– అనేక సమస్యలకు పరిష్కారం చూపాం
– ఎర్రజెండా అండతోనే ఎన్నో సాధించాం
– సీతారాం ప్రాజెక్టు నుంచి పోడు పట్టాల పంపిణీ వరకు సీపీఐ(ఎం) కీలకపాత్ర
– పాలేరులో ఆ ఇద్దరు అభ్యర్థులది అవకాశవాదం..
– పోటీ చేసిన స్థానాల్లో కొన్నైనా గెలుస్తాం..
‘నవతెలంగాణ’తో సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని
”నిరంతరం పోరుబాటలోనే ఉంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక ఉద్యమాల్లో నేరుగా పాల్గొన్నాను. ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రజాసమస్యలపై చట్టసభల్లో గళం విప్పాను. పదవిలో ఉన్నా లేకున్నా పోరాటాల ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపించడంలో తనవంతు భూమిక పోషించాను. నాపై పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదు. చట్ట సభల్లో స్పందించలేదు. నియోజకవర్గంలో వ్యవసాయా ధారిత పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది” అని పాలేరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ముగింపునకు ముందు ‘నవతెలంగాణ’తో తమ్మినేని ప్రత్యేకంగా మాట్లాడారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు. ఆ అవసరాన్ని గుర్తించి పాలేరులో సీపీఐ(ఎం)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాసమస్యలపై పోరాటాలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 53 చోట్ల పేదలకు భూములు సాధించాం. సీపీఐతో కలిసి భూపోరాటాలు చేశాం. 1980-90 ప్రాంతంలో వ్యవసాయ కూలీల కోసం పోరాటం చేశాం. 2002లో చంద్రబాబు హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని పోరాడాం. బషీర్‌బాగ్‌లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు విడిచిన రామకృష్ణ ఆరోజు నా పక్కనే ఉన్నారు. భూ సమస్యలపై ముదిగొండలో జరిగిన పోరాటంలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. పోరాట ఫలితంగా నాటి వైఎస్‌ఆర్ ప్రభుత్వం దిగివచ్చి పాండు రంగారావు కమిషన్ వేసింది.
భూ నిర్వాసితుల సమస్యపైనా…
కేసీఆర్ హయాంలో వివిధ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యపై పోరాడాం. మల్లన్న సాగర్ భూనిర్వాసితుల సమస్య దీనిలో కీలకం. ఇండ్ల స్థలాల సమస్యపై 22 జిల్లాల్లో పోరాటాలు నిర్వహించాం. లక్షలాది మందిని నిర్బంధించారు. సామాజిక న్యాయం కోసం 4,200 కి.మీ మేర మహాజన పాదయాత్ర చేపట్టాను. గొర్రెల పంపిణీ, దళితులకు మూడు ఎకరాల భూమి వంటివి సాధించాం.
పాదయాత్రలు.. సైకిల్ యాత్రలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దుమ్ముగూడెం ప్రాజెక్టు సాధన కోసం 2003లో పాదయాత్ర చేపట్టాను. వందరోజుల పాటు 2,600 కి.మీ పైగా ఈ యాత్ర కొనసాగింది. ఫలితంగానే నేటి సీతారామ ప్రాజెక్టుకు బీజం పడింది. తిరిగి ఈ ప్రాజెక్టు నిధుల జాప్యంపై పాదయాత్ర మొదలుపెట్టడంతో రూ.600 కోట్లను అప్పటి వైఎస్‌ఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. దళితవాడల అభివృద్ధి కోసం సైకిల్‌యాత్ర చేశాను. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు సాధించుకున్నాం. గిరిజనుల పోడు భూముల కోసం చట్టసభల్లో పోరాడాం. అటవీహక్కుల చట్టం తెచ్చుకోగలిగాం. గిరిజనులు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పొందారు.
పాలేరు నియోజకవర్గ పరిస్థితిపై..
పాలేరు నియోజకవర్గాన్నే కాదు.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వంటివి రావాలి. మేత కొరత దృష్ట్యా గొర్రెల ఫామ్‌లు ఏర్పాటు చేయాలి. దళితబంధు అవినీతిమయమయింది.
దీన్ని రూపుమాపి ఈ స్కీమ్ సక్రమంగా కొనసాగేలా చూడాలి. రాష్ట్రంలో 14 లక్షల కుటుంబాలుంటే దళితులకు మూడు ఎకరాల హామీ కేవలం 16వేల ఎకరాలకే పరిమితమైంది. ఆధునిక ఆస్పత్రులు, డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఇవి రావాలంటే ఈ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) తప్పక గెలవాల్సిన అవసరం ఉంది.
ఆ ఇద్దరిదీ అవకాశవాదం..
ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డివి అవకాశవాద రాజకీయాలు. వాళ్లు డబ్బుపై ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి అభ్యర్థుల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్రంలో సీపీఐ(ఎం) 19 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో కొన్నైనా గెలుస్తామనే నమ్మకం ఉంది.