చేసాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత ”రామకృష్ణ వెళ్లే దారిలో చిన్న పని ఉంది. చూసుకుని వెళ్దాం” అని అన్నాడు అనిల్‌.
”సరే మేడం.. కలుద్దాం” అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
భోజనం చేసి ఇద్దరు మునుగోడుకి బయలుదేరుతారు.
”ఏంటి సార్‌… ఏంది సంగతి. ఏమంటుంది కావేరి మేడం”
”ఏముంది సార్‌.. ఒకే డిపార్ట్మెంట్‌ కాబట్టి వెంటనే మాట్లాడేసింది” అని అన్నాడు రామకృష్ణ.
”అంతేనా.. ఇంకేం లేదా”
”సార్‌.. ఏంటి అలా మాట్లాడుతున్నారు. మనం పోలీసులం సార్‌”
”అయితే ఇందులో తప్పేముంది సార్‌. మనం ఏమన్నా తప్పుడు పని చేస్తున్నామా లేక ఎవరినైనా మోసం చేస్తున్నామా. అరె ఇప్పుడు డాక్టర్స్‌లో, లాయర్లలో, టీచర్స్‌లో, అంతెందుకు మన డిపార్ట్మెంట్‌లో కూడా ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్లు. ఒక్కొక్కరు యాభై ఏళ్లకు పెళ్లి చేసుకుంటుంటే మీరేంది సార్‌ ముసలోడిలాగా మాట్లాడుతున్నారు”
”అయినా ఆమెని మళ్లీ కలుస్తామో లేదో. ఇప్పుడెందుకు సార్‌ ఆమె గురుంచి” అని అన్నాడు రామకృష్ణ.
కొన్నిరోజుల తరువాత మునుగోడు స్టేషన్లో చిన్న పని పడింది కావేరికి. తెలిసినవాళ్ల ద్వారా రామకృష్ణ నెంబర్‌ తీసుకొని ”హలో సార్‌” అని మెసేజ్‌ చేసింది.
”ఎవరు” అని రిప్లై ఇచ్చాడు.
”నల్గొండ కోర్ట్‌ దగ్గర కలిసాం కదా సార్‌ కావేరి”
”మేడం మీరా. నా నెంబర్‌ ఎలా తెలిసింది మీకు”
”మీ స్టేషన్లో చిన్న పని ఉండే.. అందుకే మీ నెంబర్‌ తీసుకున్న”
”అవునా.. మళ్లీ కలవరేమో అనుకున్నా”
”V్‌ా్మ.. కలవడానికి ఏముంది” అని మెసేజ్‌ చేసింది.
”ఛా.. కలవరేమో అని అనవసరంగా మెసేజ్‌ పెట్టానేమో అని ఆలోచిస్తున్నాడు. రామకృష్ణ దగ్గర నుంచి రిప్లై లేదు.
”అవును.. మీ ఫ్యామిలీ ఉండేది కూడా మునుగోడులోనేనా”
”అవును మేడం. అమ్మ, నేను ఇద్దరమే ఉంటాం”
”అవునా. ఇంతకీ మీది ఏ బ్యాచ్‌ సార్‌”
”2015లో డిగ్రీ అయిపొయింది. 2018లో డిపార్ట్మెంట్‌లో జాయిన్‌ అయ్యాను”
”2015 ఆ, నేను ఆ టైంకి స్కూల్‌లో ఉన్నా”
ఆ మాట వినగానే పరువు పోయినట్టు అనిపించింది రామకృష్ణకి. వెంటనే మేడం మా ఎస్‌ఐ సార్‌ వచ్చాడు అని చెప్పి తప్పించుకున్నాడు.
ఇలా కొంచెం మొహమాటంతో మాట్లాడటం మొదలుపెట్టినా, మెల్లమెల్లగా తనతో మాట్లాడటం అలవాటు అయిపోయింది రామకృష్ణకి. కొన్నిరోజుల ఇలా ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరు ఎంత దగ్గర అయినా రామకృష్ణని మాత్రం సార్‌ అనే పిలిచేది కావేరి. నన్ను మాత్రం పేరు పెట్టే పిలవండి ఎంతైనా పెద్దవారుగా అని ఆటపట్టించేది.
తరువాత ఒకరోజు స్టేషన్‌కి వెళ్తున్నపుడు ఓ రాజకీయ పార్టీ వాళ్లు ఒక వ్యక్తితో గొడవపడుతూ కనిపించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఏమైంది అని అడిగాడు రామకృష్ణ.
”సార్‌ మా ఇంటికి వాళ్ల పార్టీ స్టిక్కర్‌ అంటిస్తుంటే వద్దు అన్నాను. దానికే గొడవ పడుతున్నారు” అని చెప్పాడు ఇంటి యజమాని.
”అతను వద్దు అంటుంటే ఎందుకు సార్‌” అని పార్టీ వాళ్లతో అన్నాడు రామకృష్ణ.
”ఓటుకి డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోలేదా. ఇప్పుడు స్టిక్కర్‌ అతికిస్తే ఏమవుతుంది”.
”అవన్నీ ఎందుకు సార్‌. తను వద్దు అంటున్నాడుగా వెళ్లండి” అని అన్నాడు రామకృష్ణ.
”మీ పోలీస్‌ వాళ్లకి మా పార్టీ అంటేనే ఎందుకో కోపం. వేరే పార్టీ వాళ్లకు అయితే వంగి మరీ దండాలు పెడుతారు”
”సార్‌.. మంచిగా మాట్లాడండి. మాకు ఎవరైనా ఒక్కటే. అయినా వాళ్లకు ఇష్టం లేనిది మీరు ఇలా పోస్టర్లు అతికించడం కరెక్ట్‌ కాదు” అని అన్నాడు.
రామకృష్ణ్ణకి ఆ పార్టీ వాళ్లకి ఇలా మాట మాట పెరుగుతుండగానే పక్కన ఉన్న జనాలు వీడియోలు తీశారు.
”ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఒక రాజకీయ పార్టీ నాయకులను ఎదిరించిన కానిస్టేబుల్‌ రామకృష్ణ” అని ఆ వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది.
ఆ వీడియో చూడగానే వెంటనే రామకృష్ణకి కాల్‌ చేసింది కావేరి. ”ఏంటి సార్‌ బాగా ఫేమస్‌ అయ్యారు. ఎక్కడ చూసినా మీ గురుంచే మాట్లాడుతున్నారు. మా స్టేషన్‌ల కూడా నీ గురించే డిస్కషన్‌”
”అదేం లేదు కావేరి. చిన్న గొడవకి ఇంత చేస్తున్నారు. పొగిడేవాళ్ల కన్నా తిట్టే వాళ్లే ఎక్కువ ఉన్నారు. ఒక్క పది నిమిషాల్లో మొత్తం మారిపోయింది. ఎక్కడికైనా వెళదాం అన్నా ఏదోలా ఉంది.”
”ఆ నువ్వేమన్న తప్పు చేసినవా. ఏమి కాదులే. డిపార్ట్మెంట్‌ వాళ్లు మొత్తం సపోర్ట్‌ చేస్తున్నారు నీకే”
”సర్లే చూద్దాం ఏమవుతాదో. నాకు చిన్న పని ఉంది తరువాత చేస్తా” అని అంటాడు.
”అబ్బా. మీకు అసలు నాతో మాట్లాడాలనే ఉండదు సార్‌. గుడ్‌ బారు”
”అలా అని కాదు. రేపు ఉదయాన్నే అమ్మని హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలి”
”అవునా.. ఓకే సార్‌ జాగ్రత్త”
రామకృష్ణ వాళ్ల అమ్మని హాస్పిటల్లో జాయిన్‌ చెయ్యాలి అని చెప్పారు డాక్టర్లు. పదిరోజుల వరకు హాస్పిటల్‌ చుట్టూ తిరిగడంతోనే సరిపోయింది రామకృష్ణకి. డ్యూటీకి కూడా సెలవు పెట్టాడు. హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు ఎవరి ఫోన్లు కూడా ఎత్తేవాడు కాదు. ఆమె పూర్తిగా కోలుకున్నాకనే మళ్లీ డ్యూటీకి వెళ్లడం మొదలుపెట్టాడు.
