– కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా పని చేసింది
– కేంద్రానికి ఈ విషయం ముందే తెలుసు..!
– అయినా చర్యలు శూన్యం
– బీజేపీ వాగ్దానాలు బూటకం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-వైరా
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే ఏకగ్రీవానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ఆయన స్వగ్రామం స్నానాల లక్ష్మీ పురం వచ్చిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకునేందుకు తెలంగాణ నుంచి ఆమెను పార్లమెంటుకు పోటీ చేయాలని టీపీసీసీ కోరినట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారని, బహుశ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారమే వారు మాట్లాడి ఉండవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ దోపిడీ వివరాలు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల రాజకీయ కుమ్మక్కు వల్లనే కేంద్రం ఉదాసీనంగా ఉంటుందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాగా అబద్దాలతో కాలం గడపదని స్పష్టం చేశారు. చిన్నాభిన్నమైన రాష్ట్ర పాలనను గాడిలో పెడుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి నెలలోనే 4వ తేదీ లోపు రాష్ట్ర ఉద్యోగులు జీతాలు తీసుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకంపై శ్వేత పత్రం విడుదల చేయవలసిన అవసరం తమ ప్రభుత్వానికి ఏర్పడిందని, ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశ్యమే శ్వేత పత్రం విడుదల అని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాటన్నింటినీ అమలు చేస్తామని, అందుకు 100 రోజుల వ్యవధి ఉండాలని కూడా ముందే చెప్పామని, కానీ బీఆర్‌ఎస్ నెల గడవక ముందే అవాకులు చవాకులు పేలటం వారి విజ్ఞతకు వదిలేస్తమన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు రాయల నాగేశ్వరరావు, శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణ రావు, దొడ్డా పుల్లయ్య, పగడాల మంజుల, మున్సిపల్ చైర్మెన్ ఎస్.జైపాల్ తదితరులు పాల్గొన్నారు.