రాజ్యాంగబద్ధమా? దివ్యశక్తి ప్రేరితమా?

రాజ్యాంగబద్ధమా? దివ్యశక్తి ప్రేరితమా?(మే 26 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’
సంపాదకీయం)
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సమయంలో రాజ్యాంగ రక్షణే కీలకాంశంగా ఈ ఎన్నికలు నడిచాయనేది నిస్సందేహం. ఎన్నికల ప్రారంభ ఘట్టం నుంచి ‘ఇండియా’ వేదిక పార్టీలు ఎన్నికల రంగంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఒక ప్రధాన ఇతివఅత్తమని చెబుతూనే వచ్చాయి. గత దశాబ్ది కాలంలోనూ దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రజానీకం వివిధ రకాలైన నియంతృత్వ కోణాలను చూశారు. ప్రతిపక్షాలు రాజ్యాంగ పరిరక్షణ అన్న ఈ పిలుపునిస్తున్న తరుణంలోనే మోడీ బీజేపీకి నాలుగు వందలకు పైగా స్థానాలు రావాలనే నినాదం ఎత్తుకున్నారు. బీజేపీ నాయకులు అనేక మంది రాజ్యాంగాన్ని మార్చాలంటే 400 స్థానాలు గానీ భారీ మెజారిటీ గానీ కావాలనే వాదన ఎత్తుకోవడంతో రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం వుందనేది మరింతగా ధఅవపడింది.
రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్‌సభలో భారీ అధిక్యత వుండాలి గనకనే బీజేపీి 400 స్థానాల సాధన లక్ష్యంగా పెట్టుకుందని ఆ పార్టీ ఎంపి అనంత కుమార్‌ బెంగళూరులో చెప్పారు. ఫైజాబాద్‌ బీజేపీ ఎం.పి లల్లూ సింగ్‌, నాగూర్‌ బీజేపీ అభ్యర్థి జ్యోతి మీర్ధా, మీరట్‌లో ఆ పార్టీ అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార క్రమంలో బీజేపీి నాయకులు వ్యక్తం చేసిన ఈ అభిప్రా యాలతో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ప్రతిపక్ష ఉద్యమానికి మరింత బలం చేకూరింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఈ పిలుపుకు ప్రజల నుంచి ఎంత గట్టి ప్రతిస్పందన వస్తున్నదో బీజేపీ నేతలకు మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్‌ షా లకు నివేదికలు అందాయి. డా బి.ఆర్‌. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా గౌరవించే దళిత వర్గాలలో ఈ ప్రచారం మరింతగా చొచ్చుకు పోయిందని కూడా వారికి నివేదికలు చేరాయి.
ఎదురు దాడితో జవాబు
దాంతో నరేంద్ర మోడీ ప్రతిపక్షాల ఈ ఆరోపణను గట్టిగా ఖండించే పని మొదలుపెట్టారు. తొలి దశ పోలింగ్‌ ముగింపులోగానే ఆయన రాజ్యాంగం తమ పార్టీకి పవిత్రమైందని ప్రకటించారు. గీత, రామాయణ్‌, బైబిల్‌, ఖురాన్‌ల లాగే ప్రభుత్వం దాన్ని పవిత్రంగా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక అంబేద్కర్‌ వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేరని చెప్పేదాకా వెళ్లారు. కాంగ్రెస్‌ ‘ఇండియా’ వేదిక పార్టీలే రాజ్యాంగాన్ని మారుస్తాయంటూ బిగ్గరగా గొంతు పెంచి ఎదురు దాడికి దిగారు. ‘ఇండియా’ వేదిక ఆరోపణ చేరవలసిన వారికి చేరింది గనకే తప్పు చేసిన వాళ్ల తరహాలో ఈ ప్రతిస్పందనకు దిగారన్నమాట.
రాజ్యాంగానికి ప్రమాదం అనే దానిలో మరో అంశం కూడా మోడీని ఇబ్బంది పెట్టింది. రాజ్యాంగాన్ని మార్చితే ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లు రద్దయిపోతాయనే ఆరోపణ కూడా ఆయనకు మింగుడు పడలేదు. కొంతమంది ఓటర్ల బఅందం మీడియాతో మాట్లాడేప్పుడు ఈ విధంగా ఆందోళన వెలిబుచ్చారు. దాంతో రాజ్యాంగ మార్పు అనే ఈ అంశాన్ని మతపరమైన మలుపు తిప్పి ఎదురుదాడి చేయడానికి మోడీ ప్రయత్నించారు. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లను మత ప్రాతిపదికన ముస్లింలకు కట్టబెట్టేందుకు ‘ఇండియా’ వేదిక ప్రయత్నిస్తున్నదని ఆయన వరుసగా ఒక్కో సమావేశంలో ఆరోపణలు గుప్పించారు. కర్నాటకలోనూ తెలంగాణలోనూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ ఇవ్వడాన్ని మోడీ, అమిత్‌ షా అదే పనిగా ప్రస్తావిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ ‘ఇండియా’ వేదిక పార్టీలూ హిందువుల రిజర్వేషన్లనే గాక ఆస్తులను కూడా లాగేసుకుని ముస్లింలకు అప్పగిస్తారని వారు ప్రచారం చేశారు.
ముస్లిం రిజర్వేషన్ల నిజమేమిటి?