”ఎల్లుండి నల్గొండలో సభ ఉందిగా దానికి సెంట్రల్‌ మినిస్టర్‌ వస్తున్నాడంట. మనకి కూడా డ్యూటీ వేశారు” అని స్టేషన్‌ నుంచి కాల్‌ వచ్చింది. వెంటనే కావేరి కాల్‌ చేసింది.
”సార్‌ ఎల్లుండి సభకి మీకు డ్యూటీ వేసారా?”
”హా వేశారు”
”అవునా. నేను కూడా వస్తున్నా. సభ అయిపోయిన తరువాత కలుద్దాం. మీతో మాట్లాడాలి మరిచిపోకండి” అని చెబుతుంది.
సభ మొదలయ్యింది. చాలా ఊర్ల నుంచి ప్రజలు వచ్చారు. మొత్తం హడావుడిగా ఉంది. వందల మంది పోలీసువాళ్లు డ్యూటీ చేస్తున్నారు. ఉదయం కలవడం కుదరలేదు. అందుకే సభ ముగియగానే వెంటనే రామకృష్ణకి కాల్‌ చేసింది కావేరి.
”సార్‌ నా డ్యూటీ అయిపొయింది. మీరు తొందరగా రండి, నాగార్జున కాలేజీ దగ్గర ఎదురుచూస్తున్నా”
”ఒక్క పదినిమిషాలు ఆగు కావేరి. వస్తున్నా” అని అన్నాడు రామకృష్ణ. ఔ
కొద్దిసేపటి తరువాత కాలేజ్‌ దగ్గరకి వెళ్లి ”కావేరి వెళ్దాం పదా” అని అన్నాడు.
”ఏంటి బండి మీదనా… ఎక్కడికి సార్‌”
”మిర్యాలగూడకి”
”వద్దు సార్‌. ఎవరైనా చూస్తే బాగుండదు”
”ఇక్కడైతేనే ఇబ్బంది. మాట్లాడుదాం అన్నవుగా, వెళ్తూ మాట్లాడుకోవచ్చు పదా”
”వద్దు సార్‌. మళ్లీ మీకు లేట్‌ అవుతుంది”
”మా చుట్టాలు ఉన్నారు అక్కడ. నైట్‌ అక్కడే ఉంటా అని కాల్‌ చేసి చెప్పిన కానీ నువ్వు ముందు పదా వెళ్దాం” అని అన్నాడు రామకృష్ణ. వాళ్ల స్టేషన్‌ వాళ్లు ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూనే బండి ఎక్కింది కావేరి.
ఇద్దరు కలిసి మిర్యాలగూడకి బయలుదేరారు.
”ఏంటి సార్‌ ! ఏమైపోయారు ఇన్నిరోజులు. కాల్స్‌ ఎత్తరు. మెసేజెస్‌ చూడరు. ఇప్పుడు కొంచం నార్మల్‌ అయినట్టున్నారు”
”హా.. హాస్పిటల్‌ చుట్టూ తిరిగి నేనే పేషెంట్‌ లెక్క అయిపోయినా”
”అందుకే అప్పుడప్పుడు మాలాంటి వాళ్లకి ఫోన్‌ చేసి మాట్లాడాలి”
”ఇప్పుడు పర్లేదులే గానీ ఏదో చెప్పాలన్నవ్‌”
”అంటే… సార్‌ మనం పెళ్లి చేసుకుందామా” అని అన్నది. ఆ మాట వినగానే వెంటనే బండి ఆపేసాడు రామకృష్ణ. వెనక్కి తిరిగి కావేరి మొఖం చూసాడు.
