రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి ఉచితంగా అందించాలి

నవతెలంగాణ-ఇచ్చోడ
భారత రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి ఉచితంగా అందించాలని డిఎస్పీ జిల్లా నాయకులు వెంకటేష్‌ అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ జాదవ్‌ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మండల నాయకులు పోనుకంటి శేఖర్‌, దర్శనాల అశోక్‌ మాట్లాడుతూ దేశాన్ని నడిపిస్తోంది భారత రాజ్యాంగమేనని అన్నారు. అలాంటి గ్రంథం పట్ల నూటికి 90శాతం ప్రజలకు అవగాహన లేకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైపోతోందని తెలిపారు. రాజ్యాంగం ద్వారా సామాన్య ప్రజలు అవకాశాల్లో ముందడుగు వేసి ప్రధాన స్రవంతిలో కలవడానికి రాజ్యాంగంపై అవగాహన అవసరమన్నారు. ఈ నెల 3న తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశామని, అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మరోసారి వినతిపత్రం అందజేశామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించకపోతే ధర్మసమాజ్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్‌ పార్టీ జిల్లా నాయకులు వెంకటేష్‌, మండల నాయకులు శేఖర్‌, అశోక్‌, ప్రవీణ్‌, లక్ష్మణ్‌, పోశెట్టి, శ్రీనివాస్‌, నరేష్‌, ఊశన్న, రాజయ్య, రమేష్‌, నరేష్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.