– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు…
నవతెలంగాణ – కోదాడ (రూరల్)
కోదాడ తాసిల్దార్ కార్యాలయం అవినీతి మయంగా మారింది. కంచే చేను వేసిన చందంగా రెవెన్యూ అధికారులకు రైతుల కష్టసుఖాలు తెలుస్తాయి అని ఉద్దేశం తోటి గతంలో ఉన్న ప్రభుత్వం రెవెన్యూ శాఖకు భూ రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పజెప్పడంతో, రెవెన్యూ అధికారులు కూడా రైతులను పీడిస్తూ వాటి రిజిస్ట్రేషన్లకు డబ్బులను అందినకాడకల్లా దోచుకుంటున్నారు. పై అధికారులు లంచాల కోసం కింద అధికారులతో పనులు చేయించుకుని దొరికినప్పుడు వారిని బలి పశువులుగా చేస్తున్నారు. ఇటీవల ధరణి ఆపరేటర్ వెంకయ్య రైతులను పైసలు అడుగుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయనను విధులనుండి తొలగించారు. ప్రస్తుతం మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలోని నర్రా గురుప్రసాద్ మరణించడంతో వారి వారసులకు భార్య నర్రా పద్మ, నర్ర కోటేశ్వరరావు, నర్రా భరత్ లకు ఫౌతి కోసం 29వ తేదీ సెప్టెంబర్ 2023న మీ సేవలో రూ.50 వేల రూపాయలు చలానా, ధరణి నందు ఫౌతీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది రిజెక్ట్ చేసి వారిని అనేక ఇబ్బందులు పెట్టి, చివరకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి… రూ.50,000 రూపాయలు నాగార్జున అనే వ్యక్తి ద్వారా కాపుగల్లు గ్రామానికి పంపించి లంచం తీసుకున్నారు అని తాసిల్దార్ సాయి గౌడ్, ఆర్ ఐ సుజిత్ కుమార్ ల పై బాధితులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రూ.1,00,000 డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కి ఇవ్వాలని, ధరణి ఆపరేటర్ నవీన్ రెడ్డి ద్వారా రైతుల్ని డిమాండ్ చేస్తున్న వాయిస్ రికార్డింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంత జరుగుతున్నా.. కొంతమంది అధికారులను కాపాడడం కోసం వార్త బయటకు పొక్కకుండా డబ్బులు ఎర చూపి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి విచారించి, రైతుల సమస్యలు పరిష్కరించి తప్పు చేసిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.