కార్పొరేట్లే కారణం

– పేదరికం, అసమానతలపై ఆక్స్‌ఫామ్‌ నివేదిక
– పెరుగుతున్న సంపన్నుల ఆదాయం
– కడు పేదరికంలోకి 60శాతం జనాభా
ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపునకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల మంది… అంటే జనాభాలో 60శాతం మంది మరింత పేదలుగా మారారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే 229 సంవత్సరాలు పడుతుంది. ఈ మేరకు ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ప్రచురించిన నివేదికను దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా విడుదల చేశారు. ‘ఈ అంతరాలను మేం గమనిస్తున్నాం. కోవిడ్‌, ద్రవ్యోల్బణం, యుద్ధం వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అసమానత అనేది యాధృచ్చికం కాదు. కార్పొరేట్‌ సంస్థలు అందరి ప్రయోజనాలను ఫణంగా పెట్టి మరింత సంపదను తమకు అందజేయాలని సంపన్న
వర్గం కోరుకుంటుంది’ అని ఆక్స్‌ఫామ్‌ తాత్కాలిక ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాలకు, వర్ధమాన దేశాలకు మధ్య అసమానతల వ్యత్యాసం విపరీతంగా పెరిగింది. ప్రపంచ సంపదలో 69శాతం అభివృద్ధి చెందిన దేశాల వద్దే ఉంది. అలాగే బిలియనీర్ల సంపదలో కూడా 74శాతం ఆ దేశాలదే. ఒకప్పుడు సంపద వలసవాద, సామ్రాజ్యవాద దేశాలకే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు వలసవాదం అంతరించిపోవడంతో వర్ధమాన దేశాలతో నయా వలసవాద సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ఆర్థిక అసమానతలు శాశ్వతంగా అలాగే ఉండిపోయాయి. సంపన్న దేశాలకు అనుకూలంగా ఆర్థిక నిబంధనలు రూపొందాయి. బహుళజాతి కార్పొరేట్‌ సంస్థలు సంపదను సృష్టించి, సంపన్నులకే అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం అసమానతలు తిరిగి ప్రారంభమయ్యాయి. అట్టడుగు వర్గాలు, జాతుల సమూహాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి.
కార్పొరేట్‌ శక్తుల దురాశే కారణం
కార్పొరేట్‌ సంస్థల దురాశ అసమానతలకు దారి తీస్తోంది. ప్రపంచంలోని పది అతి పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో ఏడు సంస్థల సీఈఓలు లేదా ప్రధాన వాటాదారులు బిలియనీర్లే. ఈ కంపెనీల సంపద 10.2 ట్రిలియన్ల డాలర్లు. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలోని అన్ని దేశాల సంయుక్త జీడీపీని వీరి సంపద దాటేసింది. వరల్డ్‌ బెంచ్‌మార్కింగ్‌ అలయన్స్‌ సంస్థ నుండి తీసుకున్న సమాచారాన్ని ఆక్స్‌ఫామ్‌ విశ్లేషించింది. ప్రపంచంలో అతి పెద్ద 1,600 కంపెనీల్లో కేవలం 0.4శాతం కంపెనీలు మాత్రమే తమ వద్ద పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తున్నాయని ఆ విశ్లేషణలో తేలింది. కార్పొరేట్‌ సంస్థల్లో వాటాదారులుగా ఉన్న సంపన్నులు తమ హోదా కారణంగా మరింత ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది వాటాదారులకు ప్రపంచ ఆర్థిక ఆస్తుల్లో 43% వాటాలు ఉన్నాయి. పశ్చిమాసియా, మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇది 48శాతంగా, ఆసియాలో 50శాతంగా, యూరప్‌లో 47శాతంగా ఉంది. 2022 జూలై, 2023 జూన్‌ మధ్య కాలంలో 93 బడా కార్పొరేట్‌ సంస్థలు ఆర్జించిన ప్రతి వంద డాలర్ల లాభంలోనూ 82 డాలర్లు వాటాల బైబ్యాక్‌, డివిడెంట్ల రూపంలో వాటాదారులకు వెళుతున్నాయి. 2023 జూన్‌తో ముగిసిన 12 నెలల కాలంలో ప్రపంచంలోని 148 బడా కార్పొరేట్‌ సంస్థలు 1.8 ట్రిలియన్‌ డాలర్ల లాభాలను మూటకట్టుకున్నాయి. వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ అనే సంస్థ 2022లో తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ జనాభాలో అత్యంత పేదలుగా ఉన్న 50శాతం మంది ప్రపంచ ఆదాయంలో కేవలం 8.5శాతం మాత్రమే పొందగలిగారు.
ఆ శక్తులదే గుత్తాధిపత్యం
ఆదాయంలో లింగ వ్యత్యాసం కూడా బాగా కన్పిస్తోంది. ఎలాంటి వేతనం లేకుండా ఇంటిపనికే పరిమితమైన మహిళలు ఆర్థిక వ్యవస్థకు 10.8 ట్రిలియన్‌ డాలర్ల ప్రయోజనం చేకూరుస్తున్నారు. ప్రపంచ టెక్‌ పరిశ్రమ నుండి లభిస్తున్న మొత్తంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల మద్దతు, సబ్సిడీలతో ప్రయోజనం పొందుతోంది. ప్రపంచంలో అసమానతలు పెరగడానికి గుత్తాధిపత్య కార్పొరేట్‌ శక్తులు కారణమవుతున్నాయి. ఈ శక్తులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకొని వాటిని ప్రభావితం చేస్తున్నాయి. కార్మిక చట్టాలు, విధానాలను సైతం అవే రూపొందిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ జరిపిన ఓ అధ్యయనాన్ని కూడా ఆక్స్‌ఫామ్‌ తన నివేదికలో ఉటంకించింది. అమెరికాలోని ఉత్పాదక రంగంలో కార్మికుల వాటా 76శాతం మేర పడిపోవడానికి ఈ కార్పొరేట్‌ శక్తులే కారణమవుతున్నాయి. ఈ శక్తులు కార్మికులు, చిన్న వ్యాపారులను అణచివేస్తున్నాయి. ఉదాహరణకు 1995-2015 మధ్యకాలంలో 60 ఔషధ తయారీ కంపెనీలు పది బడా ఫార్మా సంస్థల్లో విలీనం అయ్యాయి. 1975-2019 మధ్య అనేక సంస్థలు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినప్పటికీ కార్పొరేట్‌ పన్ను రేటు 23% నుండి 17%కి తగ్గింది.
చాలీచాలని ఆదాయంతో…
ప్రపంచంలో మెజారిటీ ప్రజలు సురక్షితం కాని, అనిశ్చిత పరిస్థితుల్లో గంటల తరబడి పనిచేస్తున్నప్పటికీ చాలీచాలని వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా 79.1 కోట్ల మంది కార్మికులు మెరుగైన వేతనాలు పొందలేకపోయారు. గత రెండు సంవత్సరాల కాలంలో వారు 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇది ప్రతి కార్మికుడికి ఇరవై ఐదు రోజుల వేతనానికి సమానమని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. ధనికుల సంపద, కార్మికుల వేతనాల మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతోంది. ఆరోగ్య, సామాజిక రంగాల్లో పనిచేస్తున్న ఓ మహిళా కార్మికురాలు 1,200 సంవత్సరాల్లో సంపాదించే మొత్తాన్ని ఓ ఫార్ట్యూన్‌ 100 కంపెనీ సీఈఓ కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలోనే సంపాదిస్తాడు.