రాజకీయ తీర్పు తర్వాత రాజ్యాంగ తీర్పులు?

రాజకీయ తీర్పు తర్వాత రాజ్యాంగ తీర్పులు?లోక్‌సభకూ, ఏపీతో సహా నాలుగు శాసనసభలకూ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. అప్రతిహతంగా సాగిపోతుందనుకున్న నరేంద్రమోడీ హవాకు బ్రేకులు వేశారు ఓటర్లు. మిశ్రమ కూటమిగానే ఆయన అధికారం చేపట్టవలసి వచ్చింది.మోడీ సర్కారు ఏకపక్ష పోకడలకు ఇకనైనా కొంత పగ్గాలు పడతాయని ప్రజాస్వామిక లౌకిక వాదులు ఎదురుచూస్తున్నారు. ప్రజా న్యాయస్థానంలో పరిస్థితి ఇదైతే రాజ్యాంగ న్యాయస్థానాల్లో అంటే న్యాయవ్యవస్థలో ఏమైనా మార్పులు రావడానికి ఇది దారితీస్తుందా అనే చర్చ న్యాయవర్గాల్లో సాగుతున్నది. ఎందుకంటే సంపూర్ణమైన ఆధిక్యత లేదంటే అంతకు మించిన సంఖ్యాబలం కలిగిన ఏకపార్టీ ప్రభుత్వాలున్నప్పుడు న్యాయవ్యవస్థ ఒకింత ఆలోచించి అడుగు వేస్తుందనేది ఇన్నేళ్ల అనుభవం.నిజానికి రాజ్యాంగం న్యాయవ్యవస్థకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇచ్చినప్పటికీ రాజకీయ వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని ఇలా జరుగుతుంటుందని అంటుంటారు.
వివాదాలు, ఆరోపణలు
రాజ్యాంగ సంబంధమైన అంశాలలో కూడా సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాలు, ఆలస్యాలు, రకరకాల వ్యాఖ్యలకు విమర్శలకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాలలోనూ వేర్వేరు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు తమ తమ అనుకూలతలను బట్టి కోర్టులపై వ్యాఖ్యలు చేయడం తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్‌, కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలలోనూ కోర్టులపై వివాదాస్పద సన్నివేశాలు చూశాం. 1991-1996 మధ్య కాంగ్రెస్‌ మెజార్టీ కోల్పోయిన పరిస్థితి,తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ క్రియాశీలత వంటి పదాలు ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కూడా విచారించిన ఘట్టం అప్పుడే చూశాం.మళ్లీ 2004-14 మధ్య మన్మోహన్‌సింగ్‌ హయాంలో మరీ ముఖ్యంగా మలిదఫా పాలనలో 2జి స్ప్రెక్ట్రం, బొగ్గు గనుల వేలం, కామన్వెల్త్‌ క్రీడలు ప్రతిదీ సుప్రీంకోర్టు ముందుకు రావడం దేశ రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపింది.అదే మోడీ హయాంలో రఫేల్‌ కుంభకోణం వంటివి కూడా కోర్టులలో తేలిపోయాయి. అయోధ్య తీర్పు, శబరిమల వివాదం, కాశ్మీర్‌ 370 అధికరణం ప్రతిపత్తి, పౌరసత్వ సవరణ చట్టం, ఈవిఎంలు, ఎన్నికల బాండ్లు ఇంకా అనేక అంశాల్లో అత్యున్నత న్యాయస్థానం తీరు అసంతృప్తిని మిగిల్చింది.రాజకీయ నేతలు, మీడియా ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, ఆఖరుకు ముఖ్యమంత్రుల వంటివారిపై కేసుల్లోనూ భిన్న ప్రమాణాలు పాటించడం ప్రశ్నార్థకమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు కూడా పదవులలో పునరావసం పొందిన తీరు మరో వివాదమైంది. ఈ నేపథ్యంలో బీజేపీకి స్వంతంగా మెజార్టీ లేని ప్రస్తుత పరిస్థితి న్యాయవ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది ఇప్పుడు,అనేకమందిని ఆలోచింపచేస్తున్న అంశం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ స్వయంగా ఈ మాటన్నారు. బలమైన కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్‌) ఉంటే న్యాయవ్యవస్థ గట్టి వైఖరి తీసుకోవడానికి కాస్త తటపటాయిస్తుందని ఆయన అన్నారు.
సిజెఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యలు
సిజెఐ చంద్రచూడ్‌ పదవీ కాలం ఈ నవంబర్‌ నెలతో ముగుస్తుంది. ఇటీవలి కాలంలో అత్యధిక కాలం పదవిలో వుంటున్న సిజెఐ ఆయనే. స్వలింగ వివాహాల వంటి సామాజికాంశాల్లో సంచలన తీర్పులకు ఆధ్వర్యం వహించిన సిజెఐ చంద్రచూడ్‌ రాజకీయ రాజ్యాగ అంశాల్లో ఒక విధంగా… మిశ్రమ వ్యాఖ్యలే మూటకట్టుకున్నారు. ఇటీవలనే ఎన్నికల బాండ్లపై వెలువడిన తీర్పు ఇటీవలి కాలంలో ప్రత్యేకించి చెప్పుకోవాలి. నవంబర్‌ రెండవ వారంలో పదవీ విరమణ చేసేముందు ఆయన ఆరు రాజ్యాంగ సమస్యలపై తీర్పులు ఇవ్వాల్సి వుంటుంది. సిజెఐతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాల ముందున్న తీర్పులు వాయిదా పడితే మళ్లీ కొత్తవారు రావడం, వీటిని పునర్వ్యవస్థీక రించడం పెద్ద ప్రక్రియ. ఆలస్యానికి దారితీయొచ్చు.అందుకే వేగంగా పూర్తి చేస్తుంటారు.
ఎస్సీ,ఎస్టీ మైనార్టీ ప్రతిపత్తి
రాజ్యాంగం 16వ అధికరణం కింద వున్న ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణ ఉప వర్గీకరణ చెల్లుతుందా? అనే అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరిలో విచారించింది.2010లో పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు 2004 ఏపీ వర్గీకరణ అంశంలో ఇచ్చిన తీర్పు తర్వాత పంజాబ్‌ విధానం అమలు కాకుండా పోయింది. అయితే ఈ విధంగా కొట్టివేయడం ఇందిరాసహానీ కేసులో1992లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు విరుద్ధమని పంజాబ్‌ వాదిస్తున్నది. ఆ కేసు తర్వాత చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఉప వర్గీకరణ కుదరదని చెప్పింది.ఇప్పుడు దీనిపై తుది తీర్పు వెలువడవలసి వుంది.
ప్రతిష్టాత్మకమైన ఆలిఘర్‌ ముస్లిం యూనివర్సిటీ రాజ్యాంగం 30వ అధికరణం ప్రకారం మైనార్టీ సంస్థ కిందకు వస్తుందా లేదా అనే అంశంలోనూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి వుంది.2006లో అలహాబాద్‌ హైకోర్టు మైనార్టీ ప్రతిపత్తి కొట్టివేస్తూ ఇచ్చినతీర్పును ఎంఎయు సుప్రీంలో సవాలు చేసింది. తమ మైనార్టీ ప్రతిపత్తికి ముప్పు తెచ్చేలా ఎఎంయు చట్టానికి చేసిన వివిధ సవరణలు చెల్లవని వాదించింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రంజన్‌ గోగోరు సిజెఐగా వుండగా ఈ కేసును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించారు. ఫిబ్రవరిలో ఈ కేసు విచారణ ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వులో వుంచింది.ఈ కేసులో తీర్పు దేశవ్యాపితంగా మైనార్టీ సంస్థల హక్కులకు సంబంధించి చాలా ప్రభావం చూపనుంది.
