దేశంలోని పౌరులందరికీ 2047 నాటికి ఇన్సూరెన్స్ అందించడమే లక్ష్యమని మాస్టర్ సర్కులర్ (12 జూన్ 2024) విడుదల సందర్భంగా ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఐ.ఆర్.డి.ఎ.ఐ) చెప్పింది. కానీ ఈ సర్క్యులర్‌లో పేర్కొన్న అంశాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. లాభనష్టాల దృష్టితో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా (ఎల్.ఐ.సి)ని చూడకూడదు, దేశంలోని మారుమూల ప్రజలకు కూడా బీమా సౌకర్యం కల్పించాలి, ప్రజల డబ్బు ప్రజలకే చెందాలి, ఇన్సూరెన్స్ అంటే దీర్ఘకాలిక పెట్టుబడి, ప్రజాసంక్షేమం ప్రధానం అనే ప్రధాన ఉద్దేశాలతో 1956లో ఎల్.ఐ.సి ఏర్పాటైంది..
ఐ.ఆర్.డి.ఎ.ఐ ఏర్పాటు నేపథ్యం
భారతదేశంలో 1991లో ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలను ఆసరా చేసుకొని ఇన్సూరెన్స్ మార్కెట్‌లో ఉన్న లాభాలను సొంతం చేసుకోవడానికి ప్రయివేట్ వ్యాపారస్తులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీని ఫలితంగానే కేంద్రం 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డి.ఎ.ఐ) ఏర్పాటు చేసింది. అంతకు ముందే టెలికం రంగంలో సంస్కరణల కోసం టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టి.అర్.ఎ.ఐ) 1997లో ఏర్పాటయింది.
ఇవి నిజంగా స్వతంత్ర సంస్థలేనా?
ఇవి పేరుకు మాత్రమే స్వతంత్ర సంస్థలు. ఆచరణలో మాత్రం కేంద్ర ప్రభుత్వ కీలుబమ్మలు. ట్రారు అమల్లోకి వచ్చిన తర్వాత టెలికం రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న ప్రభుత్వ రంగ బి.ఎస్.ఎన్.ఎల్‌ను నాశనం చేసి ఆ స్థానాన్ని అంబానీ కంపెనీ అయిన జియో ఎలా ఆక్రమించిందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఐ.ఆర్.డి.ఎ.ఐ పెత్తనం కొనసాగితే అంతిమంగా ఎల్.ఐ.సి పరిస్థితి కూడా బి.ఎస్.ఎన్.ఎల్ మాదిరిగానే మారిపోతుంది. ఐ.ఆర్.డి.ఎ.ఐ మాస్టర్ సర్క్యులర్‌తో ఎల్.ఐ.సిలో ముఖ్యంగా వచ్చిన పలు మార్పుల గురించి తెలుసుకోవాల్సి వుంది. ప్రాచుర్యం పొందిన అన్ని పాలసీల కనీస బీమా రూ.ఒక లక్ష నుండి రూ.రెండు లక్షలకు పెంచారు. అదేవిధంగా ప్రీమియం రూ. ఒక లక్షకు రూ.300 నుండి రూ.500 వరకు పెరిగింది.
సరెండర్ విలువ పెంపు, గడువు తగ్గింపు
ఇది ఎల్.ఐ.సి ఏర్పాటు సందర్భంగా పెట్టుకున్న ప్రాథమిక నియమంగా వున్న ‘దీర్ఘకాలిక పెట్టుబడి’ అనే సూత్రానికి పూర్తిగా విఘాతం కలిగించేది. ఇప్పటి వరకు ఎల్.ఐ.సిలో పాలసీ తీసుకున్న వారు తమ డబ్బును దీర్ఘకాలం పాటు ఎల్.ఐ.సి లో కొనసాగించేందుకు మానసికంగా సిద్ధపడి పాలసీ తీసుకునేవారు. ఒకవేళ ఏదైనా అత్యవసరమైతే లోన్ తీసుకునే వారు తప్ప సరెండర్ చేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఐ.ఆర్.డి.ఎ.ఐ నిబంధనను అనుసరించి ఏడాది తర్వాత పాలసీ రద్దు చేసుకున్నా కూడా కట్టిన డబ్బులో ఎక్కువ మొత్తం పాలసీదారుడికి చెల్లించాలన్న నిబంధన ఎల్.ఐ.సి సంస్థను స్థిరమైన అభివృద్ధి నుండి ఒడిదుడుకుల వైపు నెడుతుంది.
