నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈ వానాకాలం ధాన్యం సేకరణ పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ బాగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన వానకాలం ధాన్యం సేకరణ కు సంబంధించి సమాచారం, ఫిర్యాదుల స్వీకరణకు ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. ఈ వానాకాలం ధాన్యం కొనుగోలు లో ఏవైనా సమస్యలు తలెత్తిన రైతులు లేదా ఇతరులు ఈ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన, 24 గంటలు పని చేసే ఫోన్ నెంబర్ 9963407064 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలకు పని చేసే విధంగా రెండు విడతలలో విధులు నిర్వహించేలా సిబ్బందిని నియమించడం జరిగిందని, ఈ కంట్రోల్ రూమ్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన సిబ్బంది పని చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడిన, లేదా ఎక్కడైనా ధాన్యం కొనుగోలు జరగకపోయినా వెంటనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి తెలియజేయవచ్చని, సంబంధిత అధికారులతో ఆ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.అదేవిధంగా రాష్ట్రస్థాయిలో సైతం ధాన్యం సేకరణ,కొనుగోలు కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1 9 6 7 లేదా 180042500333 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.