కొనసాగుతోన్న రైతు ఆందోళన

కొనసాగుతోన్న రైతు ఆందోళన
Patiala: Farmers during their ‘Delhi Chalo’ march, near the Punjab-Haryana Shambhu border, in Patiala district, Saturday, Feb. 25, 2024. (PTI Photo) (PTI02_25_2024_000090B)

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. రైతుల పండించిన అన్ని పంటలకు సి2 ప్లస్‌ 50 శాతంతో కూడిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం చేయాలని, రైతు రుణమాఫీ చేయాలని, రైతులకు బీమా, పెన్షన్‌ సదుపాయం కల్పించాలని, విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే. ఆదివారం హర్యానా-పంజాబ్‌ సరిహద్దులు శంభు, ఖానౌరీ ప్రాంతాల్లో రైతుల ఆందోళనల్లో భారీ సంఖ్యలో రైతులు, వివిధ వర్గాల ప్రజలు చేరారు. అందులోనూ మహిళలు ఎక్కువ మంది ఆందోళనలో భాగమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన ఐదో రౌండ్‌ చర్చలకు తేదీ ఇంకా ఖరారు కాలేదు. దీంతో రైతులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో యువ రైతు మరణం నేపథ్యంలో 29 వరకు సరిహద్దుల్లోనే రైతులు తమ ఆందోళన కొనసాగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మరోవైపు కాల్పులు జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో ఆ యువ రైతు పోస్టుమార్టానికి రైతు సంఘాలు, కుటుంబ సభ్యులు అనుమతించలేదు. అలాగే హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌, బల్క్‌ మెసేజ్‌ లు, వాయిస్‌ కాల్స్‌ను పునరుద్ధరించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులైన సింఘూ, టిక్రీల వద్ద పోలీసులు బారికేడ్లు పాక్షికంగా తొలగించారు. రాకపోకలకు అనుమతించారు.