మేడారంలో నిరంతర విద్యుత్ వెలుగులు

– విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు
– విధుల్లో 100 మంది ఇంజనీర్లు, 530 మంది సిబ్బంది
– నార్త్‌జోన్‌ ఎన్పీడీసీఎల్‌ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి
నవతెలంగాణ- తాడ్వాయి:  ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరుగు మేడారం మహాజాతరలో నిరంత విద్యుత్‌ అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలంగాణ స్టేట్ నార్తర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్( టీఎస్ ఎన్పీడీసీఎల్) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్( సి అండ్ ఎండి) కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మేడారంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు ఆయనకు స్వాగ తం పలికి గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, బెల్లం, సారె, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎండోమెంట్ అధికారులు, పూజారులు శాలువాలు కప్పి సన్మానించి అమ్మవారి ప్రసాదం అందించారు. అనంతరం జాతర పరిసరాల్లో చేపట్టే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, జంపనవాగు, చిలకలగుట్ట, తదితర మేడారం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతర పరిసరాల్లో 210 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 11కేవీ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విధుల్లో 100 మంది ఇంజినీర్లు, 530 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు.
మేడారం, కొత్తూరు సబ్‌ స్టేషన్లలో గతంలో 2ఏఎమ్‌ కెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవని వాటి స్థానంలో 8ఏఎమ్‌ కెపాసిటీ ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్‌ తెలుసుకునేలా జాతరలో వినియోగిస్తున్నామన్నారు. దీని వల్ల అంతరాయం కలుగకుం డా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారన్నారు. గతంలో కమలాపురం, ములుగులో ఉన్న 133కేవీ సబ్‌స్టేషన్ల ద్వారా విద్యుత్‌ను మేడారం జాతర కు వినియోగించేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా గోవిందరావుపేట మండలం పస్రాలో 133కేవీ కొత్త సబ్‌స్టేషన్‌ ద్వారా విద్యుత్ సప్లై అందుతున్నట్లు తెలిపారు. మేడారం మహా జాతరకు మిగతా శాఖల కంటే ఇప్పటికే మేడారం లో 80% పనులు పూర్తయినట్లు తెలిపారు.
గత జాతరలో కంటే ఈసారి 2024 మహాజాతరకు అంతరాయంగా మెరుగైన విద్యుత్ను సరఫరా అందిస్తున్నట్లు తెలిపారు. ప్లేన్‌ ఏరియాలో పనులు కొనసాగుతాయని, వరి పంటలు కోతలు పూర్తి కాగానే పూర్తిస్థాయిలో పనులు పూర్తవుతున్నట్లు స్పష్టం చేశారు. మహాజాతర సందర్భంగా సుమారు కోటీ యాబై లక్షల రూపాయల విద్యుత్‌ వినియోగం జరుగనుందని, పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆయనవెంట నార్త్ జూన్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) మోహన్ రెడ్డి, సీజీఎం మోహన్ రావు, ఎస్‌ఈ మల్సూర్‌ నాయక్, డీఈ పులుసం నాగేశ్వర్ రావు, ఏడీ వేణుగోపాల్, ఏడీఈ లు ఏ స్వామి రెడ్డి, సుధాకర్, ఏఈ వేణుకుమార్‌, సబ్‌ ఇంజనీర్ జ్ఞానేశ్వర్‌, విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.