దేశానికి రక్షణ కవచం రాజ్యాంగం..

The constitution is the shield of the country.– 26న కాటారంలో రాజ్యాంగ స్థూప ఆవిష్కరణ.
– రాజ్యాంగ స్థూప ఆవిష్కరణకు పోలీసులు అనుమతి ఇవ్వాలే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
దేశానికి రక్షణ కవచం రాజ్యాంగమని, రాజ్యాంగంలో అందరి హక్కులు పొందపర్చబడి ఉన్నాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో కాటారంలో ఏర్పాటు చేయనున్న రాజ్యాంగ స్థూప కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సందర్బంగా కాటారం ప్రధాన కూడలి అంబేద్కర్‌ చౌరస్తాలో పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా జక్కు రాకేష్‌ సౌజన్యంతో బహుజన సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ స్థూప ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. అయితే రాజ్యాంగ స్థూప ఆవిష్కరణకు కాటారం సబ్‌ డివిజన్‌ డీఎస్పీని అనుమతి అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందని, కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని ఆయన గుర్తు చేశారు.రాజ్యాంగంలో ఏం ఉందనే విషయం ప్రజలకు తెలియాలనే రాహుల్‌గాంధీ కోరుకుంటూ రాజ్యాంగం పట్టుకుని దేశమంతా పర్యటిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ స్థూప ఆవిష్కరణకు అనుమతి ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పార్టీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. రాజ్యాంగం అనుగుణంగానే మంథని ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగుతున్నారని, ఈ విషయంపై మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ స్థూప ఆవిష్కరణకు ప్రజాస్వామ్య వాదులు,మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడంతో పాటు రాజ్యంగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.