వరిలో అగ్గి మరియు కాటుక తెగులు నివారణ చర్యలు.

– ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు

నవతెలంగాణ-గోవిందరావుపేట
వరి పంటలో ప్రస్తుతం అగ్గి మరియు కాటుక తెగులు ఉధృతిని అరికట్టేందుకు రైతులు నివారణ చర్యలు చేపట్టాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అన్నారు. గురువారం మండలంలోని మచ్చాపురం గ్రామంలో వరి మరియు ఫామ్ ఆయిల్ సాగు వ్యవసాయ క్షేత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ప్రాంతంలో చలి వాతావరణము ఉన్నందున వరి పంటలో అగ్గి తెగులు మరియు కాటుక తెగులు విస్తారంగా వ్యాపించే అవకాశం పుష్కలంగా ఉందని అన్నారు. ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఆకులపై మచ్చలు ఏర్పడి సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్లయితే పైరు కుంగిపోయి కోలుకోకుండా అవుతుందని దీనివల్ల రైతులు నష్టపోతారని అన్నారు. అగ్గి తెగులు నివారణకు ఎకరానికి ఐసో ప్రోతిలిన్ అనే మందును ఎకరానికి 300 మిల్లీలీటర్లు లేదా కాసు గా మైసిన్ అనే మందును ఎకరానికి 500 మిల్లీలీటర్లు చొప్పున పిచికారి చేసినట్లయితే ఈ తెగుల్లను సమర్థవంతంగా నివారించవచ్చని అన్నారు. అదేవిధంగా కాటుక తెగులు ను కూడా సకాలంలో గుర్తించి నివారించుకోవాలని లేనియెడల గింజ మచ్చ ఏర్పడి నాణ్యత తగ్గి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఈ తెగులు నివారణకు స్పైరోమైసిన్ 200 యం. యల్ తోపాటు ప్రొఫికోనజోల్  200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసినట్లయితే ఈతకులను సమర్ధవంతంగా నివారించవచ్చని అన్నారు. ప్రస్తుత దశలో పామ్ ఆయిల్ సాగులో పెంకు పురుగు (రైనోసారస్) ఆశించి ముగిస్తానంలో రంద్రం చేసి పంట నష్టం కలిగిస్తోందని అన్నారు. పెంకు పురుగు నివారణకు గాను రైతులు ఎకరానికి ఒకటి చొప్పున లింగాకర్షణ బుట్టలను అమర్చి  పురుగును నివారించుకోవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ యు నాగేశ్వరరావు, డాక్టర్ కే శ్రావణ్ కుమార్, డాక్టర్ వై ప్రశాంత్, డాక్టర్ జి పద్మజ తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి గోపాల్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.