ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలి

– అంబేద్కర్‌ నాలెడ్జ్‌ కోచింగ్‌ సెంటర్ల నిర్మాణంలో వేగం పెంచాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇప్పటికే గుర్తించిన 20 ప్రాంతాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో విద్యాశాఖ, ఆర్‌అండ్‌ బీ, ప్రయివేటు నిర్మాణ సంస్థ తదితరులతో ఆయన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, లేఔట్లు, నిర్మాణ డిజైన్లు, వసతులు, బడ్జెట్‌ దగ్గర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మొదటి దశలో ప్రారంభిస్తున్న 20 ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణం వచ్చే ఏడాది జూన్‌ కల్లా పూర్తి కావాలని ఆదేశించారు. గతంలో చేసిన సూచనలు ఏ మేరకు అమలు చేశారో ఫ్రీ కాస్ట్‌ నిర్మాణ సంస్థ నిర్వాహకులను విచారించారు. ఇప్పటివరకు మొత్తం 37 ప్రాంతాల్లో 49 పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన స్థలాల వివరాలు వచ్చినట్టు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంబేద్కర్‌ నాలెడ్జ్‌ కోచింగ్‌ సెంటర్స్‌ నిర్మాణం పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నరసింహారెడ్డి, మహాత్మ జ్యోతిబాపూలే సెక్రెటరీ సైదులు, ఎస్టీ, ఎస్సీ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.