బీరుట్‌ శివార్లలో, దక్షిణ, ఉత్తర లెబనాన్‌లో కొనసాగుతున్న ఆర్మీ దాడులు

Continued army offensives in southern northern Lebanon on the outskirts of Beirut– సెంట్రల్‌ గాజాను ఖాళీ చేయాలని ఆదేశాలు
– అక్కడి దాడుల్లో 9మంది మృతి
బీరుట్‌, గాజా : లెబనాన్‌ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో ఇజ్రాయిల్‌ బలగాలతో తమ ఫైటర్లు పోరు సల్పుతున్నారని హిజ్బుల్లా శనివారం తెలిపింది. లెబనాన్‌ సరిహద్దుకు 45కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రాంత నగరమైన హైఫాకు సమీపంలో గల ఇజ్రాయిల్‌ వైమానిక స్థావరంపై శనివారం మధ్యాహ్నం ఫాది-1 రాకెట్లతో దాడి జరిపినట్లు హిజ్బుబ్లా వెల్లడించింది. కాగా ఒక మసీదులో హిజ్బుల్లా తీవ్రవాదులను బందీగా చేసినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ వెల్లడించింది. బీరుట్‌ శివార్లలో, ఉత్తర ప్రాంతంలో లక్ష్యాలపై 12సార్లు ఇజ్రాయిల్‌ విరుచుకుపడింది.
మొట్టమొదటిసారిగా ఉత్తర లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్ధ శిబిరంపై దాడి చేసింది. ఉత్తర ప్రాంతంలో మారుమూల నగరమైన ట్రిపోలికి సమీపంలో బెడవి శరణార్ధ శిబిరంపై దాడి చేసి హమాస్‌ మిలటరీ అధికారి కుటుంబాన్ని మట్టుబెట్టారు. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేశామని మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. క్షిపణులను, లాంచ్‌పాడ్‌లను, వాచ్‌టవర్లను, ఆయుధ నిల్వల కేంద్రాలను విధ్వంసం చేశామని వెల్లడించింది. ఇజ్రాయిల్‌ సరిహద్దు వద్దకు వచ్చేందుకు హిజ్బుల్లా ఉపయోగించే సొరంగాన్ని కూడా పూర్తిగా కూలగొట్టినట్లు తెలిపింది.
గాజా దాడుల్లో 9మంది మృతి
సెంట్రల్‌ గాజా, ఉత్తర గాజా ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 9మంది మరణించారని పాలస్తీనా మెడికల్‌ అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు పిల్లలు వున్నారు. ఉత్తర ప్రాంత పట్టణమైన బీట్‌ హనూన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు చిన్నారులతోసహా ఐదుగురు మరణించగా, నుస్రత్‌ శరణార్ధ శిబిరంలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో మరో నలుగురు మరణించారు.
సెంట్రల్‌ గాజాను ఖాళీ చేయాలి మరోసారి ఇజ్రాయిల్‌ ఆర్మీ ఆదేశాలు
సెంట్రల్‌ గాజాను వీడి వెళ్ళాల్సిందిగా అక్కడి ప్రజలకు ఇజ్రాయిల్‌ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఏరియాలో హమాస్‌ ఫైటర్లపై మరింత పెద్ద ఎత్తున దాడులకు దిగడానికి సన్నద్ధమవుతున్నామని వెల్లడించింది. ఇటీవలి వారాల్లో ప్రధానంగా లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్న ఆర్మీ, ఒక్కసారిగా ఇలా గాజాలో ప్రజలకు హెచ్చరికలు చేసింది. తాము దాడి చేసే ప్రాంతాల మ్యాప్‌లను కూడా ఆ హెచ్చరికలతో జత చేసింది. దీంతో సెంట్రల్‌ గాజాలోని నెత్‌జరీమ్‌ కారిడార్‌కు సమీపంలో నివసించే పాలస్తీనియన్లు అక్కడ నుండి తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి దాడి చేసి ఇతర ప్రాంతాలకు మిలటరీ వెళ్ళిపోయినా మళ్లీ వెనక్కి వచ్చి మరోసారి దాడులకు దిగుతోంది. ఇలా ఇప్పటికి ఏడాది కాలంగా బీభత్సంగా దాడులకు దిగుతుండడంతో గాజాలో ప్రధాన ప్రాంతాలన్నీ ధ్వంసమై పోయాయి. దాదాపు 24లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 41,825మంది మరణించారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలే వున్నారు.
ఎక్కడివారక్కడే వుండండి
దక్షిణ లెబనాన్‌లో శాంతి పరిరక్షకులు ఎక్కడి వారక్కడే వుండాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకుని పోయి భూతల దాడులకు ఉధృతంగా దిగుతున్నందున ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా ఇజ్రాయిల్‌ గత నెల 30న ఆదేశించిందని, కానీ తాము ఇక్కడే వున్నామని లెబనాన్‌లో ఐక్యరాజ్య సమితి తాత్కాలిక బలగాలు (యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌) తెలిపాయి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే అందుకు కూడా పూర్తి సన్నద్ధంగా వున్నామని తెలిపింది.
గత నెల 23 నుండి లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలపై ఉధృతంగా దాడులు జరుపుతూ ఇప్పటికి 1400మందికి పైగా హతమార్చింది. దీంతో వందలు వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఇప్పటివరకు 12లక్షలమంది నిర్వాసితులైనట్లు అంచనా. రెండు వారాల్లో దాదాపు 3,75వేల మంది లెబనాన్‌ నుండి సిరియాలోకి పారిపోయారు.