కాని వాస్తవం ఏమంటే వెనకబడిన తరగతులుగా ప్రకటించబడి, ఒబిసి ప్రతిపత్తితో ముస్లిం వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను మత ప్రాతిపదికన ఇచ్చినట్టుగా చిత్రించడం మోసపూ రతమైంది. ఒబిసి ల విషయంలో రాజ్యాంగ అధికరణాలు 15(4), 16(4) కింద వెనకబడిన తరగతుల లెక్కలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఈ అధికరణాలు మతంతో నిమిత్తం లేకుండా వెనకబడిన తనాన్ని ఎలా నిర్వచించాలో చెబుతున్నాయి. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం సామాజికంగా విద్యాపరం గా వెనకబడిన వారిగా రాష్ట్రాల బిసి కమిషన్లచే గుర్తించబడిన ముస్లిం గ్రూపులను చాలా రాష్ట్రాలలో ఒబిసి వర్గాలలో చేర్చారు. నిజానికి మోడీ స్వయంగా కొన్నేళ్ల కిందట ఎ.ఎన్‌.ఐ కి ఇంటర్వ్యూ ఇస్తూ 70 ముస్లిం గ్రూపులకు ఒబిసి ప్రతిపత్తి కల్పించడానికి తానే కారణమని గొప్పలు చెప్పుకున్నారు.
వాస్తవానికి మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి ముప్పు తెచ్చిపెడుతున్నదనే అభిప్రాయం ఏర్పడటం వల్లనే ప్రజలలో పెద్దభాగం ఆయనకు వ్యతిరేకంగా ఓటేయాలనే గట్టి వైఖరికి వచ్చారు. ఆ కారణంగానే ఈ ఎన్నికల ఫలితం ఎలా వుంటుందనే దానిపైన, తదనంతర పరిణామాలపైన అలజడి నెలకొన్నది. పదేండ్ల మోడీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగ సంస్థలకూ వ్యవస్థలకూ ముప్పుగా పరిణమించింది. ఈ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన అనేక సందేహాలకు దారితీసింది. అసలు ఈ సంఘం ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛగా నిర్వహించగలదా అనే సందేహాలు తెచ్చిపెట్టింది. ప్రధాన మంత్రి మతతత్వ భాషణలతో రెచ్చగొట్టే విధంగా ఎన్నికల ప్రచారం నడుపుతుంటే అరి కట్ట డంలో దారుణంగా విఫలమైంది. పోలైన ఓట్ల శాతం కచ్చితంగా అందించడంలోనూ విముఖత ప్రదర్శితమైంది. దీనిపై సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన తర్వాత మాత్రమే కదలిక వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంలోనూ అన్ని విధాల వైఫల్యం కానవచ్చింది. వీటన్నిటి కారణంగానే ఎన్నికల సంఘంపై భయాలు పెరిగాయి.
కొసమెరుపులు
చివరి దశ పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే మే 31న పదవీ విరమణ చేయవలసిన సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్‌ పాండే పదవీ కాలాన్ని ప్రభుత్వం నెల రోజులపాటు పొడిగించింది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని చర్య ఇది (1975లో ఒకసారి తప్ప మరే ఇతర సైనికదళ ప్రధానాధికారికీ పొడగింపు ఇచ్చింది లేదు). ఉన్నవారి పదవీ విరమణ లోపు కొత్తవారి పేరు ప్రకటించకపోతే అప్పటి వరకూ ఒక తాత్కాలిక ప్రధానాధికారిని నియమించేవారు. ప్రస్తుత సందర్భంలోనైతే కొత్త ప్రధానాధికారిని రాబోయే ప్రభుత్వం నియమించవలసి వుంటుంది. ఇప్పుడు ఇలా ఎందుకు పొడగింపు ఇచ్చారనే ఎలాంటి వివరణ కానీ ఎన్నికల సంఘం ఇందుకు అనుమతి ఇచ్చిందా అనే స్పష్టత గానీ లేవు. దాంతో ఎన్నికల అనంతర పరిస్థితిపై అన్ని రకాల ఊహాగానాలకూ ఆస్కారం ఏర్పడింది.
ఇక చివరగా చూస్తే నరేంద్ర మోడీ తనకు తానే రాజ్యాంగం పట్ల తన విధేయతను ప్రశ్నార్థకం చేసుకున్నారు. దేశానికి ప్రజలకూ సేవ చేయడం కోసం ఆ పరమాత్ముడే తనను పంపించాడంటూ ఆఖరి దశ ప్రచార ఘట్టంలో ఆయన విచిత్రమైన ప్రకటన చేశారు. తాను ఆ విధంగా నమ్ముతున్నానన్నారు. అంటే తాను దేవుడికి తప్ప మరెవరికీ జవాబు దారీ కాదని స్పష్టంగా చెప్పారన్నమాట. ఇప్పుడు పోలింగ్‌ ఆఖరి దశలో చివరి 48 గంటలు ఆయన కన్యాకుమారిలో వివేకానంద శిలాఖండంపై కూర్చుని ధ్యానం చేయబోతున్నారు. కనుక ఇకపై ఆయన భవిష్యత్‌ చర్యలు రాజ్యాంగం ప్రకారం నడుస్తాయా లేక దివ్యశక్తి ప్రపూరితంగా నిర్దేశించబడతాయా అన్నది చూడవలసిందే.