మోడల్ విలేజిగా వీణవంక మురుగు కాల్వలు, సీసీ రోడ్లు ఏర్పాటు

– ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి 

నవతెలంగాణ-వీణవంక
ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ సహకారంతో వీణవంక మండల కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తూ మండల కేంద్రాన్ని మోడల్ విలేజిగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటునందిస్తానని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు, ఇంకా చేయాల్సిన పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించి పలు సూచనలు చేశారు. అలాగే స్థానిక జూనియర్ కళాశాలను, తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం విస్తరించిందని, మండల కేంద్రంలో ఎక్కడ కూడా సరైన రోడ్లు, మురుగు కాల్వలు లేకపోవడంతో గ్రామం అందకారంలోకి నెట్టివేయబడిందని అన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు పోయడంతో పాటు మురుగు కాల్వలను నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వీణవంక మండల కేంద్రాన్ని మోడల్ విలేజిగా రూపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, పాలక వర్గం సహకారంతో గ్రామాన్ని అందంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. కావున ప్రతీ ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే మండల కేంద్రంలో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నిర్మించిన తరహాలో సుందరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అలాగే కళాశాలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, అధికారులు పాల్గొన్నారు.