వీఓఏలపై నిర్బంధం తగదు

– 37 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టదా
– గొంతెమ్మ కోర్కెలు కోరట్లేదు.. అన్నీ న్యాయమైనవే : సీఐటీయూ జాతీయ నాయకులు ఎం.సాయిబాబు
 – ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఐకేపీ వీఓఏలు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర సర్కారు నిర్బంధం తగదని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. వారి తొమ్మిది డిమాండ్లలో ఒక్కటి కూడా గొంతెమ్మ కోర్కె లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లాల్లో వీఓఏలపై నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే మొండిగా వ్యవహరించి వీఓఏలు సమ్మెలోకి వెళ్లేలా చేసిందన్నారు. 19 ఏండ్లుగా సెర్ప్‌లో పనిచేస్తున్న వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. 37 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర సర్కారుకు పట్టదా? వారి కుటుంబాలు ఎలా బతకాలి? అని ప్రశ్నించారు. రూ.3,900 వేతనంతో ఎలా బతకాలో చూపెట్టాలని నిలదీశారు. యూనియన్ల అనుబంధాలకతీతంగా వీఓఏలు ఐక్యంగా సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమ్మెకు గ్రామ సమాఖ్యలు కూడా మద్దతిస్తున్నాయన్నారు. వీఓఏల విషయంలో రాష్ట్ర సర్కారు మొండి వైఖరిని విడనాడాలని సూచించారు. గతంలో వీరి సమ్మెకు ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వీఓఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలనీ, ఆన్‌లైన్‌ పనులు రద్దు చేయాలనీ, సెర్ప్‌ సంస్థ నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని సమ్మె చేస్తున్న వీఓఏలతో చర్చలు జరపాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, భూపాల్‌, కె. ఈశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్‌, ఎం. వెంకటేష్‌, ఐకేపీ వీఓఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్‌, నగేష్‌, కోశాధికారి సుమలత, యూనియన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు రాములు, వెంకటయ్య, సరస్వతి, సీఐటీయూ నాయకులు జె. కుమారస్వామి, ఎ. సునీత, ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌, అజరుబాబు, రాములు తదితరులు పాల్గొన్నారు.