– మండుతున్న వేసవి.. అడుగంటిన నీళ్లు
– రబీ పంటలకూ కొరతే
– పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకం
– ఉమ్మడి జిల్లాలవారీగా ఐఏఎస్‌లకు బాధ్యతలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రమంతటా తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది. రాజధాని హైదరాబాద్‌లోనూ ఇదే దుస్థితి. వర్షాభావం, అడుగుంటిన భూగర్బజలాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల వారీగా 10 మంది ఐఏఎస్ అధికారులను నియమించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వారికి అధికారాలిచ్చింది. ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలని ఆదేశించింది. రాష్ట్రంలో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలనీ, జులై చివరి వరకు ఈ ప్రత్యేక అధికారులు సెలవు పెట్టకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రధాన జలాశయాలు తాగు అవసరాలకు మినహా సాగుకు ఎంతమాత్రం నీటిని ఇవ్వలేని పరిస్థితి (డెడ్ స్టోరేజీ)కి చేరాయి. భూగర్భ జలమట్టాలు సైతం గత పదేండ్లల్లో ఎన్నడూ లేనిస్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో నీటి వథాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర జనాభా దాదాపు నాలుగు కోట్లు. హైదరాబాద్‌లోనే దాదాపు సగం వరకు నివసిస్తారు. వీటికితోడు ఏజెన్సీలోనూ మంచినీటి సమస్య ముందుకొచ్చింది.
ప్రత్యేక అధికారుల నియామకంతో తాగునీటి సమస్య అధికం కాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆమేరకు ఇప్పటికే సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదే పదే కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కొంతమేర ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండాపోయింది. వర్షపాతం సాధారణం కంటే ఈమారు 14 శాతం తక్కువగా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణతోపాటు దక్షిణ తెలంగాణలోనూ నీటి ఎద్దడి తప్పడం లేదు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ సమస్య తలెత్తింది. వరంగల్, నల్లగొండతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఉట్నూర్ నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో సమస్య విలయతాండవం చేస్తున్నది. జైనూర్, కెరామెరి, ఆసిఫాబాద్, వాంకిడి, సిర్పూర్ పట్టణం, తిర్యాని తదితర గిరిజన ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా కనిపిస్తున్నది. గత బీఆర్‌ఎస్ సర్కారు నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు నుంచి గిరిజన గూడెలకు నీళ్లందడం లేదనే ఫిర్యాదులు మంత్రులు, కలెక్టర్లకు వెల్లువెత్తుతున్నాయి. అక్కడక్కడా కొంతమేర వస్తున్నా, అందులో కలుషిత నీరే ఉంటున్నదని ఆవేదన వ్యక్తమవుతున్నది. ప్రత్నామ్నాయ చర్యల్లో భాగంగా ఉత్తర తెలంగాణలో రెండు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా జరుగుతున్నది. నల్లాల్లో తగినంత ప్రెజర్ లేక, సరఫరా తీవ్ర ఆలస్యమవుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రమం తప్పకుండా నీటి సరఫరా కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రబీ పంటలకూ నీరందడం లేదు. భూగర్భజలాలు సగటున 7.34 అడుగుల మేర పడిపోయాయని అధికారిక సమాచారం.