నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయం

– అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– నియోజకవర్గం అభివద్ధికి రూ.10 కోట్లు
– ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశం
– 20న మరోసారి సమీక్ష సమావేశం
– రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ హుస్నాబాద్‌ రూరల్‌
హుస్నాబాద్‌ నియోజకవర్గం అభివృద్దే తన ధ్యేయమని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని, మీ స్థాయిలో పరిష్కారంకాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌లోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, చేసే పనిలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ నియోజకవర్గ మూడు జిల్లాలతో కూడి ఉన్న నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసిమెలిసి పనిచేయాలన్నది నా సిద్ధాంతం అని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమం తర్వాత జనరల్‌ పిటీషన్స్‌ తగ్గినట్లు చెప్పారు.నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల రూపాయలను కేటాయించిందని, నిధులతో ప్రజలకు అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుదామన్నారు. మంజూరు అయినా పనులు, వాటిలో ఇప్పటికి ప్రారంభం కాని పనులు, ప్రారంభమై వివిధ స్థాయిలో ఉన్న పనుల వివరాలను తెలియజేయలన్నారు. ఈనెల 20న మరొకసారి అన్ని శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పనుల వివరాలపై సమీక్షిస్తానని ఈ లోపు పూర్తి వివరాలను సేకరించాలన్నారు. నేషనల్‌ హైవే నిర్మాణం సందర్భంగా ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు అందించాలన్నారు. ఈ కార్యక్ర మంలో హుస్నాబాద్‌ ఆర్డిఓ బెన్‌ సాలెం, హనుమకొండ, హుజురాబాద్‌ ఆర్డీవోలు, హుస్నాబాద్‌ ఏసీపి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.