ప్రజల్ని ఒప్పించి తీసుకోండి..లాక్కోకండి

– లగచర్లలో రైతులు, గ్రామస్తులపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం : డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఫార్మా కంపెనీకి ప్రజల నుంచి భూములు తీసుకోవాలనుకుంటే వారిని ఒప్పించాలి తప్ప ఒత్తిడితో లాక్కోవాలని చూస్తే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో రైతులపైనా, గ్రామస్తులపైనా అక్రమ కేసులను, అరెస్టులను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తనపై దాడి జరగలేదని కలెక్టర్‌ బహిరంగంగా ప్రకటించినప్పటికీ గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ చేసి, నిర్బంధం విధించి 50 మందిపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. చౌటుప్పల్‌ దగ్గర దివిస్‌ కంపెనీ నుంచి మొదలు రాష్ట్రంలో చాలా కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదనీ, పైగా, ఆ ప్రాంతాల్లో గాలి, భూగర్భజలాలు కలుషితమై అక్కడ రైతులు పంటలు పండించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. రేవంత్‌రెడ్డి తన బావమరిది సృజన్‌రెడ్డి పార్టనర్‌షిప్‌లో ఫార్మా కంపెనీ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికల నిమిత్తం కాంగ్రెస్‌ పార్టీకి డబ్బులు పంపేందుకు కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.