సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ‘అగ్నిపథ్’ పేరుతో మోడీ ప్రభుత్వం సైనిక నియామకాల్లో కాంట్రాక్టీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వానికి భుజం కాస్తూ, మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కారణమైన నితీష్ కుమార్ ఈ అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం గురించి పున:సమీక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల లీకేజీ వార్తలు ఇస్తున్నది. పార్లమెంట్‌లో చర్చ లేకుండా, నిపుణులతో సంప్రదించకుండా, ఏకపక్షంగా, ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు, లాక్‌డౌన్ లాగే ఈ అగ్నిపథ్ పథకం కూడా బెడిసికొట్టిందా?ఆఫీసర్ ర్యాంకుకు కింది స్థాయిలో వున్న సైనిక నియామకాల కోసం కేంద్రం 2022 జూన్ 14న ‘అగ్ని పథ్’ పథకాన్ని ప్రేవేశ పెట్టి, సెప్టెంబర్ నుండి నియామకాలు చేపట్టింది. ఈ పథకం ద్వారా నియమించబడే సైనికులను కొత్త సైనిక ర్యాంకు కింద ‘అగ్ని వీర్’లని పిలుస్తున్నారు. మెడికల్ బ్రాంచీల్లోని టెక్నికల్ కేడర్ మినహా అన్ని రంగాల్లో సైనికులు ఈ పథకం కింద సేవలకు యువత నియమితులవుతున్నారు. గతంలో సైనిక ఉద్యోగమంటే దేశభక్తితో కూడుకున్నదని, డ్యూటీలో మరణిస్తే అది వీరమరణం అవుతుందని, రిటైర్‌మెంట్ తర్వాతి జీవితానికి భరోసా వుంటుందనే నమ్మకంతో సంవత్సరానికి 75 వేల మంది యువత సైన్యంలో చేరేవారు. అలాంటి ఆలోచనలకు పూర్తిగా భిన్నమైంది ఈ ‘అగ్ని పథ్’ పథకం. అమెరికాలో అమలవుతున్న వాలంటరీ టూర్ ఆఫ్ డ్యూటీ (నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సైనిక సేవలు) అనే విధానం నుండి ఈ ‘అగ్ని పథ్’ పథకాన్ని రూపొందించారు. అమెరికాతో పాటు ఇజ్రాయిల్, నార్వే, ఉత్తర కొరియా, సింగపూర్, స్వీడన్ దేశాల్లో ఇలాంటి విధానం అమలవుతున్నది. ఈ ప్రయోగం ఆచరణలో విఫలమైందని ఈ దేశాలన్నీ గుర్తించి సవరించుకుంటున్న స్థితిలో మన దేశంలో ఈ పథకం అమలులోకి వచ్చింది. ‘అగ్ని పథ్’ పథకంలో ప్రయివేటీకరణ విధానాలు, కాషాయదళ ప్రయోజనాలు కలగలిసి వున్నందున ఈ రెండింటి నుండి మద్దతు వుంది.
సైన్యంలో ప్రయివేటీకరణ
సాయుధ దళాలను యవ్వనంగా ఉంచడం కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ప్రస్తుత సాయుధ దళాల సగటు వయసు 32 ఏళ్ళు వుందని, దాన్ని 26 ఏళ్ళకు తీసుకు రావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు కేంద్రం చెప్పింది. అందుకోసమే ‘అగ్ని పథ్’ ద్వారా 17.5 సంవత్సరాల నుండి 21 (తర్వాత దీన్ని 23 సంవత్సరాలకు పెంచారు) సంవత్సరాలలోపు వయసు వున్న యువతను సైన్యంలో నియమిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా నియమించబడిన ‘అగ్ని వీర్’లు సివిల్ వర్క్ ఫోర్స్‌గా వుంటూ దేశానికి అవసరమైన సైనిక సేవలు చేస్తారట! ఈ మాటలన్నీ వినసొంపుగా వున్నా, ఈ పథకం అసలు ఉద్దేశ్యం సైన్యంలో కాంట్రాక్టీరణ విధానాన్ని అమలు చేయడం. శాశ్వత ఉద్యోగాలకు మంగళం పాడి, ఉద్యోగ విరమణ తర్వాత ఏ రక్షణ లేకుండా వీధుల్లోకి గెంటివేసే కాంట్రాక్టీరణ విధానం1991 తర్వాత అన్ని రంగాల్లో వేగంగా అమలవుతున్నది. ప్రయివేటీకరణ బకాసురుడి ఆకలికి ఇప్పుడు సైనిక రంగం ఆహారం అవబోతున్నది. ఈ పథకం కింద నియ మించే ‘అగ్నివీర్’లకు ఆరు నెలలు శిక్షణ ఇచ్చి, నాలుగేండ్లు ఉద్యోగం ఇస్తారు. ఇలా ప్రతి ఏడాది ఎంపికయ్యే 42వేల మంది అగ్నివీర్‌లలో 25 శాతం మందికి మాత్రమే 15 సంవత్సరాల కొలువుకు అవకాశం వుంటుంది. వీరికి మాత్రమే పింఛన్, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు వుంటాయి. ఈ పథకం కింద నియమితు లైన సైనికులకు మొదటి సంవత్సరం రూ.30 వేలు, రెండవ సంవత్సరం రూ.33 వేలు, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో సంవత్సరం రూ.40 వేల వేతనం ఇస్తారు. ఈ వేతనంలో నుండి 30 శాతాన్ని కార్పస్‌ఫండ్‌కు జమచేస్తారు. కేంద్ర ప్రభుత్వం మరో 30 శాతాన్ని ఇందుకు జమ చేస్తుంది. నాలుగో సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ. 10.04 లక్షలు అవుతుంది. 75 శాతం మంది అగ్నివీర్‌లకు ఈ మొత్తాన్ని రిటైర్‌మెంట్ ప్యాకేజీగా ఇచ్చి ఇంటికి పంపుతారు. ఇలా బయటకు వచ్చిన ఈ అగ్నివీర్‌లు మహా నగరాల్లో, నగరాల్లో వుండే కార్పొరేట్ ఆఫీసుల దగ్గర, కోటీశ్వరుల బంగ్లాల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ బతకాలి. ఇప్పటికే ‘దయార్ధ హృదయులు’ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల యజమానులు, కంగనా రనౌత్ లాంటి సెలబ్రెటీలు అగ్నివీర్‌లకు అవకాశం ఇస్తామని ‘గొప్ప మనసు’తో ముందుకు వచ్చారట! ఇన్నాళ్ళుగా మనం గుండెల నిండా గాలి పీల్చుకుని అరచిన ‘జై జవాన్’ నినాదం పాతబడి రానున్న రోజుల్లో కనుమరుగు కానుందన్న మాట!ఇప్పటికే రిటైర్ అయిన లక్షలాది మాజీ సైనికోద్యోగులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాజస్థాన్‌లో 53,373 మంది మాజీ సైనికులు ఉద్యోగాల కోసం అర్జీలు పెట్టుకోగా కేవలం 1415 మందికి మాత్రమే (2.6 శాతం) ఉపాధి దొరికింది. ఉత్తరప్రదేశ్‌లో 86,192 మందికి గాను 1616 మందికి (1.8 శాతం), పంజాబ్‌లో 60,772 మందికి గాను 1150 మందికి (1.8 శాతం), బీహార్‌లో 43,845 మందికి గాను కేవలం 6 మందికి (0.01 శాతం) మాత్రమే ఉపాధి అవకాశాలు దొరికాయి. ప్రస్తుతం ప్రతి సంవత్సరం సుమారు 75,000 మంది సైనికులు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. వీరికి తోడు ప్రతి నాలుగు సంవత్సరాలకు 30 వేల మంది (అగ్ని పథ్ కింద నియమితులైన వారిలో 75 శాతం మంది) అగ్నివీర్‌లు తాత్కాలిక ఉద్యోగం నుండి బయటకు వస్తారు. వీరందరికి ఉపాధి ఎవరు కల్పిస్తారు? ఎక్కడ కల్పిస్తారు? 2022లో ఏర్పాటు చేయబడిన పార్లమెం టరీ స్టాండింగ్ కమిటీ ‘ఆన్ డిఫెన్స్ రిపోర్టు’ ప్రకారం 2025 నాటికి రక్షణ శాఖ పెన్షనర్ల సంఖ్య సుమారు 26 లక్షలు కాగా, వారి పెన్షన్ బిల్లు రూ.2.5 లక్షల కోట్లు అవుతుందని అంచనా. ఈ సంవత్సర రక్షణ బడ్జెట్ రూ.6,21,541 కోట్లు. ఇందులో రెండున్నర లక్షల కోట్లు అంటే సుమారు 40 శాతం పెన్షన్లకే ఖర్చు అవుతుందనే పేరుతో సైనికులకు పెన్షన్ అమలు చేయకుండా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడిన సైనికులు రిటైర్‌మెంట్ తర్వాత గౌరవంగా జీవించే హక్కును కాలరాయడానికే ఈ విధానాన్ని బీజేపీ తీసుకు వచ్చింది. సైన్యంలో కూడా తాత్కాలిక ఉద్యోగాలు, పెన్షన్ లేని రిటైర్‌మెంట్ విధానాలు అమలు కావడం కార్పొరేట్ కంపెనీలకు అదనపు బలం, అందుకే ఈ పథకానికి ఆ కంపెనీలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయి.
కాషాయీకరణ
రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించడం ద్వారా హిందూ రాజ్య నిర్మాణం చేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం. 1925లో స్వయం సేవక్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ప్రతి రోజు తన సభ్యులకు శాఖ ద్వారా వ్యాయామంతో మొదలుపెట్టి, కర్ర సాము, ఆయుధాల శిక్షణ వరకు సైనిక తరహాలో శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ లక్ష్యం మత విద్వేషం ప్రాతిపదికగా సాయుధ సైనిక బృందాలను తయారు చేయడం. 1938లోనే ఇందుకోసం భోంస్లా అనే ప్రాంతంలో మిలిటరీ స్కూల్ ప్రారంభించారు. అది ఇప్పటికీ నడుస్తోంది. ఇలా శిక్షణ పొందిన వారిని తమ అవసరాలకు అనుగుణంగా మత రాజకీయాలకు, మత ఘర్షణలకు వినియోగి స్తారు. జర్మనీ నియంత హిట్లర్ నుండి ఈ తరహా శిక్షణా పద్ధతులను ఆర్‌ఎస్‌ఎస్ వారసత్వంగా పొందింది. వీరు కోరుకునే పౌర సైనిక శిక్షణకు సరిగ్గా అగ్నిపథ్ పథకం తోడ్పడుతుంది. సైన్యంలో పనిచేసి వచ్చిన అగ్నివీర్‌లను తమ మతతత్వ రాజకీయాలకు వాడుకోవడం సులభం. కాబట్టే ఈ పథకాన్ని ఆర్‌ఎస్‌ఎస్ బలపరుస్తుంది.
సైన్యంలో కీలకమైన మార్పు చేసే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు దీని పర్యవసానాల గురించి నిపుణులతో కనీసం చర్చించకపోవడం సరికాదని పరమ వీరచక్ర కెప్టెన్ బాణా సింగ్ అభ్యంతరం తెలిపారు. ఈ పథకం అమలు వల్ల అనేక కష్టాలు వస్తాయని నావిక స్టాఫ్ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాష్, ఆర్మీ స్టాఫ్ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కద్యస్ లాంటి అనేక మంది మాజీ సైనిక ఉన్నతో ద్యోగులు అభిప్రాయపడ్డారు. అయినా వీటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మోడీ ప్రభుత్వం ‘అగ్ని పథ్’ పథకాన్ని అమలులోకి తెచ్చింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తీవ్ర ఎదురుదెబ్బ తగలడానికి నిరుద్యోగం కీలక కారణమైంది. సైన్యంలో ఎక్కువ భాగం నియమితులయ్యే యు.పి, హర్యానా, పంజాబ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. అందుకే నితీష్ కుమార్ అగ్నిపథ్ పథకం గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం, కరోనా లాక్‌డౌన్ ఫలితంగా చిన్న పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతబడడం, జిఎస్‌టి పన్నుల విధానం, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల పోటీకి మధ్యతరహా పరిశ్రమలు గిలగిలలాడు తుండడం, ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ తిరోగమన బాట పట్టడంతో దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తాజా నివేదిక 2015-2023 మధ్య 13 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని తయారీ రంగంలోని అసంఘటిత రంగ యూనిట్లలో పనిచేస్తున్న 54 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారనే కఠోర వాస్తవాన్ని బయటపెట్టింది. ఉన్నత చదువులు కొనలేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రతి సంవత్సరం 75 వేల మంది సైన్యంలో చేరి బతుకుతున్నారు. ఈ ‘అగ్ని పథ్’ వల్ల కేవలం 40 వేల మందికి మాత్రమే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి. సుమారు 35 వేల మంది సైనిక ఉపాధి కోల్పోతారు. ప్రస్తుతం వున్న నిరుద్యోగ సైన్యానికి వీరు అదనంగా తోడవుతారు. సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసిన ప్రయివేటీకరణ ఇప్పటికే అనేక రంగాల్లో సర్వరోగాల నిలయంగా మారింది. ఇప్పుడు సైన్యంలోకి కూడా ఈ రోగం విస్తరించింది. పౌర జీవితంలో రగిల్చే మత విద్వేషాలను మరింత పెంచి పోషించేందుకు సైనిక రంగానికి కషాయ రాజ కీయాలు విస్తరిస్తున్నాయి. సైన్యంలోకి ప్రవేశ పెట్టిన కాంట్రాక్టీకరణ, కాషాయీకరణ విధానాలను అడ్డుకోవడం దేశ పౌరులందరి కర్తవ్యం.
– రాంభూపాల్