నడవాలి కదా
నడక ఆగేదాక అన్నట్లు
పొద్దు గూకే వేళలో
అపారమైన అనుభవ పాదాలు
పార్కులను వెతుక్కుంటూ వస్తాయి!
బుడి బుడి అడుగులతో
అనేక పాదాలు ఒక మూల సమావేశమవుతాయి
వన్నె తరగని ముచ్చట్లను విప్పుతాయి
మణికొండ మహాత్మ గాంధీ పార్కులో
ఏ తారతమ్యం లేని తరమొకటి రోజు
ఆ మూలలో జ్ఞాపకాలను ఆరబోసుకుంటది!
మసక మసక వెలుతుర్లో
అందరి కళ్లు గోళీ కాయల్లా మెరుస్తుంటాయి!
ఆ పాదలను చూడలంటే నాకు భయమేస్తది
మట్టిని చీల్చుకుని ఎదిగిన
మొక్కల్లాంటి పాదాలు
ధైర్యం కూడదీసుకుని నడిచొచ్చినట్లుంటాయి
తిండి తిప్పలకు కొదవ లేదు కాని
పూట గడవడమే అగ్ని పరీక్ష
రెండు గుడ్డి దీపాలు విశాలమైన ఇల్లంతా
వెలుతురు పంచలేని తండ్లాట
పిల్లలు సప్త సముద్రాల ఆవల
రాజ్యమేలుతున్నారనే భ్రమ బతకనిస్తున్నట్లుంటది!
అనుభవించిన హౌదాలు అనుభవాలు
కాసేపు మారిన కాల పరిస్థితులు రాజకీయాలు
దేశం ఏమైపోతుందోనన్న
అమాయకపు దిగులు..
పొద్దు గూకంగానే ఇంటి దీపాలు గుర్తొస్తాయి
సమూహాలన్నీ చేతులూపుకుంటూ
తలో వైపు రేపు కలుద్దామన్నట్లు
జేబులో మందుల చీటీని
తడుముకుంటూకదలిపోతాయి
నిత్యం గమనిస్తున్న ఆ పార్కూ నేనూ
రేపటి సాయంత్రం కోసం
ఆ అనుభవ పాదాల దర్శనం కోసం
ఎదురు చూస్తూనే ఉంటాం!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261