ఏజెంట్లపై ప్రత్యక్ష దాడి
ఫస్ట్ ప్రీమియం కమిషన్ తగ్గుతుంది. 35 నుండి 28 శాతానికి తగ్గించారు. రెన్యువల్ కమీషన్‌లో ఐదు శాతం పెంచారు. సరెండర్ విలువ పెంచి ఒక సంవత్సరం తర్వాత సరెండర్‌కు అవకాశం ఇచ్చి నాలుగైదు సంవత్సరాలలో కమీషన్ పెంచడమంటే దీన్ని ఎంతమంది పొందగలరు. మరో రెండు శాతం కమీషన్ ఆరవ సంవత్సరం ప్రీమియం చెల్లించిన తర్వాత ఇస్తామం టున్నారు. ఇది కూడా రూ.5 లక్షల సమ్ అస్యూర్డ్ ఆ పైన పాలసీలకి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఆలోపు పాలసీలకు రెండు శాతం కమీషన్ వుండదని అర్థం.
ఏజెంట్ల మెడపై కత్తి
క్లా బ్యాక్ ఆఫ్ కమీషన్ అనేది విదేశాలలో ఇప్పటికే అమలులో ఉంది. ఇన్సూరెన్స్ రంగంలో ‘క్లా బ్యాక్ ఆఫ్ కమీషన్’ అంటే ‘బీమా ఏజెంట్ లేదా బ్రోకర్ ఒక పాలసీపై వారు సంపాదించిన కమీషన్‌లో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని బీమా కంపెనీకి తిరిగి చెల్లించాలి”. ఇందువల్లనే ఐ.ఆర్.డి.ఎ.ఐ దీని గురించి ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. కానీ సెంట్రల్ ఆఫీస్ మార్కెటింగ్ విభాగపు సూచనల మేరకు చర్యలు వుంటాయని మాత్రమే పేర్కొంది. ఇది ఏజెంట్లను మోసగించటమే.
ఎల్.ఐ.సి పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి కారణం?
1991 నుండి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల ప్రధాన లక్ష్యం ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడం. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రయివేటీకరణ దశ దాటి కార్పొరేటీకరణ స్థాయికి చేరింది. ఫలితంగా అన్ని రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడమే ప్రభుత్వం పని అయినట్లుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ వచ్చాయి.
పంచభూతాలతో సహా రైల్వే, విమాన, పోర్టులు, బొగ్గు, స్టీల్ అన్నింటినీ కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు. అందులో భాగంగానే ఐ.ఆర్.డి.ఎ.ఐ ని శిఖండిలా అడ్డుపెట్టుకొని ఎల్.ఐ.సి ని నాశనం చేసి ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలకు ఎల్.ఐ.సి ని, బీమా మార్కెట్ మొత్తాన్ని కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వెనుక వుండి కథ నడిపిస్తున్నది.
ప్రభుత్వ దూకుడుకు అడ్డుకట్ట వేయలేమా!
ఈ ప్రభుత్వ ఉద్దేశపూర్వక కుట్రను ఎదుర్కోవాలంటే ఏజెంట్లు, ఉద్యోగులు పాలసీదారుల సహకారంతో ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా ఉద్యమాలు చేపట్టాలి. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధానిలో రైతులు చేసిన పోరాటం, ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గత 1400 రోజుల నుండి అక్కడి కార్మికులు చేస్తున్న పోరాటంలా ఎల్.ఐ.సి ఏజెంట్లు కూడా పట్టుదలతో పోరాటం చేయాలి. అప్పుడు మాత్రమే ఎల్.ఐ.సిని కాపాడుకోగలం. అందుకు ఎల్.ఐ.సి ఏజెంట్లు అందరూ సన్నద్ధం కావాల్సిన అవసరమున్నది.
బి.వెంకట్రావు