– తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాలకు కమిటీలు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబర్చిన రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ దిశలో జరిగిన తప్పదాలను అంచనా వేసేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ పేలవమైన పనితీరును అంచనా వేయడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, కర్నాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లకు నిజ నిర్ధారణ కమిటీలు వేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి నిజనిర్ధారణ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు పిజె కురియన్, రఖీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు. అలాగే మధ్యప్రదేశ్ కు పృథ్వీరాజ్ చవాన్, సప్తగిరి ఉల్కా, జిగేశ్ మేవానీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ కు వీరప్ప మొయిలీ, హరీశ్ చౌదరి, ఓడిశాకు అజరు మాకెన్, తారిక్ అన్వర్ లకు బాధ్యతలు ఇచ్చారు. ఇక ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలకు కలిపి పి.ఎల్. పునియా, రజనీ పాటిల్ లకు చోటు కల్పించారు. కర్నాటక కమిటీకి మధుసూదన్ మిస్త్రీ, గౌరవ్ గొగోరు, హిబీ ఈడెన్ లను సభ్యులుగా నియమించారు.
అందుకే నిజనిర్ధారణ కమిటీ
దక్షిణాదిలో తెలంగాణ నుంచి భారీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. కనీసం తెలంగాణ నుంచి దాదాపు 10- 12 ఎంపీ స్థానాలు గెలుస్తామని భావించింది. అయితే ఊహించని ఫలితాలతో ఎనిమిది స్థానాల్లో గెలిచి, బీజేపీతో సమానంగా నిలిచింది. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని సైతం అధిష్టానం పూర్ ఫార్ఫార్మెన్స్ స్టేట్ కేటగిరిలో చేర్చి నిజనిర్ధారణ కమిటీ వేసినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఇక కాంగ్రెస్ కు మధ్యప్రదేశ్, ఢిల్లీలు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాగే ఒడిశాలోనూ బీజేపీ పుంజుకుంది. చత్తీస్‌గఢ్ లో అసెంబ్లీ మాదిరిగానే, లోక్ సభ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. అధికారంలో ఉన్న కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. మరోసారి ఇక్కడ బీజేపీ బలం నిరూపించుకుంది. అయితే, ఆశించిన స్థానాలు రాకపోయినా… గట్టి పోటీని ఇచ్చింది. ఉత్తరఖండ్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సీట్లు గెలవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.