చల్లబడ్డ వాతావరణం

– వచ్చే ఐద్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
– 25కుపైగా జిల్లాల్లో 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మూడు రోజుల కిందటి వరకు భగభగ మండిపోయిన భానుడు కాస్త విరామమిచ్చాడు. ఆగేయ రాజస్థాన్‌లో కేంద్రీకృతమైన ఉపరితల ద్రోణి మధ్య మహారాష్ట్ర, దక్షిణ కొంకణ్‌ మీదుగా కోస్తా కర్నాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముంది. ఒకటెండ్రు చోట్ల వడగండ్లు పడే సూచనలు కూడా ఉన్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఆ జాబితాలో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్‌ జిల్లాలున్నాయి. హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల్లోనూ వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో ఆగేయ దిశగా గాలులువీచే అవకాశముంది. వాతావరణం చల్లబడటంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. 25కుపైగా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లోపే నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపట్నంలో అత్యధికంగా 41.2 డిగ్రీలు, మాడ్గులపల్లి(నల్లగొండ) 41.1 డిగ్రీలు, కన్నాయిపల్లి(వనపర్తి)41.1 డిగ్రీలు, మేడారం (ములుగు)41.0 డిగ్రీలు, కొత్తపల్లిగోరి(జయశంకర్‌ భూపాలపల్లి) 41.0 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వర్షం కురిసింది.