మండుటేసవిలో చల్లచల్లగా

మండుటేసవిలో చల్లచల్లగా– పలుచోట్ల వర్షపాతం నమోదు
– 42 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు
– వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాలకు వర్షసూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రతిసారీ మే నెలలో ఎండలు మండిపోతుంటాయి. కానీ, ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మండుటేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటున్నది. సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షం పడుతున్నది. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 :00 గంటల వరకు రాష్ట్రంలో 55 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మెదక్‌ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో అత్యధికంగా 5.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 19 జిల్లాల్లో అక్కడక్కడా వర్షం పడింది. వచ్చే మూడ్రోజులు పలు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. ఆ జాబితాలో మెదక్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌, జనగాం, ఖమ్మం, నారాయణపేట, మంచిర్యాల, సంగారెడ్డి, హైదరాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలున్నాయి. వచ్చే 48 గంటల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చు. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. రాష్ట్రంలో బుధవారం ఒకటెండ్రు చోట్ల మాత్రమే 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లోపే రికార్డయ్యాయి.