చైనా పెట్టుబడులపై ఆంక్షల కొనసాగింపు

– మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడి
న్యూఢిల్లీ : చైనా నుంచే వచ్చే విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు కొనసాగుతాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. చైనా పెట్టుబడులను ప్రోత్సహించే ఆలోచన లేదని మంగళవారం ఆయన పార్లమెంట్‌లో తెలిపారు. చైనా పెట్టుబడులను స్వాగతించడం ద్వారా తయారీ, ఎగుమతులకు మద్దతు లభించనుందని బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో తెలిపారు. దీనిపై పీయూస్‌ గోయల్‌ తాజాగా మాట్లాడుతూ.. ఆర్థిక సర్వే తన కొత్త ఆలోచనలను, సొంత అభిప్రాయాలను ప్రస్తావిస్తుందని పేర్కొన్నారు. దానికి ప్రభుత్వం కట్టుబడాలనేది ఏమీ లేదన్నారు. చైనా నుంచి ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడం ద్వారా దేశీయంగా తయారీని పెంచవచ్చని, తద్వారా ఇక్కడి నుంచి విదేశాలకు వస్తువులను ఎగుమతి చేయొచ్చని ఆర్థిక సర్వేలో మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌ వంటి దేశాలు చైనాకు భారత్‌ ప్రత్యామ్నాయమని భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని పొందొచ్చన్నారు. చైనా పెట్టుబడులను ఆహ్వానించి ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయడం మెరుగైన ఆలోచనగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. 2020లో గల్వాన్‌ లోయలో చోటు చేసుకున్న ఉద్రికత్తత అనంతరం చైనా పెట్టుబడులపై భారత్‌ తీవ్ర ఆంక్షలు విధించింది. భారత్‌లోని సుమారు 200 చైనా యాప్‌లను నిషేధించింది. పొరుగు దేశాల ఎఫ్‌డీఐలకు కేంద్రం అనుమతిని తప్పనిసరి చేసింది. దీంతో అనేక పెట్టుబడులు వెనక్కి పోయాయి.