”ఏమి జరిగిందండీ” అప్పుడే పొలం నుండి వచ్చి ఆరుబయటున్న మంచంపై విచార వదనంతో నడుము వాల్చిన రాజయ్యను ఆప్యాయంగా అడిగింది మణెమ్మ.
”ఏముంది పాత కథే” ముక్తసరిగా అన్నాడు.
”ఈ వయసులో మనకిది అవసరమా.. పిల్లలు చెప్పినట్లు..”
”మళ్లీ మొదలెట్టావా నీ భారతం” రాజయ్య గర్జింపులకు మణెమ్మ టక్కున మాటలాపింది.
‘ఉన్న ఊరు, కన్న తల్లి, కాళ్ళు చేతులు కాకర కాయలు అంటూ చాదస్తంతో ప్రాణం మీదికి తెచ్చుకున్నది చాలక అరుపులొకటి’ మనసులో అనుకుంటూ విసురుగా ఇంట్లోకి వెళ్లింది.
రాజయ్యకు వ్యవసాయం చేయడం అంటే చాలాఇష్టం. చిన్ననాటి నుండి వ్యవసాయం చేస్తూ ఇద్దరు అడబిడ్డల పెళ్ళి చేసాడు. ఇద్దరు మగ బిడ్డలకు మంచి చదువు ఇప్పించాడు. వారు కష్టపడి చదివి, ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు.
పట్టణాల్లో ఉద్యోగం చేస్తున్న కుమారులు రాజయ్య దంపతులను ఊరు వదిలిపెట్టి తమ దగ్గర ఉండమని వేడుకున్నారు. తాము ఊరు విడిచి రాలేమన్నారు. వయసు మీరింది కాబట్టి పనేమీ చేయకుండా, విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లోనే ఉండమని కుమారులు చెప్పారు. ఖర్చులకు సరిపడా డబ్బులు తాము సర్దుబాటు చేస్తామన్నారు.
పొలం పనులు చేయడానికి అలవాటు పడిన రాజయ్య, మణెమ్మ దంపతులు తమకున్న నాలుగు ఎకరాల పొలం సాగు చేయడం మానలేదు.
”ఈ వయసులో మీకు వ్యవసాయం అవసరమా నాన్న. హాయిగా తింటూ కూర్చోండి” అన్నారు కుమారులు.
”వ్యవసాయం మనకు తల్లివంటిది. మాకు చేతనైనంత కాలం పని చేస్తాం. పొలం బీడుగా ఉంటే మంచిది కాదు. ఊరికే తిని కూర్చుండడానికి మనసొప్పడం లేదు” అన్నాడు రాజయ్య.
ఒకప్పుడు ఎద్దుల నాగలితో పొలం దున్నకం, పశువుల పేడతో ఎరువులు, పరస్పర సహకార పద్ధతిలో పనులు చేసుకోవడం వల్ల రైతులకు పంట గిట్టుబాటయ్యేది. వ్యవసాయం వల్ల వచ్చిన రాబడితో రాజయ్య తన పిల్లలను ప్రయోజకులుగా చేయగలిగాడు.
కాలం మారింది. ఇప్పుడు రైతుల దగ్గర పశువులు లేవు. యంత్రాలపై ఆధారపడే పరిస్థితి దాపురించింది. ట్రాక్టర్, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కూలీల ఖర్చులు తడిసి మోపేడై, వ్యవసాయం కష్టతరమైనది. రైతులు ఇంకో పని చేయలేక, పొలాన్ని వదలలేక నిత్య సంఘర్షణకు లోనవుతున్నారు.
వ్యవసాయ పనుల వల్ల రాజయ్యకు లాభం కాని, నష్టం కాని లేదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర మాత్రం ఉన్నాయి. తమకు ఇంతకంటే ఇంకేమి కావాలని రాజయ్య దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. వీలైనంతవరకు తోటి వారికి సహాయం చేస్తున్నారు.
రాజయ్య మంచితనం, కష్టపడేతత్వం పొరుగున ఉన్న ఆరుగురు రైతులకు కంటగింపుగా మారింది.
‘కొడుకులకు ఉద్యోగాలున్నాయి. ముసలి వయసులో కూడా వ్యవసాయం చేయడమా?’ అని రాజయ్య దంపతులపై అసూయ, ద్వేషం పెంచుకుని, ఆరుగురు రైతులు రాజయ్య చేత వ్యవసాయం మాన్పించాలని కుట్రలు చేశారు.
కాలువకు గండి కొట్టి వరద ప్రవాహాన్ని రాజయ్య పొలం లోనికి మళ్ళించి పంటను ముంచడం, బావిలోని మోటారును పాడు చేయడం, పైపులు, వ్యవసాయ పనిముట్లు ఎత్తుకెళ్ళడం, చేతి కందిన పంటను తగుల పెట్టడం, కొట్టాల నుండి పశువులను విడిపించి పంటచేలో తోలడం, పచ్చని చెట్లు నరికేయడం లాంటి కుయుక్తులతో రాజయ్యకు తీరని శోకాన్ని మిగిల్చారు.
రాజయ్య తనకు జరిగిన అన్యాయం గురించి పెద్ద మనుషుల దగ్గర విన్నవించగా సాక్ష్యం కావాలని అడిగారు. రాజయ్య ఒంటరివాడు. ప్రత్యర్థులు ఆరుగురు. పలుకుబడి కలవారు. రాజయ్య కొడుకులు ఎక్కడో పట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. వారితో తమకు ఏం లాభము లేదని కొందరు పెద్ద మనుషులు ఆరుగురి వైపే నిలబడినారు.
కాలువకు గండి, పంట చేనులో మంట ప్రమాదవశాత్తు అని తేల్చి చెప్పారు. మిగతా వాటికి సరైన సాక్ష్యాలు చూపించమని ఎదురు దాడికి దిగారు. తాము ఎంతటి ఉన్నత విద్య చదువుకున్నా, పంచాయితీలో న్యాయాన్ని గెలిపించడం అంత సులభం కాదని రాజయ్య కుమారులకు బోధపడింది. సరైన ఋజువులు లేకుండా ఆరుగురిని ఎదుర్కోవడం అసాధ్యమని తెలిసింది.
”మనకు ఈ గొడవలు వద్దు, ఇప్పటికే బాగా నష్టపోయాం. మేం దూరంగా ఉంటాం. మీరు ఒక్కరే. వారు ప్రమాదంగా ఉన్నారు. వ్యవసాయం మానేద్దాం” అన్నారు కొడుకులు.
”మన పని మనం చేస్తున్నాం. ఎవరిది తీసుకోవడం లేదు. ఆరుగురికి భయపడి మానేయమంటారా, వారు ఓర్వలేని దుర్మార్గులు” అంది మల్లమ్మ.
”నన్ను వారు ఏం చేసినా సరే” అన్నాడు రాజయ్య.
కొడుకులు ఏమి మాట్లాడకుండానే తిరిగి పట్నం వెళ్ళి పోయారు.
తమ పాచికలు పనిచేసాయని ఆరుగురు మురిసారు. కాని రాజయ్య మళ్ళీ పొలం పనులు చేస్తుండడంతో, వారు కొత్త పథకాలకు పదును పెట్టారు. కొన్ని రోజులు గడిచాయి.
రాజయ్య ఒకరోజు రాత్రి కరెంట్ మోటర్ పెట్టడానికి పొలం దగ్గరికి వెళ్ళాడు. టార్చిలైట్ వెలుగులో తెల్లని నాలుగు ఆకారాలు పొలంలో తిరుగుతున్నట్లు కనిపించాయి.
”ఎవరు” గట్టిగా అరిచాడు.
అవి విచిత్రంగా గోల చేస్తూ, వింత వింతగా ప్రవర్తిస్తూ రాజయ్య వైపు వస్తున్నాయి. దెయ్యాలున్నాయని వినడమే కాని రాజయ్య ఎప్పుడూ వాటిని చూడలేదు. మొదటిసారిగా భయం కలిగింది. వెనక్కి అడుగులు వేస్తూ, ఇంటి దారి పట్టాడు. మరుసటి రోజు పొలంలో దెయ్యాలు తిరుగుతున్న విషయం ఊరందరికి తెలిసింది.
ఆరుగురు రైతులు మరొక ఎత్తుగడ వేసి రాజయ్య కుటుంబాన్ని పంచాయతీకి పిలిపించారు. పొలంలో జరిగిన సంఘటనలకు దెయ్యాలే కారణమని, మాపై అనవసరంగా నిందలు మోపారని, అందుకు క్షమాపణ చెప్పాలని వితండవాదం చేసారు. పెద్ద మనుషులు వారికి వంత పాడారు. ఊరి జనం ఇది పద్దతి కాదన్నారు. రాజయ్యను దోషిగా నిలబెట్టి తీర్పు చెప్పడానికి పెద్ద మనుషులు తీవ్ర కసరత్తు చేసారు.
”మా అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఏమి లేదా” అడిగారు రాజయ్య కుమారులు. లేదన్నట్లు సైగ చేసారు పెద్ద మనుషులు.
”అయితే ఇది చూడండి” అని ఒక వీడియోను ఊరి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసారు. అది సిసి టివి ఫుటేజ్.
ఆరుగురు రైతులు రాజయ్య పొలం దగ్గర కూర్చోని దెయ్యాల వేషాలు వేస్తూ, అతడిని ఏ విధంగా భయపెట్టాలనే పథక రచన చేస్తున్న వీడియో. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద మనుషుల నోటి నుండి మాట రావడం లేదు. ఆరుగురు ఇంకా షాక్ నుండి తేరుకోలేదు.
”మా పంటలకు నష్టం చేస్తున్న వారిని గుర్తించి, న్యాయం చేయమని అంటే, సాక్ష్యాలు కావాలని అడిగారు కదా! అందుకే మేము రహస్యంగా పొలంలో సిసి కెమెరాలు అమర్చినాం.ఇది సరిపోతుందా, ఇంకా కావాలా ”అన్నారు కుమారులు.
రాజయ్య నష్టపోయిన పంట మొత్తానికి సరిపడా డబ్బులను వడ్డీతో సహా ఆరుగురు చెల్లించాలని పంచాయితీ ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.
– దుర్గమ్ భైతి, 9959007914