– ఆస్పత్రిలో ఇతరుల తనిఖీ ఏంటి ?
– అభ్యంతరం తెలిపిన వైద్యులు
– విధులను బహిష్కరించి ఆందోళన
– అదనపు కలెక్టర్ నచ్చ చెప్పినా ససేమిరా అన్న వైద్యులు
– వైద్యులు ఇలా చేస్తే మా పరిస్థితి ఏంటి?
– కలెక్టర్ చెప్పిన వినకుంటే ఎవరు చెప్తే వింటారు?
– జిల్లా ప్రజల మండిపాటు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తీసుకున్న నిర్ణయంపై నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బగ్గుమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే ఉద్దేశంతో కలెక్టర్ నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసే ఉద్దేశంతో జిల్లా స్థాయి అధికారులను నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నల్లగొండ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి ని వైద్యులు అడ్డుకున్నారు. తమ సేవల పట్ల అనుమానం వ్యక్తం చేయడం బాధాకరమని తమ స్థాయి అధికారులతో తమపై విచారణ చేయించడం ఏంటని వైద్యులు జడ్పీ సీఈఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి విషయాన్ని అదనపు కలెక్టర్ పూర్ణచంద్రకు చేరవేయడంతో హుటాహుటిన ఆయన ఆసుపత్రికి వచ్చి వైద్యులతో చర్చించారు. అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర వైద్యులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వారు తమ ఆందోళనను విరమించలేదు. వైద్యులపై నమ్మకం లేక కలెక్టర్ ఇతర శాఖల అధికారులతో తనిఖీ చేయించడం లేదని కేవలం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతోనే కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర వైద్యులకు చెప్పారు. కానీ వైద్యులు ఆయన మాటల పట్ల నిరసన వ్యక్తం చేశారు.
తాము ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు హెచ్ ఓ డి లకు, ఆసుపత్రి సూపరిండెంట్ కు చెబుతున్నామని వారిద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు కదా అని వైద్యులు అదనపు కలెక్టర్ పూర్ణచంద్రను ప్రశ్నించారు. అదనపు కలెక్టర్ వారికి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర చేసేది ఏమీ లేక అసహనంతో తిరిగి వెళ్ళిపోయారు. అయితే రోగులు మాత్రం వైద్యులే ఇలా చేస్తే నా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సామాన్య ప్రజలు మాత్రం వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ చెప్పిన వినకుంటే ఎవరు చెప్తే వింటారు? కలెక్టర్ మాటలంటే పట్టింపు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సదుపాయం కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించాలని చెప్పడం, మెనూ చాట్ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించడం, అందుకు తగ్గట్టు అధికారుల నియమించి తనిఖీలు చేయాలని అనడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా ప్రథమ పౌరుడైన కలెక్టర్ ఆదేశాలనే వైద్యులు, వైద్య సిబ్బంది దిక్కరిస్తున్నారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనీ మండిపడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మార్పు రావాలని, వైద్యులు తమ తీరును మార్చుకోవాలని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్ టాయిలెట్స్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన సేవలపై మాత్రమే జిల్లా అధికారుల పర్యవేక్షణ చేసి సమాచారం ఇచ్చేందుకు ఇలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకానీ వైద్యులు, ప్రొఫెసర్ల, పనితీరు తీరుపై ఎలాంటి నియంత్రణ అధికారాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఓపి, స్పెషలైజేషన్ వార్డులకు సంబంధించి వైద్యుల హాజరు రిజిస్టర్ పరిశీలన మాత్రమే చేయాలని ఉత్తర్వులు పేర్కొన్నారు.
ఆదేశాలు వెనక్కి తీసుకోవాల్సిందే..
ప్రభుత్వ ఆసుపత్రి పై పర్యవేక్షణ కోసం జారీ చేసిన జీఓ ను వెనక్కి తీసుకోవాల్సిందే. అప్పటివరకు నిరసన కొనసాగిస్తాం. అని వైద్యులు పేర్కొంటున్నారు. ఇక జిజిహెచ్ సూపరింటెన్డెంట్ నిత్యనంద్ విషయంపై మాట్లాడుతూ ..గురువారం సాయంత్రం కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కాగా వర్షం రావడంతో ఆ సమావేశం శుక్రవారం కి వాయిదా పడింది. అప్పటివరకు వైద్యులు నిరసన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసనలో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీని మినహాయించారని, వారికి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.
వైద్యుల తీరు పై సర్వత్ర విమర్శలు..
జిల్లా కలెక్టర్ ఆదేశాలపై వైద్యులు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారో అర్థం కాని ప్రశ్న. దీనిపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులను అనవసరంగా ఇబ్బంది పెడితే వారు ఆందోళన చేపట్టడంలో అర్థం ఉంది. కానీ జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలన అధికారిగా వారిపై పర్యవేక్షణ చేస్తే వైద్యులకు వచ్చిన అభ్యంతరం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరు ఎందుకు ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారనీ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్యం అందటం లేదనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విధులకు సక్రమంగా హాజరు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేస్తూ చేస్తున్నారు. దీంతో వైద్యం కోసం ఎంతో ఆశతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు సరైన వైద్యం అందడం లేదనేది బహిరంగ రహస్యం. ఇలాంటి లోటుపాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ మంచి ఆశయంతో తీసుకున్న నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకించడం పట్ల జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదేరకమైన ఉద్యోగులు కలెక్టర్ తీసుకున్న ఏ నిర్ణయం అయినా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే పాలన ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి.
అందుకే ధిక్కరణ..
ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా ఏళ్లుగా వైద్యులు పాతుకుపోవడంతో ఎవరి ఆదేశాలను లెక్కచేయడం లేదు. కలెక్టర్ ఆశించిన మేరకు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలంటే ఎన్నో ఏళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నాటుకుపోయిన వైద్య సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం ఒకటే మార్గమని పలువురు పేర్కొంటున్నారు. బదిలీ చేయటం వల్ల తమకు నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. కలెక్టర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కలెక్టర్ ఆ నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటారా? లేక వైద్యుల ఒత్తిడి లకు తలోగి నిర్ణయాన్ని ఉపాసహరించుకుంటారా అనేది వేచి చూడాలి.