”ఏంటి సార్‌ మీకు ఇష్టం లేదా అన్నది”
”హే.. అలా అని కాదు. సడన్‌గా పెళ్లి అన్నావు ఏంది అని.”
”ఇప్పుడు లవ్‌ చేసుకోవడానికి మీదేమన్నా చిన్న ఏజ్‌ హా.. అని నవ్వి. అందుకే డైరెక్ట్‌ పెళ్లి అన్నా. అయినా ఎప్పుడో చెప్పాలి అనుకున్నా, కానీ మరీ మనం కాలేజీ పిల్లలం కాదుగా అందుకే ఆగినా”
”అదీ కరెక్టే, నాకు కూడా చెప్పాలంటే భయం వేసింది. కానీ నువ్వు ఇలా పెళ్లి అంటావ్‌ అనుకోలేదు” అని అన్నాడు రామకృష్ణ.
”ఇప్పుడు కాదులే. కొన్నిరోజుల తరువాత ఇంట్లో చెప్పి చేసుకుందాం. సరేనా”
”సరే… మేడం” అని అన్నాడు నవ్వుతూ.
మిర్యాలగూడకి వచ్చేసారు. బస్టాండ్‌ దగ్గర కావేరిని దింపాడు రామకృష్ణ. సార్‌ జాగ్రత్తగా వెళ్లండి అని చెప్పి వెళ్తూ మళ్ళీ రామకృష్ణ దగ్గరకి వచ్చింది. ఆమె జేబులో ఉన్న పెన్‌ తీసుకొని రామకృష్ణ చెయ్యి మీద కానిస్టేబుల్‌ కావేరి రామకృష్ణ అని రాసి, ఫొటో తీసుకుని వెళ్లిపోయింది. రామకృష్ణ కావేరిని దింపి వాళ్ల చుట్టాల ఇంటికి బయలుదేరుతాడు. పది నిమిషాలకోసారి చెయ్యి చూసుకొని మురిసిపోతున్నాడు. ఇప్పటినుంచి అమ్మా, కావేరి, ఉద్యోగం ఇదే నా ప్రపంచం అనుకున్నాడు.
కొద్దిదూరం వెళ్ళాక తను వెళ్లే దారిలో కొందరు యువకులు గొడవ పడుతున్నారు. బండి ఆపి వాళ్ల దగ్గరికి వెళ్ళి ”ఎవరు మీరు? రోడ్డు మీద ఎందుకు న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు” అని అడిగాడు. అందరు తాగి ఉన్నారు.
”ఏమి లేదు సార్‌.. ఈరోజు మా నాయకుడి పుట్టినరోజు”
”సరే సరే తొందరగా వెళ్లండి” అని చెప్పి వెళ్తున్నాడు.
అప్పుడే అందులో నుంచి ఒకడు రామకృష్ణని గుర్తుపట్టి ”సార్‌ మీరే కదా మునుగోడులో మా పార్టీ గురించి తప్పుగా మాట్లాడి, మా పార్టీ వాళ్లని ఎదురించింది”
”నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు. అక్కడ ఉన్న ఒక ఫ్యామిలీని వాళ్లు ఇబ్బంది పెడుతుంటే అడిగాను”
”ఓహౌ.. ఆ వీడియోలో ఉన్నది ఈ సారేనా”
”రేరు అవన్నీ ఇప్పుడెందుకు మీరు వెళ్లండి ఫస్టు” అని అన్నాడు.
”మా వాళ్లు ఎలక్షన్స్‌ గురించి తిరుగుతుంటే నీకు ఎందుకురా” అని రామకృష్ణ మీదకి బీర్‌ బాటిల్‌ పట్టుకుని వచ్చాడు ఒకడు.
