సహకరించండి

Cooperate–  వర్ధమాన దేశాలకు నిధులు అందాలి..సాంకేతికత బదిలీ కావాలి : సంపన్న దేశాలకు మోడీ పిలుపు
దుబాయ్ : వర్ధమాన దేశాలకు సాంకేతిక బదిలీ జరగాలని, వాతావరణ విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను అందించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ సంపన్న దేశాలకు పిలుపిచ్చారు. వాతావరణ సమస్యలను సృష్టించడంలో వర్ధమాన దేశాల పాత్ర వుండడం లేదని, అయినా కూడా వారు సమస్య పరిష్కారంలో భాగస్వాములవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించాల్సి వుందన్నారు. సమానత్వం, వాతావరణ న్యాయం, పరస్పరం పంచుకునే బాధ్యతలు, సామర్ధ్యాల ప్రాతిపదికన వాతావరణ కార్యాచరణ వుండాలని తాను విశ్వసిస్తానని చెప్పారు. ఈ సూత్రాలకు కట్టుబడి వుండడం ద్వారా సుస్థిరమైన భవిష్యత్‌ దిశగా ఒక బాటను ఏర్పాటు చేయగలమని, ఆ క్రమంలో ఎవరూ వెనుకబడి పోరని అన్నారు. ఈ క్రమంలో పేద, వర్ధమాన దేశాల అభివృద్ధి ప్రాధాన్యతలపై దుబాయ్ లో జరుగుతున్న కాప్‌ 28 సదస్సుకు హాజరైన మోడీ అక్కడి పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాతావరణ మార్పులనేది సమిష్టిగా ఎదుర్కొనాల్సిన సవాలని తానెప్పుడూ చెబుతానని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్య ప్రతిస్పందన ఒక్కటే దీనికి పరిష్కారమని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై చేపట్టే కార్యాచరణ గురించి పెరుగుతున్న ఆశలను వాతావరణ నిధులపై పురోగతిలో చూడాల్సి వుందని ఆయన పేర్కొన్నారు. సమర్ధవంతమైన, సమిష్టి వాతావరణ కార్యాచరణకు ఈ సదస్సు తాజా ఊపునివ్వగలదని భారత్‌ ఆశాభావంతో వుందని అన్నారు. అలాగే యుఎన్‌ఎఫ్‌సిసిసి, పారిస్‌ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో అంతర్జాతీయ సహకారం కూడా పెరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత పచ్చదనంతో కూడిన, అలాగే సంక్షేమం సమృద్ధిగా వుండగల భవితవ్యం కోసం భారత్‌, యుఎఇలు భాగస్వాములుగా కృషి చేస్తాయన్నారు. వాతావరణ కార్యాచరణపై అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రభావితం చేసేందుకు సంయుక్తంగా కృషి చేయడానికి కట్టుబడి వున్నామన్నారు.
భారత్‌-యుఇఎ సంబంధాలపై మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ఇప్పటికే మంచి పటిష్టమైన సంబంధాలు వున్నాయన్నారు. ఇంధన భద్రతను మరింత పెంచుకునేందుకు ఉమ్మడి గ్రిడ్‌ను ఏర్పాటు చేయడంలో చేతులు కలపనున్నట్లు చెప్పారు. గ్లోబల్‌ సోలార్‌ ఫెసిలిటీకి మద్దతునిస్తామని చెప్పారు.
తదుపరి కాప్‌ సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ?
2028లో జరగబోయే కాప్‌ 33 వాతావరణ సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇస్తుందని ప్రధాని మోడీ శుక్రవారం ప్రతిపాదించారు. ప్రజల ప్రాతినిధ్యం ద్వారా కార్బన్‌ సింక్‌లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టే గ్రీన్‌ క్రెడిట్‌ ఇనీషియేటివ్‌ను ప్రారంభించారు. అభివృద్ధికి, పర్యావరణ సంరక్షణకు మధ్య సంతులనాన్ని పాటిస్తూ భారత్‌, ప్రపంచ దేశాలకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని చెప్పారు.
2030 జూన్‌ కల్లా కాలుష్యాల తీవ్రతను 45శాతం తగ్గించాలని, శిలాజయేతర ఇంథనాల వాటాను 50శాతానికి పెంచాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వర్ధమాన, పేద దేశాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపన్న దేశాలు బదిలీ చేయాలని ఆయన కోరారు.