రాజ్యాంగం- నేటి సవాళ్లు!

Constitution- Today's Challenges!ప్రజాస్వామ్యం అనేది ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వంటి మౌలిక విలువలపై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలను పరిరక్షించడం, ప్రజాస్వామ్య వ్యవస్థను విజయవంతంగా నిర్వహించడం రాజ్యాంగం ప్రధాన బాధ్యత. రాజ్యాంగం అనేది ప్రతి ప్రజాస్వామ్య దేశానికి కేవలం చట్టపరమైన పటకం మాత్రమే కాదు, అది ఆ దేశ ప్రజల సమానత్వ హక్కులు, మౌలిక విలువలను పరిరక్షించే పటిష్టమైన కవచం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగం పాత్ర అసాధారణమైనది. బ్రిటీష్‌ పాలన నుండి విముక్తి పొందిన అనంతరం, దేశ సమగ్రతను, స్వేచ్ఛను, సమానత్వాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలో 1950లో రాజ్యాంగం రూపొందించడం జరిగింది. నేటికి 74 ఏండ్లు పూర్తిచేసు కున్న సందర్భాన ఇది ప్రజల హక్కుల రక్షణలో దశలవారిగా మార్గదర్శ కంగా నిలిచింది. అయితే, ప్రపంచంలో ఎక్కడా లేని కులవ్యవస్థ మన దేశంలో వేళ్లూనుకుపోవడం, అంగ్లేయులు ప్రజల మధ్య విభజన రేఖలు సృష్టించి వందల ఏండ్లపాటు పాలించడం దేశంలో అసమానతలు పెరగడానికి కారణమైంది. దీన్ని అధిగమించే ప్రయత్నాలు చేయక పోగా, కులాన్నే తమ అస్త్రంగా వాడుకోవడం ఇప్పుడు పాలక పార్టీలకు సాధారణమైపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్నే కాదు, రానురానూ రాజ్యాంగాన్నే ప్రభావితం చేసే స్థాయికి చేరింది.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
రాజ్యాంగం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభంగా పనిచేస్తూ, ప్రభుత్వ నిర్మాణానికి, విధివిధానాలకు స్పష్టమైన హద్దులను నిర్ణయిస్తుంది. మౌలిక హక్కులు, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలను ఇది ప్రజలకు హామీగా ఇస్తుంది. ఇది కేవలం చట్ట పరమైన నియమావళిగా కాకుండా, ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించే ఒక మార్గదర్శిగా కూడా నిలుస్తుంది. భారత రాజ్యాంగం ఐదు ప్రధాన పాయలపై ప్రజాస్వామ్యాన్ని ధృడంగా నిలబెట్టింది 1.మౌలిక హక్కుల రక్షణ: భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ, సమానత్వం, జీవించే హక్కులను హామీగా ఇస్తుంది. ఇవి ప్రజాస్వామ్యానికి బలమైన భద్రతగా నిలుస్తాయి. 2.ప్రభుత్వాల హద్దుల నిర్ణయం: శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య శక్తుల విభజన ద్వారా, అధికారం దుర్వినియోగం కాకుండా సమతుల్యతను కాపాడుతుంది. 3.న్యాయపాలన గరిష్టత: రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ప్రజల హక్కులను రక్షించే అత్యున్నత బాధ్యతను అప్పగించింది. 4. ఎన్నికల పారదర్శకత: ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పనిచేయడానికి రాజ్యాంగం గట్టి పునాదులు ఏర్పరచింది, ప్రజాస్వామ్య విధానం నిష్పక్షపాతంగా ఉంటుంది. 5.ఐక్యత, సమన్వయం: భిన్నమైన భాషలు, మతాలు, సంస్కృతులతో కూడిన భారతదేశంలో సమానత్వాన్ని, ఐక్యతను కాపాడటానికి రాజ్యాంగం ప్రాథమికమైన పాత్ర పోషిస్తుంది. భారత రాజ్యాంగం మానవ హక్కులను కేవలం హామీగా ఇవ్వడమే కాదు, వాటిని పటిష్ఠంగా అమలు చేయడానికి మార్గదర్శకాలను అందించింది. మౌలిక విధాన సూత్రాలు సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించడానికి మార్గం చూపుతాయి. ప్రస్తుతం కూడా రాజ్యాంగం అందించే సంస్కరణలు ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని రక్షిస్తూ, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పాలన వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది.
ఎదుర్కొంటున్న సవాళ్లు
దశాబ్దకాలంగా రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాలకులు అనుసరిస్తున్న విధానాలు, ప్రజల హక్కులను నిర్లక్ష్యం చేయడం, వివక్ష, మైనార్టీ హక్కుల దురలవాట్లు ప్రజాస్వామ్యంపై బలహీన ప్రభావం చూపిస్తున్నాయి. మణిపూర్‌ వంటి ఉదాహరణలు పాలకుల చేత రాజ్యాంగానికి జరుగుతున్న ముప్పును బహిర్గతపరు స్తున్నాయి. దేశ ప్రజల రక్షణ, సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం గతంలో రాజ్యాంగాన్ని సవరణలు చేశారు. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా రాజ్యాంగాన్నే రద్దు చేసి తమకు అనుకూలంగా ఉండే మనుస్మృతిని తీసుకురావాలని చూస్తున్నారు. ఇది అత్యంత ఆక్షేపణీ యం. ఇప్పటికే ప్రజలకు కల్పించబడిన హక్కులు హరించబడ్డాయి. ఉపా లాంటి చట్టాలు సామాన్యుల గొంతు నొక్కుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రశ్నించిన పాపానికి హక్కుల కార్యకర్తల్ని, ఉద్యమ నాయకుల్ని అణచివేస్తూ జైళ్లలో నిర్భంధిస్తున్నాయి. అలాంటిదే ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్భంధం. కేవలం మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో తొమ్మిదేండ్లు జైలుపాలు చేసి ఆతని మరణానికి కారణమైంది కేంద్రం. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారనడానికి ఇదో తాజా ఉదాహరణ. పైగా బహిరంగంగా జరుగుతున్న లైంగికదాడులు, హత్యల్ని అరికట్టకపోగా నేటి పాలకులు ప్రోత్సహించడం శోచనీయం. ప్రజల మధ్య సామరస్యాన్ని సృష్టించాల్సిన వారే కుల, మతాల పేరుతో కుట్ర పూరితంగా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న తీరు దారుణం. అణగారిన వర్గాల వారిని, మైనార్టీలను, ఆదివాసీలను, అన్ని రకాలుగా అణచివేస్తూ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడవడం బాధాకరం. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజలను మరింత అణిచేసే ధోరణిలోనే ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఎన్నో ఉదంతాలు మన కండ్ల ముందే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రజలపైనే కాదు, పూర్తిగా రాజ్యాంగంపై దాడిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉంటుందన్న సంగతి గమనంలో పెట్టుకోవాలి.అందుకు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, మీడియా, పౌర సమాజం నడుం బిగించాలి. రాజ్యాంగ విలువలు సమాధి కాకుండా వాటి పునరుద్ధరణకు నేటి రాజ్యాంగ దినోత్సవాన్ని కర్తవ్యంగా తీసుకుని ముందుకు సాగాల్సిన సమయమిది.
(నేడు భారత రాజ్యాంగ దినోత్సవం)
– యగ్గడి సుందర్‌ రామ్‌, 9493737981