కంటైనర్‌ షిప్‌ ఇరాన్‌ స్వాధీనం

Container ship seized by Iran–  హర్మజ్‌ జలసంథి సమీపంలో ఐఆర్‌జీసీ బలగాల చర్య
– నౌకలో 17మంది భారతీయులు సహా 25మంది
– అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందన్న ఇజ్రాయిల్‌ అండగా వుంటామన్న బైడెన్‌
టెహరాన్‌ : పశ్చిమాసియావ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో హర్మజ్‌ జలసంథి సమీపంలో కంటైనర్‌ షిప్‌ను ఇరాన్‌ సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ఈ నౌకను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ఇర్నా శనివారం తెలిపింది. ఆ నౌకలో 25మంది సిబ్బంది వున్నారని, వారిలో 17మంది భారతీయులని ఇటాలియన్‌-స్విస్‌ షిప్పింగ్‌ కంపెనీ ఎంఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన వారిలో నలుగురు ఫిలిప్పీన్‌ జాతీయులు, ఇద్దరు పాకిస్తానీలు, ఒక రష్యన్‌, ఒక ఎస్తోనియా జాతీయుడు వున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని, వారందరూ సురక్షితంగా వుండేలా, నౌక సజావుగా ముందుకు సాగేలా చూస్తున్నామని వెల్లడించింది. టెహరాన్‌లో, ఢిల్లీలో దౌత్య మార్గాల ద్వారా ఇరాన్‌ అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలో వారిని విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇరాన్‌ ప్రాదేశిక జలాల వైపునకు ఈ నౌక కదులుతోందని తెలిపింది.
పోర్చుగీస్‌ పతాకంతో వున్న ఈ నౌకను ఎంఎస్‌సీ అరీస్‌గా గుర్తించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఓడరేవు నుండి ఈ ఓడ భారత్‌కు వెళ్లేందుకు బయలుదేరింది. ఇజ్రాయిల్‌ బిలియనీర్‌ అయిన ఇయాల్‌ ఓఫర్‌, ఆయన కుటుంబం నిర్వహిస్తున్న జోడియాక్‌ గ్రూపులో భాగమైన జోడియాక్‌ మారిటైమ్‌తో ఈ నౌకకు సంబంధముంది. హెలికాప్టర్‌ నుంచి సైనికులు ఓడలోకి దిగుతున్న దృశ్యం మీడియాకు లభించింది. సోవియట్‌ రూపొందించిన మిల్‌ ఎంఐ-17 హెలికాప్టర్‌లో ఐఆర్‌జీసీ నావికా బలగాలు వున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన జలమార్గంగా భావిస్తున్న యూఏఈ ఫుజారియాకు ఈశాన్యంగా 50నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రాంతీయ అధికారులు ఈ నౌకను అదుపులోకి తీసుకున్నారని బ్రిటన్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ (యుకెఎంటిఓ) తెలిపింది. శుక్రవారం ఈ నౌక దుబారు తీరం నుంచి హర్మజ్‌జలసంధి వైపు కదులుతోంది. తన ట్రాకింగ్‌ డేటాను ఈ నౌక ఆఫ్‌ చేసింది. ఈ ప్రాంతంలో తిరిగే ఇజ్రాయిల్‌ అనుబంధ నౌకలకు ఇది సర్వసాధారణమే.
ఇరాన్‌పై ఆంక్షలు విధించండి : ఇజ్రాయిల్‌
ఇరాన్‌ తీసుకున్న ఈ చర్యను ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రి కట్జ్‌ ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెడుతూ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి ఇరాన్‌ సముద్ర చౌర్యానికి పాల్పడిందని వ్యాఖ్యానించారు. తక్షణమే ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించి, ఇరాన్‌పై ఆంక్షలు విధించాలని ఆయన యురోపియన్‌ యూనియన్‌ను కోరారు. ఇజ్రాయిల్‌, గాజా, లెబనాన్‌, సిరియా ప్రజలను ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ బెదిరించలేదని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రతినిధి డేనియల్‌ హగారి వ్యాఖ్యానించారు. ఇరాన్‌ ఒకవేళ దాడి చేస్తే తగురీతిలో స్పందించడానికి సిద్ధంగా వున్నామని స్పష్టం చేశారు. సిరియాలో ఇరాన్‌ కాన్సులేట్‌పై ఇజ్రాయిల్‌ దాడి నేపథ్యంలో ఇరాన్‌ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని ఊహిస్తున్న తరుణంలో మధ్యప్రాచ్యానికి మరిన్ని మిలటరీ సామగ్రిని అమెరికా మిలటరీ తరలిస్తోంది. ఈ ప్రాంతంలోని అమెరికా బలగాలను మరింతగా కాపాడుకునేందుకే ఈ చర్య అని అమెరికా రక్షణాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎప్పుడో ఒకప్పుడు ఇరాన్‌పై ప్రతీకార చర్య తప్పదని, ఇజ్రాయిల్‌ను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు.