రాజ్యాంగం ఖూనీ

రాజ్యాంగం ఖూనీ– మతం ముసుగులో
– అధికారం కోసం తహతహ
– ప్రశ్నించే గొంతుకల అణచివేత
– అగ్రకుల ఆధిపత్యానికి ఎత్తుగడలు
– ప్రతిపక్షం లేని పార్లమెంట్‌ కోసం కలలు
– ఏకచ్ఛత్రాధిపత్యం దిశగా ప్రయత్నాలు
దేశంలో ధర్మాన్ని తిరిగి ప్రతిష్టిస్తానని బీజేపీ హామీలు గుప్పించింది. అసలు ధర్మం అంటే నిజమైన అర్థం న్యాయం. ధర్మాన్ని ఆచరించడమంటే న్యాయాన్ని ఆచరించడమే. కానీ బీజేపీ చేస్తోం దేమిటి? మతం పేరిట రాజకీయాలు నడుపుతోంది. మతాల మధ్య చిచ్చు పెడుతోంది. కులాల మధ్య వివాదాలకు ఆజ్యం పోస్తోంది. తన సొంత రాజ కీయ ప్రయోజనాల కోసం సమస్యలను పెంచి పోషి స్తోంది. ఇది ధర్మం ఎలా అవుతుంది? ఇది ప్రజలకు చేసిన ద్రోహం అవుతుంది. అధర్మం అవుతుంది.
న్యూఢిల్లీ : బీజేపీ బడా కార్పొరేట్‌ శక్తులతో చేతులు కలుపుతోంది. దాని విధానాలను కార్పొరేట్‌ ప్రయోజనాలు శాసిస్తాయి. తన సొంత ప్రయోజనాల కోసం ప్రజలను ఏమార్చడానికి ఆ పార్టీ కొన్ని పద్ధతులను అవలంబిస్తోంది. ప్రభుత్వ నిర్వహణలో అనేక లోపాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా ప్రజా ధనాన్ని బీజేపీ దోపిడీ చేసింది. తాను ఇన్ని నీచమైన చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రజలు తనకే మద్దతు కొనసాగించేలా చేయడానికి బీజేపీ మతంపై ఆధారపడుతోంది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) అమలు ద్వారా మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని వర్గీకరించేందుకు బీజేపీ దుష్ట పన్నాగాలు పన్నింది. వాటికి చట్టబద్ధం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ మత సమూహాల మధ్య అడ్డు గోడలు నిర్మించేందుకు అమానవీయ, దుష్ట మనస్తత్వాన్ని నింపుకుంది. కొందరిని రెండో తరగతి పౌరులుగా గుర్తించి, వేరు చేయాలని చూస్తోంది.
గొంతుకలను నొక్కేసి…జైళ్లలో బంధించి
కేంద్ర ప్రభుత్వం ఓ నిరంకుశ సంస్థగా తయారైంది. వాస్తవాలను కుండబద్దలు కొట్టేందుకు కృషి చేస్తున్న వారి గొంతుకలను అమానుషంగా అణచివేస్తోంది. కల్బుర్గీ, గౌరీ లంకేష్‌ వంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన అనేకమంది చిందించిన రక్తపు మరకలు బీజేపీ చేతికి అంటుకున్నాయి. వారిని చట్టవిరుద్ధంగా కారాగారాల్లో బంధించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఫాదర్‌ స్టాన్‌స్వామి, ఆనంద్‌ తెల్తుంబ్డే, వరవరరావు, ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా వంటి పలువురు యోధుల నోరు నొక్కేశారు. కారాగారంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఫాదర్‌ స్టాన్‌స్వామికి కనీస వైద్యం, ఇతర సదుపాయాలు కల్పించకుండా అడ్డుకున్నారు. చివరికి ఆయన జైలులోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేతల నివాసాలు, కార్యాలయాలు, వ్యాపారాలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేశాయి. తద్వారా వారందరినీ పార్టీలు మారి బీజేపీలో చేర్చాల్సిందిగా ఒత్తిడి చేశాయి. పార్లమెంటులో చర్చించకుండానే బిల్లులను ఆమోదించారు. ప్రశ్నలు లేవ నెత్తిన ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసి, వారి గొంతుక విన్పించకుండా చేశారు. ఈ చర్యల ద్వారా ప్రజాస్వామ్యం పీక నొక్కారు. ప్రతిపక్షాలు లేని పార్ల మెంట్‌ ఉండాలని బీజేపీ కలలు కన్నది.
