భోగి మంటల్లో ఎస్మా ప్రతులు

భోగి మంటల్లో ఎస్మా ప్రతులు– సమ్మె శిబిరాల్లో పిండివంటలతో నిరసనలు
– కొనసాగిన కోటి సంతకాల సేకరణ
– ఏపీలో 34వ రోజూ అంగన్‌వాడీల సమ్మె
– పోరాటానికి ఏపీ యూటీఎఫ్‌ సంఘీభావ నిధి
విజయవాడ : వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా విధించి సంజాయిషీ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె శిబిరాల్లో భోగి మంటలు వేసి ఆ ప్రతులను దహనం చేశారు. పిండివంటలు చేసి తమ నిరసనను కొనసాగించారు. అలాగే కోటి సంతకాల కార్యక్రమాన్ని కొనసాగించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐదుసార్లు అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులను చర్చలకు పిలిచి పాతపాటే పాడారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటానికి ఏపీ యూటీఎఫ్‌ నాయకులు సంఘీభావ నిధిని అందించారు.
గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట భోగి మంటలు వేసి ఎస్మా జిఒ-2 ప్రతులను దహనం చేశారు. తాడికొండ, తుళ్లూరు శిబిరాలను ఐద్వా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి సందర్శించి మాట్లాడారు. ఎస్మా జిఒలను భోగిమంటల్లో వేశారు. రమాదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇస్తున్న నోటీసులు తాటాకు చప్పుళ్లతో సమానమని, వాటికి బెదిరిపోవడం లేదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయడం చేతగాని రాష్ట్ర ప్రభుత్వం ఆ నెపాన్ని అంగన్‌వాడీలపై వేస్తోందని మండిపడ్డారు. డిమాండ్లను అంగీకరించకుంటే నిరవధిక దీక్షలకూ వెనకాడబోరని హెచ్చరించారు. చేబ్రోలులో సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ నాయకులు సందర్శించి పోరాట సంఘీభావ నిధికి రూ.మూడు వేలు అందించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సమ్మె శిబిరం వద్ద కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అంగన్‌వాడీలకు మద్దతుగా కరపత్రాలను ముద్రించి కౌలు రైతు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు.
విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఖాళీ గిన్నెలు, కంచాలతో మోత మోగిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖ, అల్లూరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం, మండపేట, ముమ్మిడివరం, మామిడికుదురు, కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడతోపాటు, పెద్దాపురం, జగ్గంపేట రూరల్‌, కిర్లంపూడి, కరప మండలాల్లోని సమ్మె శిబిరాల వద్ద భోగి మంటలు వేసి ఎస్మా ప్రతులను దగ్ధం చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో హరిదాసు వేషధారణతో నిరసన తెలిపారు.
కర్నూలు ధర్నా చౌక్‌లో నోటికి రిబ్బన్లు కట్టుకుని నిరసన దీక్షలు చేపట్టారు. నంద్యాలలో ముఖ్యమంత్రి, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల చిత్రపటాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వ్యాప్తంగా ఎస్మా ప్రతులను భోగి మంటల్లో వేశారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం, నగరి, కార్వేటినగరం, పలమనేరు, శాంతిపురం, బైరెడ్డిపల్లిలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నోటీసులను దహనం చేసి నిరసన తెలిపారు. తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పుత్తూరులో మట్టి తింటూ నిరసన తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే దీక్షల్లో నగర పరిధిలోని కార్యకర్తలు, హెల్పర్స్‌ కూర్చున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బోగి మంటల్లో ఎస్మా ప్రతులను వేసి దగ్ధం చేశారు. పొందూరు, కోటబొమ్మాళిలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు.