– కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉండాలి
– ప్రభుత్వ కార్యాచరణకు తోడుగా ప్రజలు ఉద్యమిస్తేనే లక్ష్యాలు నెరవేరే అవకాశం : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, ప్రభుత్వ కార్యాచరణకు తోడుగా ప్రజలు ఉద్యమిస్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని కోరారు. సోమవారం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి సురేఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మనుషుల తప్పిదాల వల్ల ప్రాణాధారమైన గాలి, నీరు, నేల రోజు రోజుకీ విషతుల్యమై, ప్రాణాలను హరిస్తున్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1984 డిసెంబర్ రెండో తేదీన జరిగిన బోపాల్ గ్యాస్ దుర్ఘటనను గుర్తుచేశారు. ఆ ప్రమాదం మనదేశంలోనే గాక ప్రపంచలోనే ఘోర పారిశ్రామిక విపత్తుగా మిగిలిందనీ, ఆనాడు వేల మంది మరణించగా..6 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. పరిశ్రమల కాలుష్యాన్ని నివారించడంతో పాటు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా డిసెంబర్ రెండో తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ”స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి – సుస్థిరమైన జీవనం వైపు అడుగు” అనే నేపథ్యంతో ప్రజలకు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పిచే దిశగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ దినాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిఒక్కరూ పర్యావరణ అనుకూల వస్తువులను వాడటంతో పాటు, మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచాలని కోరారు.