కరెంటే ఆధారం…

– దేశంలో సాగునీటి వనరుల్లో మూడొంతులకు విద్యుత్‌ వినియోగం
– మైనర్‌ ఇరిగేషన్‌ సెన్సస్‌ తాజా నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో నీటిపారుదల వనరుల్లో నాలుగింట మూడొంతులకు విద్యుతే ఆధారం. విద్యుత్‌పై ఆధారపడిన సాగునీటి వనరులపై రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ సెన్సస్‌ (ఎంఐసి) తాజా ఎడిషన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. రైతులు, ఇతర ప్రయివేట్‌ యాజమాన్యం వినియోగించే బోర్‌వెల్‌లు, ట్యూబ్‌వెల్‌లు విద్యుత్‌పై ఆధారపడుతున్నాయని నివేదిక తెలిపింది. నీటిని వెలికి తీయడానికి డీజిల్‌, గాలి మరలు, సోలార్‌ కంటే విద్యుత్‌పై ఎక్కువ ఆధారపడుతున్నారని చెప్పింది. తాజాగా విడుదల చేసిన 6వ ఎడిషన్‌ ఎంఐసి నివేదిక ప్రస్తుత ఏడాది గణాంకాలకు సంబంధించినది కాదు. 2017-18లో నీటి పారుదల పరిస్థితులను తాజా నివేదిక ప్రతిబింబిస్తుంది. 2017లో విడుదల చేసిన ఐదో ఎడిషన్‌ ఎంఐసి నివేదిక 2013-14 పరిస్థితులు ప్రతిబింబిస్తుంది. బ్లాక్‌ స్థాయి నుంచి సమాచారం సేకరించాల్సి రావడం, సమాచారాన్ని కంపైల్‌ చేయడానికి, పబ్లిక్‌ చేయడానికి కొన్ని సంవత్సరాల వ్యవధి పడుతుంది కాబట్టి నివేదికలు ఆలస్యమవుతుంటాయి. సాగునీటి వనరుల్లో విద్యుత్‌ వినియోగం 2011లో 56 శాతం ఉండగా, గతవారం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2017 నాటికి ఈ వినియోగం 76 శాతానికి పెరిగింది. భూగర్భ జలాలను వెలికితీయడానికి బోర్‌వెల్‌లు, ట్యూబ్‌వెల్‌లును ఉపయోగిస్తారు. విద్యుత్‌ వినియోగం పెరుగుదలకు అనుగుణంగానే ట్యూబ్‌ వెల్‌లు, బోర్‌వెల్‌లు సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. బోర్‌వెల్‌లు, ట్యూబ్‌వెల్‌ల కంటే ఎక్కువ లోతు నుంచి (సుమారు 15 మీటర్ల కంటే ఎక్కువ) నీటిని తోడే డగ్‌ వెల్స్‌ సంఖ్య తగ్గింది. 2011లో 87 లక్షలుగా ఉన్న వీటి సంఖ్య, 2017కు 82 లక్షలకు తగ్గింది. 35 మీటర్ల నుంచి కూడా నీటిని వెలికితీసే షలో ట్యూబ్‌వెల్స్‌ సంఖ్య కూడా 59 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గింది.
పెరిగిన బావుల సంఖ్య
అయితే నీటిని తోడుకునే బావుల సంఖ్య పెరిగింది. 70 మీటర్ల లోపు గల బావుల సంఖ్య 31 లక్షల నుంచి 43 లక్షలకు పెరిగింది. 70 మీటర్ల కంటే ఎక్కువ లోతు గల బావుల సంఖ్య 26 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగింది. భూగర్భ జలాలను తోడుకోవడం ఎక్కువకావడం ఆందోళన కలిగించే అంశమే అయినా.. ఈ ట్యూబ్‌వెల్‌లు, బోర్‌వెల్‌లు సంఖ్య పెరగడానికి గల కారణాలును ఈ నివేదిక వెల్లడించలేదు. వీటి సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉంటాయని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక ఆధికారి తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే పథకాలు, బావులను కొనుగోలు చేయడానికి రుణాల లభ్యత.. వంటి అంశాలు వీటిపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఈ నివేదిక ప్రకారం దేశంలోని 695 జిల్లాల్లోని 6,47,394 గ్రామాల నుంచి 23.14 మిలియన్ల మైనర్‌ ఇరిగేషన్‌ పథకాలు ఉన్నాయి. వీటిలో పథకాల్లో 21.93 మిలియన్లు (94.8 శాతం) భూగర్భ జలాల వెలికితీతకు, 1.21 మిలియన్లు (5.2 శాతం) ఉపరితల-నీటి వెలికితీతకు ఉద్దేశించబడినవి. దేశంలో అత్యధిక సంఖ్యలో మైనర్‌ ఇరిగేషన్‌ పథకాలను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ (17.2 శాతం). తర్వాత మహారాష్ట్ర (15.4 శాతం), మధ్యప్రదేశ్‌ (9.9శాతం), తమిళనాడు (9.1శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5.1 శాతం పథకాలు అమల్లో ఉన్నాయి. భూగర్భజలాల వెలికితీసే పథకాల్లో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉండగా, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్‌ ఉపరితల నీటి వెలికితీత పథకాల్లో ముందున్నాయి. ఐదో, ఆరవ ఎడిషన్ల మధ్య ఈ పథకాల సంఖ్య సుమారు 1.42 మిలియన్లు పెరిగింది. ఎక్కువ పథకాలు (96.6%) ప్రయివేట్‌ యాజమాన్యం లేదా రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి చిన్న సన్నకారు రైతులు నిర్వహిస్తున్నారు.