రాజ్యాంగ రక్షణ – భారతీయుల బాధ్యత

Constitutional Protection - Responsibility of Indians”ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా,గొప్పదైనా కావచ్చు కానీ దాన్ని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు” అని రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే చెప్పారు.ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి కండ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.రాజ్యాంగ విలువలు, లక్ష్యాలు, ఆదర్శాల్ని ఏలుతున్నవారే ధ్వంసం చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. స్వాతంత్య్రం సిద్ధించి 77 ఏండ్లు, భారత రాజ్యాంగానికి 75 వసంతాలు నిండిన ఈ సందర్భంగా రాజ్యాంగ రక్షణ పట్ల విద్యావంతులు, మేధావులు చరించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేండ్లలో రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాలకులు రాజ్యాంగానికి విరుద్ధమైన పాలనసాగిస్తూ ప్రజల్ని కులం,మతం,ప్రాంతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నారు. ఇది రాజ్యాంగాన్ని అమలు చేయడం కాదు, పూర్తి విస్మరించడమే అవుతుంది.
దేశ ప్రజలందరూ ఇష్ట పూర్వకంగా ఒప్పుకుని ఆమోదించుకున్న నియమాలు, ప్రతిజ్ఞలు, హక్కులు బాధ్యతల సమాహారమే మన రాజ్యాంగం.ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా కీర్తించబడుతున్నది. అలాంటప్పుడు దీన్ని అమలు చేసేవారు ఎంతబాధ్యతాయుతంగా ఉండాలి? కానీ ఆ పరిస్థితి నేడు దేశంలో లేదు. భారత రాజ్యాంగ పీఠికలోనే రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు.రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సమాఖ్య విధానం,లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,స్వతంత్ర న్యాయవ్యవస్థ, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. కానీ న్యాయ ఆదేశాల్ని కూడా విస్మరిస్తూ, సమాధి చేస్తూ పాలన సాగిస్తుండటం నిజంగా రాజ్యాంగానికి పెద్ద సమస్య. రాజ్యాంగం సర్వోన్నతమైనది.దేశంలోని సర్వ వ్యవస్థలు, సంస్థలు భారత రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి. కానీ దశాబ్దకాలంగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే విధంగా పాలకులు వ్యవహరిస్తున్న తీరు శోచనీయం. దేశంలో సాగుతున్న కార్పొరేట్‌ రాజకీయం, క్రోనీ క్యాపిటలిజం రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు పూర్తి విరుద్ధం. దేశంలో మౌలిక సదు పాయాలకు సంబంధించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, టెలి కమ్యూనికేషన్‌ వ్యవస్థ, విద్యుత్‌ కంపెనీలు, బొగ్గుగనులు, భూగర్భం నుండి అంతరిక్షం దాకా, అన్నీ బడా కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్ర సర్కార్‌ గుత్తాధిపత్యంగా కట్టబెట్టింది. ఇందులో ఎవరి అభిప్రాయాలకు, ఆలోచనలకు తావులేదు. అనేక ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఏకపక్షంగా వారికి దాసోహం చేస్తోంది. నేడు ఆ పెట్టుబడిదారులే రాజకీయ రంగాన్ని నియంత్రిస్తూ వారి వ్యాపార(స్వ) ప్రయో జనాలను కాపాడుకుంటున్న పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని విస్మరించి పాలించడమే తప్ప వేరేకాదు.
పాలకులు భారత రాజ్యాంగ విలువలకు తిలోదకాలకిచ్చి, వారి మనువాద భావజాలన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నది. ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన వారే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ,శాస్త్రీయ వైఖరులకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే ప్రజలు మరింతగా జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది.గ్లోబలైజేషన్‌ కాలంలో ప్రజల్లో సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ పెంపొందించాల్సిన బాధ్యత పెరిగింది. కానీ ఆదిశగా పాలకులు అడుగులు పడకపోవడం వెనుక ఆరెస్సెస్‌ భావజాలం దాగుంది. అంతేకాదు, ప్రస్తుతం దేశంలో పాలకులు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, చరిత్రను, చారిత్రక చిహ్నాలను ధ్వంసం చేస్తూ, ప్రజాశ్రేయస్సు మరిచి కార్పొరేట్ల వంతపాడుతున్న పరిస్థితి ఉన్నది. వారి అనైతిక భావజలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతూ రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నది. ‘ఇందుకేనా మీకు ఓట్లేసి గెలిపించింది’ అన్న భావన ఇప్పుడు ప్రజల హృదయాల్లో నుంచి వస్తున్నది. అత్యంత విలువలతో కూడుకున్న రాజ్యాంగం కుల,మత, భాష లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమేనని పునరుద్ఘాటించింది.స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం, సమ న్యాయం, లౌకికవాదం, సమగ్రత మొదలైన అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు కాషాయపు మూక ప్రయత్నిస్తోంది. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలతో దేశ ప్రజలందరూ ఒక్కటేనని చాటి చెప్పింది. కానీ ఇప్పుడు దేశంలో గద్దెనెక్కినవారు హిందూ,ముస్లిం, మైనార్టీలను వేరుగా చూపిస్తోంది. లౌకికభావనతో కలిసున్న ప్రజల్ని మతం పేరుతో విడదీస్తోంది.
రాజ్యాంగం మనదేశానికి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని అందించింది. ప్రజలే ప్రభువులుగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుపడుతుందని భావించింది. ఇందులో రాజకీయ పార్టీలది కీలకపాత్ర. అయితే ఆ రాజకీయపార్టీలే రాజ్యాంగాన్ని విస్మరించడం తీవ్రంగా పరిగాణించాల్సిన అంశం. దేశంలో జమిలి ఎన్నికల పేరిట ప్రజాస్వామ్య, సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మోడీ సర్కార్‌ పావులు కదుపుతున్నది. పరోక్షంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలనగా రూపొందించాలని భావిస్తున్నది. తద్వారా ప్రాంతీయ పార్టీల ఆధిపత్య పాలనకు అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్నది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధానం. దీన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసం ఉన్నది. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తి కేంద్రీకృత రాజకీయ పార్టీలే. ఇవి సైద్ధాంతిక పునాదులకంటే కూడా వ్యక్తి ఆకర్షక అంశాలకే ప్రాధాన్యతనివ్వడం బాధాకరం. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చేపట్టి, జాతీయ ప్రయోజనాలకంటే ప్రాంతీయ ప్రయోజనాలకే అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తుండటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. రాజకీయ పార్టీల్లోనూ కులం ఓటుబ్యాంక్‌గా మారింది. ఆయా కులాల, ఉపకులాల మధ్య చిచ్చుపెట్టి అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. అధి కారాన్ని పొందేందుకు, పొందిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్త్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. నైతిక విలువలకంటే రాజకీయాలకే ప్రాధాన్యమిస్తూ ప్రజాస్వామ్యస్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో మతాన్ని, డబ్బును, ఓటుబ్యాంకుగా వాడుకొని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రించడానికి కేంద్ర సర్కార్‌ ప్రయత్నిస్తున్నది. ఇది సమైక్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవడం భారతీయులుగా మన బాధ్యత. జనవరి 26 సందర్భంగా రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలు అమలు చేసేందుకు ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞచేసి మరీ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది.
పాకాల శంకర్‌ గౌడ్‌
9848377734