ఆస్తుల పున:పంపిణీ తప్పా?
మూడో కేసుకు మరింత కీలకమైన రాజకీయ ప్రాధాన్యత వుంది. నిజానికి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దాన్ని వివాదాస్పదం చేశారు కూడా. సంపద పున:పంపిణీ జరగాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు.ఒక దశలో మతం రంగు కూడా పులిమారు. వాస్తవం ఏమంటే రాజ్యాంగం 39వ అధికరణం సమాజ భౌతిక వనరులను సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలని చెబుతున్నది.సమాజ భౌతిక వనరులను ఉమ్మడి ప్రయోజనం కోసం పున:పంపిణీ చేయాలని ఈ అధికరణం(బి) పేర్కొంటున్నది.అయితే వ్యక్తిగత ఆస్తిని సమాజానికి చెందిన భౌతిక సంపదగా పరిగణించవచ్చునా? అనే అంశంపై సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. ముంబాయిలోని ఆస్తి యజమానుల సంఘం పేరుతో 20వేల మంది భూ యజమానులు 1991లో మొదటి పిటిషన్‌ వేశారు. కొన్ని ఆస్తులను తీసుకోవచ్చునని మహారాష్ట్ర శాసనసభ చేసిన సవరణను వారు సవాల్‌ చేశారు. ఇది ఇలా వుండగానే 2019లో మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వమే గృహ చట్టానికి సవరణ చేస్తూ నిర్ణీత గడువులోపల ఆస్తి యజమానులు గనక ఆస్తిని పునరుద్ధరించకపోతే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చని నిర్ణయించింది.ఈ సవరణ వల్ల నివాస గృహ సముదాయాలను హస్తగతం చేసుకోవడానికి మహారాష్ట్ర భవన మరమ్మతులు పునరుద్ధరణ బోర్డుకు నిర్మిబంధమైన అధికారాలు సంక్రమిస్తాయంటూ వారు ఆరోపించారు. ప్రయివేటు ఆస్తులు నిజంగా 39(ఎ) అధికరణం కింద పున:పంపిణీ చేయడానికి అవకాశం వుంటుందా అనే అంశంపై ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వాల్సివుంది. ఇక్కడ మౌలికమైన అంశం ఏమంటే రాజ్యాంగం, సంక్షేమ రాజ్యభావనలో ఆర్థిక అసమానతల తొలగింపు కీలకాంశం.మోడీ వంటి వారు మాత్రం ఇదేదో వ్యక్తిగత ఆస్తి హక్కుకు భంగకరమన్నట్టు ప్రచారం చేసి అదరగొట్టడానికి ప్రయత్నించారు.మన దేశంలో కూడా ఇటీవలి వరకూ ఈ సంపద పన్ను,వారసత్వ ఆస్తి పన్ను వుండేవి.ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ముంబాయి కేసుకే గాక దేశ విధానాలకే గీటురాయి కానుంది.
గనులు, ఆల్కహాలు
ఇక మిగిలిన రెండు రాజ్యాంగ కేసులు రాష్ట్ర, కేంద్ర హక్కులకు ఆదాయాలకు సంబంధించినవి. పారిశ్రామిక ఆల్కహాలు,మద్యపానం పరిధి గురించిన చర్చ ఇది. పారిశ్రామిక ఆల్కహాలుపై నియంత్రణ ఎవరిదనేది ప్రశ్న. ఇవి రెండూ స్పిరిట్‌ నుంచే తయారవుతాయి.మరిన్ని రసాయన ప్రక్రియల తర్వాత అది పారిశ్రామిక ఆల్కహాలుగా మారుతుంది.ఏడవ షెడ్యూలులో ఈ రెంటినీ వుంచడం పరస్పర విరుద్ధ వ్యాఖ్యానాలకు దారితీస్తున్నది. ప్రజా క్షేమం రీత్యా పరిశ్రమలపై నియంత్రణ చేసే హక్కు కేంద్రానికి వుంది.మరోవైపున ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే విషపదార్థాల నియంత్రణ రాష్ట్ర అధికారంగా వుంది. దాంతో ఎవరు అదుపు చేయాలనే దానిపై వివాదం కొనసాగుతున్నది. సిజెఐ చంద్రచూడ్‌ ధర్మాసనం దీన్ని విచారించి తేల్చవలసి వుంది.
