నియోజకవర్గ అభివృద్ధి పనులే గెలిపిస్తాయి

– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనను గెలిపిస్తారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల పట్టణంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన బూత్‌ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.జనం కోసం పనిచేసేందుకు తాను రాజకీయాలకు వచ్చానని, తెలంగాణ 9 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌, రోడ్లు, వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. నేరేడుచర్ల పట్టణ అభివద్ధికి సుమారు రూ.70 కోట్లు, మరో 25 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని తెలిపారు. డంపింగ్‌యార్డులో వాసన రాకుండా మరో రూ.4 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. నేరేడుచర్ల మున్సిపాలిటీని మోడల్‌ మున్సి పాలిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనకు, ఆయన భార్యకు సీట్లు కావాలి, పదవులు కావాలని ఎద్దేవా చేశారు. ఉత్తం కుమార్‌ రెడ్డి నేరేడుచర్ల అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. ఆయన గ్రామాల్లో తిరగాలంటే సిగ్గు పడుతున్నారని, అనామకుడిగా వచ్చిన ఆయన కోట్ల రూపాయలు సంపాదించాడని అన్నారు. అభివృద్ధి పనులు చేస్తుంటే ఆయన అడ్డుకొని కోర్టులో కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఆయనకు దళితబంధు అంటే ఇష్టం లేదని, దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఉత్తంకుమార్‌ రెడ్డి పిచ్చిలో ఉన్నాడని, గెలవకపోతే రిటైర్మెంట్‌ అవుతారా అంటూ ప్రశ్నించారు. తాను నిరంతరం ప్రజలు మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నానని తెలిపారు. పార్టీలో సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే సమక్షంలో మండలంలోని పలువురు కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు వరుసగా నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. కాలేశ్వరం నీళ్లు గరిడేపల్లి మండలం కుతుబ్‌షా పురం గ్రామానికి వస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో మూడు రోడ్లకు అనుమతి తెచ్చినట్లు చెప్పారు. పార్టీలో పని చేసిన వారికి భవిష్యత్‌ తప్పక ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మెన్‌ చందమల్ల జయబాబు, మార్కెట్‌ చైర్మెన్‌ నాగండ్ల శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరు సైదులు, గ్రంథాలయ చైర్మెన్‌ గుర్రం మార్కండేయ, డీసీసీబీ డైరెక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అరి బండి సురేష్‌ బాబు, పట్టణ ఎన్నికల ఇన్‌చార్జి మన్సూర్‌అలీ, బీఆర్‌ఎస్‌ నాయకుడు జే వి ఆర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, అన్ని బూతుల అధ్యక్షులు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.