”రేరు ఏమన్నవ్‌” అని వాడి కాలర్‌ పట్టుకున్నాడు రామకృష్ణ. అందరు మత్తులో ఉన్నారు. రామకృష్ణని పట్టుకుని పక్కనే ఉన్న ఒక ప్లాట్‌లోకి తీసుకెళ్లారు. అందరు కలిసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. అందులో నుంచి ఒకడు ”అరేరు పోలీస్‌ మీద చెయ్యి వేసినం అని తెలిస్తే బతకనివ్వరు అని పక్కనే ఉన్న ఒక రాయి తీసుకొని రామకృష్ణ తల మీద కొట్టాడు. భయంతో అందరు పారిపోయారు. కొద్దిసేపు పోరాడి చివరికి రామకృష్ణ చనిపోయాడు.
కావేరి ఎన్నిసార్లు కాల్‌ చేసినా స్విచ్‌ఆఫ్‌ వస్తుంది. ఛార్జింగ్‌ లేదేమో అనుకోని ”సార్‌ ఇంటికి వెళ్లగానే కాల్‌ చేయండి” అని మెసేజ్‌ పెట్టి పడుకుంటుంది.
మరుసటిరోజు ఉదయం ”కావేరి.. కావేరి తొందరగా లే. మన బైపాస్‌ రోడ్డు దగ్గర ఎవరో ఒక పోలీసుని చంపేసారంట” అని చెప్పాడు కావేరి తండ్రి.
”ఎవరు నాన్న.. ఏమి పేరు” అని అడిగింది కంగారుగా.
”ఏమో అమ్మ.. ఇంకా డీటెయిల్స్‌ తెలియదు” అని చెప్పగానే, వెంటనే అక్కడికి వెళ్లింది. రోడ్డు మొత్తం జనాలతో బ్లాక్‌ అయ్యింది. రోడ్డు దాటుతుండగానే వాళ్లు నిన్న ప్రయాణించిన బైక్‌ కనబడింది కావేరికి. అప్పటికే తనకి అర్ధమయిపోయింది చనిపోయింది రామకృష్ణనే అని. గుర్తుపట్టలేకుండా ఉన్న ఆ మొఖాన్ని చూసి తట్టుకోలేపోయింది. కావేరిని చూసి తన దగ్గరికి వచ్చాడు అనిల్‌.
”ఏమి జరిగింది సార్‌?” అంటూ ఏడుస్తూ అడిగింది.
”ఏమో మేడం, ఇంకా ఎవరు చేశారు అన్న వివరాలు తెలియదు. నిన్న మీటింగ్లో కూడా కలిసే ఉన్నాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమో” అని అన్నాడు.
అది వినగానే ”సార్‌ ఆయన నా కోసమే వచ్చాడు. రాత్రే పెళ్లి గురించి మాట్లాడుకున్నాం ఇద్దరం. నా వల్లనే చనిపోయాడు” అని ఏడ్చింది కావేరి.
రామకృష్ణ బాడీని గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లి, అక్కడి నుంచి మునుగోడుకి తీసుకెళ్లారు. అంబులెన్సులో అనిల్‌తో పాటే కావేరి కూడా వెళ్లింది. ఆ రోజు రామకృష్ణ వాళ్ల అమ్మని అక్కడ చూసిన వాళ్లకి సగం ప్రాణం పోయినట్టు అయింది. కార్యక్రమం అంతా అయిపోయే వరకు ఉండి రాత్రి మిర్యాలగూడ బస్సు ఎక్కింది కావేరి. నిన్న నాతో రాకపోయినా బాగుండేది. పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం కదా అని వాళ్లు దిగిన ఫొటో చూస్తూ ఏడ్చింది కావేరి. మరుసటి రోజు పేపర్లో జరిగిన విషయాన్ని చూసిన వాళ్లు, ”మీ రాజకీయాల కోసం అన్యాయంగా ఒక నిజాయితీ గల పోలీసును చంపేశారు” అని మాట్లాడుకున్నారు.
రమేష్‌ మాండ్ర 8555929026