రాజ్యాంగంపై నమ్మకమే లేదు
బీజేపీ, సంఫ్‌ు పరివార్‌, ఇతర శక్తులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై లేదా భారత రాజ్యాంగంపై నమ్మకమే లేదు. రాజ్యాంగాన్ని మార్చడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే పలు సమావేశాల్లో బహిరంగంగానే చెప్పారు. హిందూయిజం పేరుతో మనుస్మృతిని తిరిగి ఉనికిలోకి తేవాలన్నది వారి ప్రాథమిక లక్ష్యం. హిందూ సంప్రదాయం పేరిట రాజ్యాంగాన్ని కూల్చివేయడం ద్వారా విశేషాధికారాలు సొంతం చేసుకోవాలని వారి ఉద్దేశం.
బీజేపీ అధికారంలోకి వస్తే…
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే పరిపాలనను వ్యవస్థీకృతం చేస్తుంది. ఆ పరిపాలన అగ్ర కులాలు, సంపన్నుల చేతిలోనే అన్ని అధికారాలు, ఆధిపత్యం శాశ్వతంగా ఉండేలా చూస్తుంది. ‘హిందూ జాతి’, ‘ధర్మ సంసద్‌’ పేరిట సాగే ఈ పరిపాలనా పద్ధతి అగ్ర కులాలకు ఆధిపత్యాన్ని కట్టబెట్టడానికే ఉద్దేశించింది. భారత ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థను రద్దు చేసి దేశాన్ని మతం పేరుతో క్రూరమైన అణచివేతల పాలన దిశగా తీసుకెళ్లడమే బీజేపీ అంతిమ లక్ష్యం.
ఆలోచించి ఓటేయండి
ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం మరోసారి గోతిలో పడదామా? గత పది సంవత్సరాల అనుభవాలను మరచిపోయి బీజేపీకి ఎవరైనా ఓటు వేస్తారా? దేశాన్ని, సామరస్యాన్ని, ప్రజల జీవి తాలను కాపాడుకోవడానికి చివరి అవకాశం వచ్చింది. ఉజ్వలమైన భారత వారసత్వం మన చేతిలోనే ఉంది. మరోసారి ఆ పాత గోతిలోనే పడకండి. మరోసారి మోసపోకండి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మనుగడ కోసం మనం పోరాటాన్ని కొనసాగించాల్సిందేనన్నది కఠోర వాస్తవం. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే దేశం మనుగడ ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ మోసపూరిత, అహంకారపూరిత ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం అత్యవసరం. ప్రజల కృతనిశ్చయాన్ని చాటిచెప్పి బీజేపీని అధికారం నుండి దించేయాల్సిన అవసరం ఉంది. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మనమంతా సంఘటితమై మన ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. మనం మరోసారి బాధ్యత తీసుకొని దేశాన్ని పునర్నిర్మించుకోవాలి.
బీజేపీ లక్ష్యాలు ఇవే
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం అనే సూత్రాలపై భారత రాజ్యాంగం నిర్మితమైంది. ఈ సూత్రాలన్నింటినీ బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రజలు, మీడియా, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య ప్రతిపాదకుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించాలని చూస్తోంది. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తోంది. సంక్షేమ రాజ్యం, సబ్సిడీలు, ప్రభుత్వ మద్దతు కార్యక్రమాలను లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ మత సమాజాల మధ్య సహజీవన సంప్రదాయాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటోంది. సామరస్యంగా ఉండాలని ఉద్బోధించడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా అడ్డూ అదుపూ లేని నిరంకుశత్వాన్ని బలోపేతం చేసుకోవాలన్నది బీజేపీ ఉద్దేశం. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలకు అవధులు లేని అవకాశాలు కల్పించడమే దాని లక్ష్యం. సమాజంలో ఉన్నత స్థానాల్లో అగ్రకుల ఆధిపత్యాన్ని పునరుద్ధరించడానికి ఆ పార్టీ అనునిత్యం తాపత్రయ పడుతోంది. మతం ముసుగులో నిరంకుశ కార్పొరేట్‌ పాలనను ఏర్పాటు చేయడానికి బీజేపీ పథకాలు రచిస్తోంది. ఇందుకోసం మరోసారి ఎన్నికల్లో విజయం సాధించడానికి చట్టవిరుద్ధమైన చర్యలకు తెగబడుతోంది.