– మోడీ ప్రభుత్వ రాతపూర్వక హామీని అమలు చేయాలి : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-ముషీరాబాద్
రైతులపై అణచివేత కొనసాగుతోంది.. మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఎలక్టోరల్ బాండ్‌లపై సుప్రీం కోర్టు తీర్పు ద్వారా వెల్లడైన కార్పొరేట్ అవినీతిని బహిర్గతం చేయాలి.. అని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. దేశ రాజధాని సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ నిరసనలో వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్యపద్మ, జక్కుల వెంకటయ్య, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడారు.
సంయుక్త కిసాన్ మోర్చాతో 9 డిసెంబర్ 2021న కేంద్రంతో జరిగిన చర్చల్లో.. చట్టబద్ధంగా పంటల సేకరణ, సమగ్ర రుణమాఫీ, విద్యుత్ ప్రయివేటీకరణ బిల్లు, లఖింపూర్ ఖేరీలో రైతుల ఊచకోతకు ప్రధాన కుట్రదారు హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించడం, ప్రాసిక్యూట్ చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. వాటి అమలు కోసం తిరిగి ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై పంజాబ్ సరిహద్దులో అణచివేత కొనసాగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, అణచివేత, నియంతృత్వ వైఖరిని ఖండించాలన్నారు. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్‌లు, విద్యుత్ చట్టం సవరణలు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లు, లాభదాయకమైన పబ్లిక్ సెక్టార్ల విక్రయాలు, ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని చెప్పారు. ప్రభుత్వ వనరులన్నింటినీ కార్పొరేట్ కుబేరులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలక్టోరల్ బాండ్‌లపై సుప్రీం కోర్టు తీర్పు ద్వారా వెల్లడైన కార్పొరేట్ అవినీతిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అవినీతిని చట్టబద్ధం చేసి, పార్టీ ఫండ్‌గా వేల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం పోగు చేసిందని ఆరోపించారు. బీజేపీ అవినీతిని చట్టబద్ధం చేయడం ద్వారా వేల కోట్లను కూడబెట్టిందన్నారు. విరాళాల జాబితాలో బీజేపీ, ఇతర పార్టీలకు జమ అయిన మొత్తాన్ని తప్పనిసరిగా బహిరంగపరచాలని, రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, పట్నం రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం నాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
మోడీ చిత్రపటానికి వినతి
సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం), అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మోడీ చిత్రపటానికి మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఆకుల పాపయ్య, ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల న్యాయమైన డిమాండ్‌లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
వారం రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతంలో, హర్యానాలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గత రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.