సభను సమన్వయం చేయండి

Cm Revanth Reddy– అసెంబ్లీ కుటుంబానికి మీరే పెద్దదిక్కు
– సమాజ రుగ్మతలను పారదోలే దిశగా చర్చలకు అవకాశమివ్వండి
– చెన్నారెడ్డిలా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎదగాలి
– స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు : సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నిజాం కాలంలో వైద్యానికి చాలా ప్రసిద్ధి పొందిన ప్రాంతం. అనేక రుగ్మతలతో బాధపడేవారు వికారాబాద్‌ గుట్టల్లో ఉండి వ్యాధులను నయం చేసుకునేవారు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన ప్రసాద్‌ సమాజ రుగ్మతలను పారదోలే దిశగా సభలో చర్చలు జరిగేలా చూస్తారని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం శాసనసభలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక అనంతరం ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. స్పీకర్‌కు అభినంద నలు తెలిపారు. ఆయన స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ప్రత్యక్షంగా సహకరించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ, ఎంఐఎం పార్టీల నేతలకు, పరోక్షంగా మద్దతు తెలిపిన బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. సభను సాంప్రదాయకంగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంప్రదాయం మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రసాద్‌ తన చిన్నతనం నుంచే ఉమ్మడి కుటుంబ బాధ్యతలను విజయవంతంగా సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. శాసనసభ అనేది స్పీకర్‌కు కుటుంబం లాంటిదనీ, పలుపార్టీల సభ్యులున్న సభను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన ప్రసాద్‌ కుమార్‌ సమన్వయం చేసుకుంటూ సమర్ధవంతంగా నడిపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సభలో సభ్యులందరి హక్కులను ఆయన కాపాడుతారనే పూర్తి విశ్వాసం తనకుందన్నారు. ఎంపీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, స్పీకర్‌ స్థాయికి ప్రసాద్‌ ఎదిగిన తీరును వివరించారు. వికారాబాద్‌ను శాటిలైట్‌ సిటీగా అభివృద్ధి చేయించడంలో ప్రసాద్‌ కృషి మరువలేనిదని చెప్పారు. ఆయన చొరవతోనే అక్కడకు మెడికల్‌ కాలేజీ వచ్చిందన్నారు. అప్పా జంక్షన్‌ నుంచి వికారాబాద్‌ మన్నెగూడా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణకు ఆయన చొరవ చూపిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రజల గొంతుకలకు అధిక సమయమివ్వాలి : కూనంనేని
సమయాన్ని సాంకేతికంగా కేటాయించకుండా ప్రజాసమస్యలను లేవనెత్తే గొంతుకలకు సభలో తగిన సమయం ఇవ్వాలని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు కోరారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం పవిత్ర వ్యాపకమనీ, సభ దేవాలయం లాంటిందని చెప్పారు. విడివిడి, వ్యక్తిగత ఆలోచనల్ని బయటనే వదిలేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్ధవంతమైన చర్చ జరపాలని సభ్యులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బయట నిత్యం పోరాడే కమ్యూనిస్టు పార్టీల సభ్యులు సభలో తక్కువగా ఉండటం బాధాకరమన్నారు.
సభా నిర్వహణకు సహకరిస్తాం : బలాల
స్పీకర్‌కు ఎంఐఎం సభ్యులు అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల శుభాకాంక్షలు తెలిపారు. సభను సజావుగా నడిపేందుకు ఎంఐఎం సభ్యులంతా సహకరిస్తారని హామీనిచ్చారు. సభలో అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు.
అభ్యుదయ ఆలోచనలతో ముందుకెళ్లాలి : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ప్రజా సమస్యల పరిష్కారం మీద నిత్యం చొరవ చూపే శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అభ్యుదయ ఆలోచనలతో ముందుకెళ్తారని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ యాక్టులో ప్రసాద్‌ ప్రధాన భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. సభ్యులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ సభను సజావుగా నడపాలని కోరారు. సభ్యులందరూ స్పీకర్‌కు సహకరించాలని విన్నవించారు. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రులు దనసరి అనుసూయ(సీతక్క), తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కాంగ్రెస్‌ సభ్యులు పద్మావతిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌, రాజ్‌ఠాకూర్‌, లక్ష్మణ్‌, రాంమోహన్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, మనోహర్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, కె.సత్యనారాయణ, భూపతిరెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, డాక్టర్‌ వంశీకృష్ణ, శంకర్‌, బీఆర్‌ఎస్‌ సభ్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, కాలేయాదయ్య, దానం నాగేందర్‌, కడియం శ్రీహరి తదితరులు మాట్లాడారు.