– దర్యాప్తు ఎదుర్కొంటున్న వారు కాషాయపార్టీ వైపునకు
– 2014 నుంచి ఇలా కమలం వైపునకు వెళ్లిన కీలక నాయకులు 25 మంది
– వీరిలో 23 మందికి కేసుల నుంచి ఊరటొఆంగ్ల వార్త సంస్థ కథనం
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం బీజేపీ ‘వాషింగ్ మెషిన్’లా పనిచేస్తున్నదన్న ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలను సమర్థించే విధంగానే.. ఆ పార్టీలోకి చేరిన, సమర్థించిన నాయకుల జాబితా ఉన్నది. ఇతర పార్టీలలో ఉండి కేంద్ర ఏజెన్సీ దర్యాప్తులను ఎదుర్కొంటున్న అనేక మంది ముఖ్యమైన రాజకీయ నాయకులు బీజేపీ పంచన చేరారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరిలో 23 మంది నేతలు తమ కేసుల్లో ఊరటను పొందారు. ఒక ఆంగ్ల వార్త పత్రిక దీనికి గురించి కథనాన్ని వెలువర్చింది. ఇలా బీజేపీకి జై కొట్టి.. కేసులు, దర్యాప్తుల నుంచి ఉపశమనం పొందిన వారిలో అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ కీలక నాయకుడు సువెందు అధికారి, ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ వంటి వారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 10 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేనల నుంచి నలుగురు చొప్పున, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నుంచి ముగ్గురు, టీడీపీకి చెందిన ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), వైసీపీల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఆరుగురు రాజకీయ నాయకులు ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందే బీజేపీలోకి రావటం గమనార్హం.
అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, అశోక్ చవాన్, హిమంత విశ్వ శర్మ, సువేందు అధికారి, ప్రతాప్ సర్నాయక్, హసన్ ముష్రిఫ్, భావన గవాలీ వంటి కీలక నాయకులు బీజేపీ పక్షాన చేరి, దర్యాప్తుల నుంచి ఉపశమనం పొందినవారిలో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) డిపార్ట్‌మెంట్ వంటి కేంద్ర ఏజెన్సీలను మోడీ ప్రభుత్వం ”దుర్వినియోగం” చేయటంపై ప్రతిపక్షాలు గత కొన్నేండ్లుగా గొంతెత్తుతున్న విషయం విదితమే. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల (హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్)ను ఈడీ అరెస్టు చేసింది. మరికొందరు నేతలపై దాడి చేసి విచారణకు పిలిచింది.
బీజేపీ ”క్లీన్” పార్టీ అని చెప్పుకుం టుండగా.. ఎలక్టోరల్ బాండ్లతో పాటు దర్యాప్తు సంస్థల కేసులను ఎదుర్కొంటున్న నాయకులు కాషాయపార్టీకి ఫిరాయించటం వంటివి అసలు వాస్తవాలను తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్ అవినీతి కేసులో సీబీఐ క్లోజర్ రిపోర్టు దాఖలు చేసిందనీ, అక్రమ మైనింగ్ కుంభకోణం నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారని ఆంగ్ల వార్త సంస్థ వివరించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 95 శాతం ఈడీ కేసులు ప్రతిపక్ష ఆప్ నేతలపైనే ఉన్నాయని తేలింది. 2014 నుంచి 2022 మధ్య, 121 మంది ప్రముఖ నాయకులు ఈడీ దర్యాప్తు కిందకు వచ్చారని, వారిలో 115 మంది ప్రతిపక్షాలకు చెందినవారేనని సదరు ఆంగ్ల వార్త సంస్థ తన కథనంలో వివరించింది.