ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి

-అడిషనల్ డీసీపీ నర్సింహ రెడ్డి
-పలు గ్రామాలలో పోలీసు బలగాల కవాతు
నవతెలంగాణ-ఆమనగల్
రాబోయే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అందరు సహకరించాలని అడిషనల్ డీసీపీ నర్సింహ రెడ్డి అన్నారు. ఈనెల 30 న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మండలంలోని శెట్టిపల్లి, ఆకుతోటపల్లి, చింతలపల్లి, మంగళపల్లి తదితర గ్రామాలలో సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ బాల్ రామ్ నేతృత్వంలో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కవాతు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ నర్సింహ రెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జర్గుటకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగ ప్రవర్తించిన, పోలీసుల విధులకు ఆటంక పరిచినా అట్టి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు రౌడీ షీట్స్ తెరవడం, బైండోవర్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కునేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.