– అంతా ప్రయివేటు పరం
– దేశాన్నే వేలం వేస్తున్న మోడీ ప్రభుత్వం
– అనేక రెట్లు పెరిగిన అదానీ, అంబానీ ఆస్తులు
– కార్పొరేట్ కంపెనీలకే రుణమాఫీలు, పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ హయాంలో బడా కార్పొరేట్ సంస్థలు దేశాన్ని నిలువునా దోచేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్ వం ఆ సంస్థలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తూ, రాయితీలు కల్పిస్తూ, రుణాలు మాఫీ చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతోంది. మోడీ ప్రాపకం కలిగిన అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలు ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరిపోయారు. దేశంలో కార్పొరేట్ సంస్థల సామ్రాజ్యం విస్తరిస్తుండడంతో వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలైపోయాయి. పోటీని తట్టుకోలేక దుకాణాలు బంద్ చేశాయి.
మోడీ పాలనలో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. అదే సమయంలో పెట్టుబడిదారుల ఆదాయం, ఆస్తులు, సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దేశంలో అత్యంత సంపన్నులైన వారి సంఖ్య 56 నుంచి ఏకంగా 169కి పెరిగింది. మోడీ సన్నిహితులైన అంబానీ, అదానీలు దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి రెండు స్థానాలలో చేరిపోయాయి. 2013లో అదానీ ఆస్తుల విలువ రూ.25,792 కోట్లు. 2022 నాటికి అది రూ.7,48,800 కోట్లకు చేరింది. అలాగే 2014లో అంబానీ ఆస్తుల విలువ రూ.1,54,742 కోట్లు. 2022 నాటికి ఆ విలువ రూ.7,54,620 కోట్లకు చేరుకుంది. అంటే దీనర్థం ఆస్తుల విలువ ఈ కాలంలో ఐదు రెట్లు పెరిగిందన్న మాట.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో కార్పొరేట్ల ఒప్పందం
కార్పొరేట్ కంపెనీలు మోడీ ప్రభుత్వాన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. అందుకే వాటి ఆస్తుల విలువ అనేక రెట్లు పెరిగింది. వాజ్‌పేయి, అద్వానీలను ప్రధాని మోడీ పక్కన పెట్టి, తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న సమయంలోనే అంబానీ పెట్టుబడులు పెరగడం ప్రారంభమైంది. కార్పొరేట్ కంపెనీలు, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం నెరపిన వారిలో అదానీ ఒకరు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేట్ కంపెనీలకు అపరిమితమైన, ఆంక్షలు లేని స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే ఆ కంపెనీలు ఆయనకు బాసటగా నిలిచాయి. జాతి మీద, దాని వనరుల మీద ఆధిపత్యం చెలాయించాలంటే కంపెనీలకు ముందుగా ప్రభుత్వంపై పెత్తనం అవసరం. మోడీని ప్రధానిని చేస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్దతు ఇస్తామని అవి హామీ ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అపరిమిత అధికారాన్ని చెలాయించడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు కార్పొరేట్ కంపెనీల సాయం అవసరమైంది. ఆ దిశగా ఓ ఒప్పందం కుదిరింది. ఈ అవకాశవాద ఒప్పందానికి మోడీ ప్రభుత్వం ఓ శాఖగా మారింది.
ఆస్తులు పెంచుకున్న అదానీ, అంబానీ
మోడీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం చేతిలో ఉన్న సర్కారు ఆస్తులన్నింటినీ ప్రయివేటీకరించారు. వాటిని నామమాత్రపు ధరకు ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టారు. లాభాలు ఆర్జిస్తున్న హెచ్‌పీసీఎల్, నార్త్ ఈస్ట్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, కామరాజర్ పోర్ట్, ఎయిర్ ఇండియా తదితర వందలాది కంపెనీలను ప్రయివేటీకరణ పేరిట ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. ప్రభుత్వ రంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ను నాశనం చేసి అంబానీకి చెందిన జియో ఫోన్ కంపెనీకి అవాంఛనీయమైన ప్రయోజనాలు కల్పించారు. చివరికి విమానాశ్రయాలు, రైల్వేలు, రైల్వే లైన్లను సైతం ప్రయివేటీకరించి అమ్మేశారు. ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగించడానికి, కొందరు కార్పొరేట్ దిగ్గజాలకు లాభాలు ఆర్జించి పెట్టడానికి మోడీ సర్కారు ఇలాంటి చర్యలకు పూనుకుంది తప్ప మరోటి కాదు.
అమ్మకాలు… ప్రతిఫలంగా ముడుపులు
జాతీయ రహదారులను అభివృద్ధి చేశానని మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే ఇందులో వాస్తవమేమిటి? ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26,700 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల అభివృద్ధి పనులను అదానీ, అంబానీలకు కట్టబెట్టారు. మోడీ హయాంలో 400 రైల్వే స్టేషన్లు, కొంకణ్ రైల్వేలో 741 కిలోమీటర్ల పనులు, 265 రైల్వే గూడ్స్ షెడ్లు, 90 ప్యాసింజర్ రైళ్లు, 25 ప్రధాన విమానాశ్రయాలతో పాటు ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, గ్యాస్ పైప్‌లైన్ అథారిటీ వంటి సంస్థల ఆస్తులు, ఓడరేవులు, ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో 39%, 160 రాతి క్వారీలు, గనులు, 2.86 లక్షల ఓఎఫ్‌సీ కేబుల్స్…ఇవన్నీ ప్రయివేటీకరించి ప్రయివేటు సంస్థలు లేదా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారు. ప్రతిఫలంగా ఎన్నికల బాండ్ల రూపంలో ముడుపులు దండుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశాన్నే వేలం వేసేశారు.