గనుల నుంచి లోహాల తవ్వకంపై చెల్లించే రాయల్టీ పన్ను కిందకు వస్తుందా అనేది కూడా 25 ఏళ్ల కాలంగా వివాదంగా వుంది.గనులు లోహాల చట్టం సెక్షన్‌9 వాటిని తవ్వుకునేవారు కేంద్రానికి రాయల్టీ చెల్లించాలని నిర్దేశిస్తుంది. దాన్ని గనక పన్నుగా పరిగణించేట్టయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనపు పన్ను విధించవచ్చు. 1963లో తమిళనాడు ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌పై రాయల్టీ గాక అదనపు పన్ను విధించడంతో ఈ వివాదం మొదలైంది. దానిమీద వరుసగా విచారణలు జరిపిన అనంతరం 1989లో సుప్రీం కోర్టు రాయల్టీ ఒక పన్ను అని నిర్ధారించింది.ఈ నిర్ణయం గనుల కాంట్రాక్టర్లకు పారిశ్రామిక వేత్తలకు మింగుడు పడలేదు.వారు అనేక హైకోర్టులలోనూ సుప్రీంలోనూ సవాలు చేయగా అదేదో అనుకోకుండా జరిగిన అచ్చుతప్పు వంటిదని అభిప్రాయం వెలిబుచ్చాయి. అదనపు పన్నును గురించి మాత్రమే కోర్టు పరిశీలించింది తప్ప రాయల్టీని ఉద్దేశించి తీర్పు చెప్పలేదని వివిధ కోర్టులు వ్యాఖ్యానించాయి. ఇది పన్ను అని తేలిస్తే రాష్ట్రాలు దాన్ని పెంచి ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుంది.అసలే వనరుల కొరతతో ఇబ్బంది పడే రాష్ట్ర ప్రభుత్వాలకు కాస్త వెసులుబాటు దక్కుతుంది. కొంతకాలం కిందట దీనిపై విచారణ జరిపిన తొమ్మిది మంది ధర్మాసనం తీర్పు రిజర్వు చేసి వుంచింది.
మరింత జటిలం
వీటన్నిటిపై ప్రజాస్వామిక పరిష్కారాలు వస్తాయా అని ఎదురు చూస్తుంటే పులిమీద పుట్రలా కొత్త వివాదాలు బయిలుదేరాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను లిక్కర్‌ కేసులో కింద కోర్టు బెయిలుపై విడుదల చేస్తే ఢిల్లీ హైకోర్టు విడుదల ఆపింది.కానీ పాస్కో కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను అరెస్టు చేయాలని కింద కోర్టు ఉత్తర్వులిస్తే మాజీ ముఖ్యమంత్రి విషయంలో అలా ఎలా చెప్తారని హైకోర్టు ఆపేసింది. ఈ ద్వంద్వనీతిని న్యాయ నిపుణులు తీవ్రంగా ప్రశ్నించారు.లోక్‌సభ ఫలితాలు వచ్చాకనే ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రముఖ రచయిత్రి అరుంధతీరారుపై రాజద్రోహ నేరారోపణ విచారణ జరపాలని ఆనుమతినివ్వడం కూడా నిరసనకు గురైంది. నేరచట్టాలను ఇష్టానుసారం మార్చి అమలు కోసం హడా వుడి పడటం కూడా ఆక్షేపణకు దారితీస్తున్నది. అందుకే రానున్న రోజుల్లో ఈ అంశాలు దేశంలో మరింత చర్చనీయం కానున్నాయి. కార్యాచరణకూ దారితీస్తాయి.
తెలకపల్లి రవి