సరైన ప్రతిఘటన

Correct resistanceరాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను తుంగలో తొక్కి, ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతూ..అణగారిన వర్గాలకు అన్యాయం చేసే..ఆరెస్సెస్‌-బీజేపీ పరివార్‌ అంబులపొదిలోని మరో దుర్మార్గమే లేటరల్‌ ఎంట్రీ విధానం. ఖాళీగా ఉన్న సివిల్‌ సర్వీస్‌ పోస్టులను భర్తీ చేయడానికి తగిన ప్రణాళికలను రూపొందించడం మాని లేటరల్‌ ఎంట్రీ పేరుతో ఆరెస్సెస్‌ పరివారంతో, కార్పొరేట్‌ అత్యాశాపరులతో నింపే ఎత్తుగడ ప్రమాదకరం. లేటరల్‌ ఎంట్రీ పేరుతో రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుండటంతో ‘ఇండియా’ వేదికలోని ప్రతిపక్ష పార్టీలతోపాటు అందులో లేని పార్టీలు..చివరికి అధికార ఎన్డీయే కూటమిలోని లోక్‌ జనశక్తి (ఎల్‌జెపి) తదితర పార్టీలు ఈ విధానం ఆమోదయోగ్యం కాదని అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దిక్కుతోచక తోకముడి చింది. నియామకాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలు లేవని, వాటిని సమీక్షించి, సంస్కరించాల్సిన అవసరము న్నందు వల్లే ప్రస్తుత ప్రకటనను రద్దు చేస్తున్నామని చెప్పడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. దీనిపై మోడీ-2 ప్రభుత్వ హయాంలోనే విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. లోక్‌సభలో సొంత మెజార్టీ వుండడంతో విమర్శలను, అభ్యంతరాలను బేఖాతరు చేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. అదీగాక, త్వరలో జమ్ముకాశ్మీర్‌, హర్యానా, ఆ తరువాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నందున కాషాయదళం వెనకడుగు వేయక తప్పలేదు. పరిపాలనా వ్యవస్థలో వినాశకరమైన ఈ లేటరల్‌ ఎంట్రీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. అంతవరకు ప్రతిపక్షాలు, ప్రజలు ఉద్యమాన్ని కొనసాగించాలి.
యుపిఎస్‌సి పరీక్ష ద్వారా ఐఏఎస్‌లను నియమిస్తారు. అలాకాకుండా సంబంధిత విభాగాల్లో నైపుణ్యం, అనుభవం ఆధారంగా బయటి వ్యక్తులతో ఆ పోస్టులను భర్తీ చేయడాన్ని లేటరల్‌ ఎంట్రీ అనేది సర్కారు నిర్వచనం. 24 కేంద్ర మంత్రిత్వ శాఖలలోని జాయింట్‌ సెక్రటరీ, డైరెక్టర్‌, డిప్యూటీ సెక్రటరీ వంటి 45 పోస్టులను లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేసే ప్రక్రియ మూడు రోజుల క్రితం ప్రారంభించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో రెండో పరిపాలనా సంస్కరణల సంఘం (ఎఆర్‌సి), ఆరోవేతన సంఘం (2013) చేసిన సిఫార్సులకు అనుగుణంగా లేటరల్‌ ఎంట్రీ విధానం ప్రకారం పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మోడీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వం చెప్పడం సమస్యను పక్కదారిపట్టించే యత్నమే.
సామాన్యులను రాబందుల్లా పీక్కుతినే నయా ఉదారవాద విధానాలను నాడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ సర్కారు భుజాన మోసినా…నేడు ఎన్డీయే నెత్తిన పెట్టుకున్నా అది దారుణమే! మోడీ నేతృత్వంలోని సర్కారు..లేటరల్‌ నియామకాల విషయంలో ఆత్రం ఎందుకు ప్రదర్శించింది? స్వామి కార్యం, స్వకార్యం పూర్తవుతుందన్నట్టుగా..తనను అందలమెక్కించేందుకు వేల కోట్లు రూపాయలు ఖర్చుపెట్టే అదానీ, అంబానీలాంటి కార్పొరేట్ల మనుషులను, సమాజాన్ని మత, కుల ప్రాతిపదికన నిలువునా చీల్చే కరడుగట్టిన సంఘపరివార్‌ వాదులను కేంద్ర ప్రభుత్వ కీలక విభాగాల్లోని ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించేందుకే ఈ తొందర.
ఆది నుంచీ రిజర్వేషన్లపై మండిపాటే ఆరెస్సెస్‌, బీజేపీ విధానం కదా? నాడు మండల్‌ కమిషన్‌ సిఫార్సులను వ్యతిరేకిస్తూ.. ‘మండల్‌.. కమండల్‌’ అంటూ దేశవ్యాప్తంగా వీరంగం వేసిన చరిత్రా వారిదే! రిజర్వేషన్లిచ్చే ప్రభుత్వరంగాన్నే చాపచుట్టి కార్పొరేట్లకు కట్టబెడుతున్న, దేశవ్యాప్త కులగణనకు మోకాలొడ్డుతున్న వర్తమానమూ వారిదే! ఇప్పటికే గవర్నర్లు సహా రాజ్యాంగంలోని పలు కీలక సంస్థల్లోకి కరడుగట్టిన ఆరెస్సెస్‌ వాదులను చొప్పించిన మోడీ ప్రభుత్వం.. సొంతంగా మెజారిటీ లేకపోయినా అవే పద్ధతులను కొనసాగించడం, మనుస్మృతి సామాజిక ఆదేశాన్ని అమలు చేయడమే. అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లోకి పరివార్‌ మనుషులను చొప్పించేందుకు 2014లో అధికారానికి వచ్చినప్పటి నుండీ మోడీ సర్కారు తెగబడుతోంది. లేటరల్‌ ఎంట్రీ విషయంలో వచ్చిన ఐక్య ప్రతిఘటన ప్రభుత్వ మెడలు వంచింది. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ తిరోగమన విధానాలన్నింటినీ తిప్పికొట్టాలి.