
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్..
నవతెలంగాణ – వేములవాడ
నేటి తరం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి నేటితరం నడుం బిగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ పిలుపునిచ్చారు. వేములవాడ మహా లింగేశ్వర గార్డెన్ లో సీపీఐ(ఎం) మూడు రోజుల శిక్షణా తరగతులు నేటితో ముగిసాయి. ఈ తరగతులకు జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం అనే అంశంపై సీపీఐ(ఎం) పెద్దపెల్లి జిల్లా నాయకులు ఏ.ముత్యంరావు క్లాస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల ద్వారానే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతూ సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ గత పదేళ్లుగా అధికారంలో ఉండి దేశ ప్రజలకు ఇసుమంత మేలు చేయలేదన్నారు. తమను ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ అనేకమంది హేతువాదులను, జర్నలిస్టులను, మేధావులను పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. మత విద్వేషాలు నింపుకున్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రిజర్వేషన్లను పేదలకు లేకుండా చేయాలని దురుద్దేశంతో పని చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని, హత్తుకొని ముద్దాడుతూ దాని పట్ల కపట ప్రేమ వలకపోశారని విమర్శించారు. వాస్తవంగా వారి సిద్ధాంతం ప్రకారంగా ఈ దేశానికి రాజ్యాంగం పనికిరాదని, ప్రాచీన భారతీయ రాజ్యాంగం అంటే అది మనుస్మృతి అని అంగీకరించిన పార్టీ బీజేపీ అన్నారు. కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా స్వయంగా రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని చెప్పడం ఆ పార్టీ విధానానికి అద్దంపడుతుందన్నారు. మత రాజ్యాలలో మానవ మారణ హోమం తప్ప ప్రజల మౌలిక సమస్యలు, ఎజెండాలోకి రావన్నారు. రాబోయే రోజులలో బీజేపీ అనుసరించబోయే విధానాలు, పేద ప్రజలకు మరింత క్లిష్టతరంగా మారనున్నాయని అన్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సైనికుల్లా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల గిట్టుబాటు ధరలు, ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కార్మికుల కనీస వేతనాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బీజేపీ సర్కార్ నీరుగారుస్తుందని ఆ చట్టం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. సీపీఐ(ఎం) రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేటి తరాన్ని చైతన్య పరుస్తూ విద్వేషాలు లేని దేశంగా దేశ సమైక్యత సమగ్రతల కోసం యువతరాన్ని ముందుకు నడిపించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ శిక్షణా తరగతులలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జవ్వాజి విమల, గన్నేరం నర్సయ్య,ఎర్రవెల్లి నాగరాజు, కోడం రమణ, గురిజాల శ్రీధర్, సూరం పద్మ, మళ్లారపు ప్రశాంత్, గుర్రం అశోక్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.