అటవీ భూములనూ వదలలేదు
పేదలకు లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాల్సిన మెడీ సర్కారు దానిని కార్పొరేట్ కంపెనీలకు కేటాయించింది. అభివృద్ధి పేరిట లక్షలాది ఎకరాల భూమిని బలవంతంగా ప్రజల నుంచి సేకరించి ఆ కంపెనీలకు అప్పగించింది. అడవులనే నమ్ముకొని జీవిస్తున్న గిరిపుత్రులను అక్కడే ఖైదీలుగా మార్చేసింది. అటవీ చట్టాలను సవరించి, వారి నివాస ప్రాంతాల చుట్టూ ఫెన్సింగ్ వేసి దిగ్బంధం చేసింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని, పరిశోధనలు చేపడతామని, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తామని చెప్పి గిరిజనులను ఆయా ప్రాంతాల నుంచి తరిమేసి, కంపెనీలకు అటవీ భూములను ధారాదత్తం చేసింది ఈ మోడీ ప్రభుత్వం.
బడ్జెట్‌నే మించిన పన్ను మాఫీలు, మినహాయింపులు
గత పది సంవత్సరాల కాలంలో పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్సును పెంచడం, జీఎస్టీ విధించడం వంటి చర్యల కారణంగా ప్రజలపై భారం ఎక్కువైంది. అదే సమయంలో కొందరు కోటీశ్వరులకు 55 లక్షల కోట్ల రూపాయల విలువైన పన్ను మినహాయింపులు లభించాయి. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలపై పన్నులను 33% నుండి 25%కి తగ్గించింది. పాత కంపెనీలు కొత్త పేర్లతో వేర్వేరు రంగాలకు విస్తరించాయి. నూతన కంపెనీలను ప్రోత్సహించే పేరుతో ప్రభుత్వం వీటిపై పన్నును 15%కి తగ్గించింది. ప్రపంచంలో ఏ కంపెనీ ఇంత తక్కువ పన్నులు చెల్లిస్తున్న దాఖలాలు లేవు. గత పది సంవత్సరాల్లో కార్పొరేట్ కంపెనీల కోసం రద్దు చేసిన పన్నులు, ఇచ్చిన మినహాయింపులు దేశ వార్షిక బడ్జెట్‌నే మించిపోయాయి. అంటే మోడీ ప్రభుత్వం ఈ కంపెనీలకు ఓ స్వర్గధామంగా మారింది. అదే సమయంలో సామాన్యులకు నరకం చూపిస్తోంది.
ఇది కార్పొరేట్ల ప్రభుత్వమే
మోడీకి అదానీ బినామీ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాష్ట్ర శాసనసభలోనే చెప్పారు. అదానీకి ఉన్నదంతా వాస్తవానికి మోడీదేనని తెలిపారు. అపారమైన ప్రభుత్వ సంపదను అదానీ కంపెనీకి ఎలా బదిలీ చేసింది, విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా అదానీ కంపెనీకి అన్ని ప్రయోజనాలు అందించాలంటూ మోడీపై ఎలా ఒత్తిడి తెస్తున్నదీ ఆయన వివరించారు. మోడీది కార్పొరేట్ల యొక్క, కార్పొరేట్ల చేత, కార్పొరేట్ల కొరకు నడపబడుతున్న ప్రభుత్వం అన్న కఠోర వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజల సంపదను దోచుకునేందుకు, రైతులను అణచివేసేందుకు, కార్మిక శక్తిని పిండుకునేందుకు, పోటీకి అవకాశమే లేకుండా అన్ని రంగాల్లో వ్యాపారంపై గుత్తాధిపత్యం చెలాయించేందుకు ఈ ప్రభుత్వం వ్యాపార కార్పొరేషన్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం మధ్య సంబంధం ఉంది. ఈ ప్రభుత్వం సంపన్నులైన గుజరాత్ మార్వాడీలది.
ఇప్పటికైనా కండ్లు తెరవండి. మేము ఇద్దరం… మాతో ఇద్దరు. ఇద్దరు సంపన్నులైన మార్వాడీలు మరో ఇద్దరితో కలిసి దేశంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. వారి ఖజానాలను నింపుకుంటున్నారు. ఈ గొప్ప విలన్లు, ద్రోహులు, వారి తాబేదార్ల వలలో పడి దేశం విలవిలలాడుతోంది.
కార్పొరేట్ కంపెనీలకూ రుణమాఫీలు
చాలా మంది ఏమనుకుంటారంటే సంపన్నులు తమ వద్ద ఉన్న ధనాన్ని బ్యాంకుల్లో దాచుకుంటారని, ఆ డబ్బును అవి పేదలకు రుణంగా ఇస్తాయని. వాస్తవానికి బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసేది సాధారణ ప్రజలే. ఇందులో చాలా వరకూ సొమ్మును కంపెనీలకు రుణంగా ఇస్తున్నారు. అయితే ఈ కంపెనీలు రుణాలు చెల్లించకుండా ఎగవేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. రుణాలు తిరిగి చెల్లించని కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బదులు ప్రభుత్వం రూ.30 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసేసింది.
వహ్వా… ఏమి చెబితిరి!
‘నేను ఫకీరును. రైల్వే ప్లాట్‌ఫారాలపై టీ అమ్మాను’… ఇది ప్రధాని తరచుగా చెప్పే మాట. ప్రతి వ్యక్తికీ సంతృప్తికరమైన జీవనాన్ని అందించడమే తన ఏకైక లక్ష్యమని ఆయన చెబుతుంటారు. ‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ అనేది ఆయన నినాదం.