వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని సీజిఆర్ఎఫ్ 1 చైర్మన్ ఎన్ వి వేణుగోపాల చారి అన్నారు. శుక్రవారం మండలంలోని మైలారం సబ్ స్టేషన్ ప్రాంగణంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక సమావేశానికి వివిధ గ్రామాల నుంచి రైతులు హాజరై సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కరంట్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, మీటర్ సమస్య, ఎక్కువ బిల్లులు, ట్రాన్స్‌ఫార్మర్లలో ఓవర్‌లోడ్‌తో దగ్ధమవడం, బిల్లుల పేరులో మార్పు, స్తంభాల మార్పు, లూజ్‌లైన్లు వంటి సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందికి తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించకుంటే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎంతటి అధికారి అయినా ఫోరం ముందు సమానమేనన్నారు. విద్యుత్ మీటరు, కేటగిరీలో మార్పు, ఓవర్‌లోడ్ సమస్యలపై అధికారులు స్పందించకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు . ఈ కార్యక్రమంలో సీజిఆర్ఎఫ్ 1 టెక్నికల్ మెంబర్ కె రమేష్, సీజిఆర్ఎఫ్ 1 ఫైనాన్స్ మెంబర్ చరణ్ దాస్, సీజిఆర్ఎఫ్ 1 ఇండిపెండెంట్ నెంబర్ రామారావు, డిఈ భిక్షపతి, ఏఈలు తరుణ్, రవళి, సబ్ ఇంజనీరింగ్ ముజాఫర్, సిబ్బంది పాల్గొన్నారు.