
నవతెలంగాణ – ముత్తారం: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని మంథని సిఐ రాజు గౌడ్ కోరారు. ముత్తారం మండలం కాసర్లగడ్డ వద్ద ప్రజలతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. అక్రమ దందాలు ఎవరైనా కొనసాగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని సూచించారు. యువత చెడు మార్గంలో కాకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో దొంగతనాల నివారణకు సిసి కెమరాలనుఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమ, నిబంధనలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు తదితరులున్నారు.