
ప్రభుత్వం ఎస్సి 57 ఉపకులాలను మాదిగలతో ఏర్పరిచిన కార్పోరేషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప కులాల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయల లక్ష్మీ నర్సయ్య,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాణాల రాజారామ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సి 57 ఉప కులాలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ఎలక్షన్ కు ముందు ఎస్సీలకు మూడు కార్పొరేషన్స్,ఒకటి మాదిగలకు ,రెండు మాల మూడు, ఎస్సి57 ఉపకులాలకు,ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 22 లక్షల జనాభా గలిగిన మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయక ఎస్సీ మాదిగలతో జత చేయడం హేయమైన చర్యన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ 57 కులాలను ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, గుర్తించకపోవడంతో విద్య, ఉద్యోగ, ఉపాధి పథకాల కందక, కులవృత్తులను నమ్ముకొని సంచార జీవులుగా జీవిస్తున్న తమ కులాలు అన్ని రంగాల్లో, ఆర్థిక, సాంఘిక, సామాజిక పరంగా వెనుకబడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఎస్సీ 57ఉప కులాలను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పట్టించుకోని ఉప కులాలను ఎస్సీ కార్పొరేషన్ చేయని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇండ్లు, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తూ, ధర్నాలు,ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీ ఉపకులాల సత్తా ఏమిటో చూపిస్తామని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో దక్కలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఔషదం రవిందర్ గోసంగి, ఉపాధ్యక్షుడు సోరుపాక సంతోష్ గోసంగి పాల్గొన్నారు.