కార్పొరేట్‌ వైద్యానికి ‘చికిత్స’ అవసరం!

Corporate Medicine Needs 'Treatment'!మన దేశంలో వైద్యున్ని దేవునితో సమానంగా కొలుస్తారు. ఎందుకంటే వారికెన్ని బాధలున్నా సరే రోగులను జబ్బుల నుంచి రక్షిస్తారు. కరోనా సమయంలో వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడారు. కొంత మంది వైద్యులు ఈ క్రతువులో అశువులు బాసారు కూడా. అందుకే వైద్యో నారాయణ హరి అని అంటారు. ఇలాంటి వైద్యులతో బాటుగా వారిని కన్న తల్లిదండ్రులకు, వారికి సంస్కారవంతమైన విద్యనందించిన గురువులకు పాదాభివం దనాలు. కానీ కొంతమంది వైద్యులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. వీరివలన మొత్తం వైద్య వ్యవస్థే కళంకిత పాలవుతుంది.
ఎప్పుడైతే వైద్యరంగం కార్పోరేట్‌ అయిందో అప్పటి నుండి వైద్యం ఖరీదుగా మారింది. అవసరమున్నా లేకపోయినా వ్యాధి నిర్ధారణా పరీక్షల పేరిట రోగుల నుండి డబ్బులను దండుకుంటున్నారు. ల్యాబ్‌ మొదలు మెడికల్‌ స్టోర్‌ వరకూ కమీషన్లకు కక్కుర్తిపడి జలగల్లా రక్తాన్ని పీల్చేస్తున్నారు. అధిక కమీషన్‌ల కోసం వారికి నచ్చిన ల్యాబ్‌లలో అవసరమైన వాటికంటే ఎక్కువ పరీక్షలను చేయిస్తున్నారు. చౌకైన, నాణ్య మైన మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ఫార్మా కంపెనీలు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి వాళ్ళ క్లినిక్లో మాత్రమే విక్రయించే ఖరీదైన మందులను సూచిస్తున్నారు. డిశ్చార్జ్‌ కావడానికి తగిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌ పేరిట ఇన్‌ పేషంట్‌గా ఉంచుతున్నారు. అవసరం లేనప్పటికీ అర్జంట్‌ ఆపరేషన్‌నని భయపెట్టి శస్త్ర చికిత్సలు చేసి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని గుండె జబ్బుల చికిత్సలో అవసరం లేకపోయినా కూడా అధిక ధరకు స్టెంట్‌ని వేస్తున్నారు. ఒక్కోసారి ఇది మరణానికి దారితీయొచ్చు కూడా. ప్రయివేట్‌ ఆసుపత్రులలోని కొంత మంది గైనకాలజిస్టులు గర్భిణులకు సాధారణ ప్రసవానికి అవకాశం ఇవ్వడం లేదు. సిజేరియన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు రానివారు భారీగా క్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేసే ప్రయివేటు మెడికల్‌ కాలేజీలలో వైద్యవిద్యను చదువు ‘కొని’ పెట్టుబడులను తిరిగి పొందేందుకు అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో చాలామంది వైద్యులు రోగులకు సేవ చేస్తున్నారు. కానీ కొంతమంది అధిక జీతం తీసుకుంటూ నాణ్యమైన సేవలందజేయడం లేదనే విమర్శలూ లేకపోలేదు. పైగా వ్యక్తిగత ఆసుపత్రులను నిర్వహిస్తూ డబ్బు సంపాదన మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
డిసెంబర్‌ 2022 నాటికి దేశంలో డాక్టర్‌ జనాభా నిష్పత్తి 1:834గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నిష్పత్తి 1:1000 కంటే మెరుగ్గా ఉంది. ప్రభుత్వాలు ఆరోగ్యరంగానికి బడ్జెట్‌ను పెంచాలనే డిమాండ్‌ కూడా ప్రజల నుంచి వస్తున్నది. అయినప్పటికీ 2024-25 మధ్యంతర కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించింది. అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్య సేవలందడం లేదు. ఎందుకంటే, నిధుల కేటాయింపులకంటే పర్యవేక్షణ కూడా ముఖ్యం. కొంతమంది డాక్టర్లు ఇష్టారీతినా వ్యవహరిం చడం మూలాన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మానవాభివృద్ధి సూచిక 2023-24 నివేదిక ప్రకారం మనదేశం 193 దేశాలలో 134వ స్థానంలో ఉంది. అంటే వైద్యరంగం అంత మెరుగుదలగా లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వాలు వాటి పరిధిలో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి బాగానే కృషి చేస్తున్నట్టు చెబుతున్నా కొంత మంది వైద్యుల తీరు మారడం లేదు. ప్రభుత్వ వైద్యులు ప్రయివేటుగా వైద్యం చేయడాన్ని నిషేధించాలి. ల్యాబ్‌ల్లో ప్రభుత్వమే ఏ పరీక్షకు ఎంత వసూలు చేయాలో నిర్ణయించాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు వైద్య చీటీలపై మందు పేరును మాత్రమే రాయాలని నిబంధన ఉంది. కానీ ఎవరూ పాటించడం లేదు. అలాగే ప్రయివేటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మందుల దుకాణంలో కూడా జనరిక్‌ మందులు విక్రయించే ఏర్పాటు చేయాలి. ముందుగా దీనిపై ప్రభుత్వాలు దృష్టిపెడితే రోగులకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది.
– డి.జె.మోహనరావు, 8247045230