– సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి లేఖ.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేని పేదల కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం దోహదపడుతుందనీ, దాని అమలులో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. మంగళవారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రప్రభుత్వాల సహకారంతో మార్చి 2024 నాటికి 2.95 కోట్ల పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్లామన్నారు. రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2029 మధ్య కాలంలో మరో రెండు కోట్ల పక్కా ఇండ్లను సొంతిల్లు అవసరమున్న గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, దేశంలో కనీసం 10 కోట్ల మందికి లబ్దిని చేకూర్చాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. పై రెండు విడతల తర్వాత గ్రామాల్లో సర్వే చేసి ఇంకా అవసరం ఉన్న వారికి ఇండ్లు కట్టిస్తామని హామీనిచ్చారు. ఇంకా ఇండ్లు మంజూరు కాకుండా మిగిలిపోయిన వారి జాబితాను అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాళ్, ఏపీ, కర్నాటక రాష్ట్రాలు ఇప్పటికే నివేదిక అందించాయని వివరించారు. 2018 లో కేంద్ర ప్రభుత్వం ఇండ్ల కోసం నిర్వహించిన సర్వేలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భాగం కాలేదని పేర్కొన్నారు. ఇండ్ల కోసం ఎటువంటి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇండ్లను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారని గుర్తుచేశారు. ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి, కేంద్ర ప్రభుత్వం ఇండ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలనీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రామీణ తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు.